హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సౌర విద్యుత్ ఆవశ్యకత మనకు తెలిసిందే! కానీ, విద్యుత్ ఫలకాల ఏర్పాటు నుంచి కొనుగోలు, ఇన్‌స్టలేషన్, నిర్వహణ, ప్రభుత్వ రాయితీలు తీసుకోవటం వరకూ ప్రతిదీ పెద్ద పనే. పెద్ద స్థాయిలో సోలార్ పవర్‌ను ఏర్పాటు చేసే కార్పొరేట్ సంస్థలకైతే మరీనూ. జస్ట్! వీటన్నింటికీ సింపుల్ సొల్యూషన్ అందిస్తోంది ప్రాకృతిక్ పవర్. ‘హర్‌ఘర్‌సోలార్.కామ్’ పేరిట సేవలందిస్తున్న ఈ స్టార్టప్ గురించి మరిన్ని వివరాలు కంపెనీ కో–ఫౌండర్, విశాఖపట్నానికి చెందిన తెలుగమ్మాయి సాహిత్య సింధు ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. అవి ఆమె మాటల్లోనే...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల వివరాలను ప్రజలకు చేరవేసే సోషల్ స్టార్టప్ ఇండియన్ ఐరిస్ మాదే. ఈ క్రమంలో చాలా లీడ్స్ సోలార్ పవర్ ఏర్పాటు, ప్రభుత్వ రాయితీల గురించి వచ్చేవి. అప్పుడే అనిపించింది.. మనమే ప్రత్యేకంగా సౌర విద్యుత్ సొల్యూషన్స్ సార్టప్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందా అని? ఇంకేముంది! మహీందర్ సింగ్ రావు, నారాయణ్ సింగ్ రావుతో కలిసి నోయిడా కేంద్రంగా గతేడాది హర్‌ఘర్‌సోలార్.కామ్‌ను ప్రారంభించాం. వ్యక్తిగత, కార్పొరెట్ అవసరాలకు అనుగుణంగా సోలార్ పవర్ ఏర్పాటు, నిర్వహణ, రాయితీలు అన్నీ ఒకేచోట అందించడమే మా ప్రత్యేకత.
100కు పైగా క్లయింట్స్..
ప్రస్తుతం తెలంగాణ, ఒరిస్సా, రాజస్తాన్, యూపీ, ఉత్తరాఖండ్, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో 100కి పైగా వ్యక్తిగత, కార్పొరేట్ క్లయింట్లు ఉన్నారు. సుమారు 6,135.7 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తున్నాం. వీటి విలువ రూ.16 కోట్లు. త్వరలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో పలు ప్రాజెక్ట్‌లను చేపట్టనున్నాం. సెంట్రల్ ఆఫ్రికాలో 25 మెగావాట్ల రెండు ప్రాజెక్ట్‌లతో చర్చలు జరుగుతున్నాయి.
సోలార్ పవర్ ఒప్పందాలు..
మా క్లయింట్ల జాబితాలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కాలేజీలు కూడా ఉన్నాయి. హైదరాబాద్‌లోని డ్రైల్యాండ్ అగ్రికల్చర్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, జోధ్‌పూర్‌లోని నిఫ్ట్, ఢిల్లీలోని అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్, భరత్‌పూర్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ ర్యాప్‌సీడ్ మస్టర్డ్ రీసెర్చ్ వంటివి ఉన్నాయి. టాటా పవర్, రెన్‌వైస్, వరీ సోలార్, విక్రమ్ సోలార్ వంటి 10 మంది సోలార్ ప్రొవైడర్లతో ఒప్పందం చేసుకున్నాం. ఇన్వెర్టర్ల కోసం పాలీక్యాబ్, డెల్టా, ఏబీబీ, ప్రోనిస్ కంపెనీలతో, ప్యానెల్స్ కోసం ఎన్కే సోలార్, మెహర్ సోలార్‌లతో ఒప్పందాలున్నాయి.
రూ.60 లక్షల టర్నోవర్..
ప్రస్తుతం మా కంపెనీలో 15 మంది శాశ్వత ఉద్యోగులున్నారు. మా క్లయింట్లకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రూ.5 కోట్ల రాయితీలందించాం. గతేడాది రూ.60 లక్షల టర్నోవర్‌ను నమోదు చేశాం. వచ్చే ఏడాది కాలంలో 10 మెగావాట్ల ప్రాజెక్ట్‌లు, రూ.20 కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలని లకి‡్ష్యంచాం’’ అని సింధు వివరించారు.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.comకు మెయిల్ చేయండి...
‘సోలార్’.. కేరాఫ్ ప్రాకృతిక్ పవర్!
Published Sat, Jul 20 2019 6:11 AM | Last Updated on Sat, Jul 20 2019 6:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment