క్లిక్ చేస్తే లంచ్ బాక్స్!
కొందరు బరువు తగ్గాలి. మరికొందరు కాస్త పుష్టిగా మారాలి. వీటికోసం జిమ్, యోగా సెంటర్లలో గడిపేవారు ఎక్కువమందే. అయితే వ్యాయామంతో పాటు సరైన ఆహారం ఉంటేనే ఇదంతా సాధ్యమని నిపుణులు చెబుతూనే ఉంటారు. మరి ఏం తింటే బెటర్? చక్కని ఆహారం ఎక్కడ దొరుకుతుంది? ఈ ప్రశ్నలన్నిటికీ తమ ‘డైట్ ఆన్ క్లిక్’తో సమాధానం చెబుతున్నారు ఈ యువకులు.
బరువు తగ్గటానికైనా, పెరగటానికైనా రహస్యం సరైన సమయానికి సరైన పౌష్టికాహారం తీసుకోవటమేనంటున్నారు వీళ్లు. దీనికోసం తమ ‘డైట్ ఆన్ క్లిక్.కామ్‌లో’ ఆర్డరిస్తే చాలు. మధ్యాహ్నం భోజనం.. సాయంత్రం స్నాక్స్ రెండూ ఒకేసారి అందించడమే వీరి ప్రత్యేకత. మరిన్ని వివరాలు సంస్థ వ్యవస్థాపకులు, ఆనంద్, స్వరూప్‌ల మాటల్లోనే...
♦ పౌష్టికాహారానికి ‘డైట్ ఆన్ క్లిక్’
♦ ఒకే సమయంలో లంచ్, స్నాక్స్ కూడా..
♦ హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో సేవలు
♦ నిధుల సమీకరణ తరవాత విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో .ఈ రోజుల్లో ప్రతిదానికీ ఆన్‌లైనే వేదికైంది. అయితే ఆన్‌లైన్‌లో ఫుడ్ అందిస్తున్న సంస్థల మెనూ చూస్తే... బిర్యానీలు.. కేలరీలు ఎక్కువుండే నాన్‌వెజ్ ఐటమ్స్, స్నాక్స్ విషయానికొస్తే పిజ్జాలు.. సమోసాలు.. ఇవే కనిపిస్తుంటాయి. అమ్మేవారి సంగతి పక్కన పెడితే.. తినేవారి ఆరోగ్యం మాటేంటి? ఆకలితో కొందరు.. వేరే అవకాశం లేక ఇంకొందరు మొత్తం మీద అందరూ అనారోగ్యాన్ని ‘కొని’తెచ్చుకుంటున్నారు. మేం ఐటీ ఉద్యోగులం కావటంతో మాకూ ఈ బాధలు తప్పలేదు.
దీంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని... అదీ సమయానికి అందించే సంస్థలేవైనా ఉన్నాయా! అని వెతికితే ఒక్కటీ కనిపించలేదు. అప్పుడే అనిపించింది... వేరే ఎవరో చేయడమెందుకు మనమే రంగంలోకి దిగితే బాగుంటుంది కదా... అని. ఇంకేముంది! ఇంటర్మీడియెట్ నుంచి స్నేహితులమైన మేం... శరత్ అనే మరో స్నేహితుడితో కలసి రూ.9 లక్షల పెట్టుబడి పెట్టి కూకట్‌పల్లిలోని ఫోర్త్ ఫేజ్‌లో డైట్ ఆన్ క్లిక్ పేరిట కిచెన్‌ను ఏర్పాటు చేశాం.
లంచ్, స్నాక్స్ రెండూ ఒకేసారి...
డబ్బా బుక్ చేసుకోవాలనుకుంటే ఉదయం 11 గంటల లోపు చేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12-2 గంటల మధ్య సరఫరా చేస్తాం. ఇందులోనే సాయంత్రానికి కావాల్సిన స్నాక్స్ కూడా ఉంటాయి. ప్రతీ రోజూ మెనూ మారుతుంటుంది. ప్రస్తుతం రోజుకు 160కి పైగా ఆర్డర్లొస్తున్నాయి. నేరుగా కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా ఎక్కువే. ఒక్క రోజుకైతే డబ్బా ధర రూ.90. వారం, నెల వారీ ప్యాకేజీలకైతే ఇంకా తక్కువే పడుతుంది.
వారం ప్యాకేజీ డబ్బా ధర రూ.85, నెల ప్యాకేజీలో డబ్బా ధర రూ.79. సర్వీస్ చార్జీలుండవు. శని, ఆదివారాలు సెలవు. ఇంకో ప్రత్యేకతేమిటంటే మా రెగ్యులర్ కస్టమర్లకు మేం న్యూట్రికేర్ వంటి ప్రముఖ సంస్థల చేత ఆహారం విషయంలో కౌన్సిలింగ్ కూడా ఉచితంగానే ఇప్పిస్తున్నాం.
నిధుల సమీకరణపై దృష్టి..
ప్రస్తుతం కూకట్‌పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో సేవలందిస్తున్నాం. తొలిసారిగా నిధుల సమీకరణపై దృష్టి పెట్టాం. ఆ తరవాత హైదరాబాద్ మొత్తాన్ని కవర్ చేస్తాం. గత నెలలో రూ.2.70 లక్షల వ్యాపారాన్ని చేరుకున్నాం. ప్రస్తుతం 8 మంది డెలివరీ బాయ్స్, వివిధ రెస్టారెంట్లలో 18 ఏళ్ల అనుభవమున్న ఓ చెఫ్‌తో పాటు ముగ్గురు సహాయకులను నియమించుకున్నాం.
డైట్ ఆన్ క్లిక్ మెనూ ఇదే..
సోమవారం: బీట్ రూట్ రోటీ, పాలకూర పప్పు, చిక్కుడు కాయ కర్రీ, పుదీనా రైస్, బ్రౌన్/వైట్ రైస్, పెరుగు.
స్నాక్స్: మొలకెత్తిన పెసలు, పళ్లు.
మంగళవారం: క్యారెట్ రోటీ, మెంతికూర పప్పు, రాజ్మ కర్రీ, పెరుగు, సోయా రైస్, బ్రౌన్/వైట్ రైస్.
స్నాక్స్: రావి బిస్కెట్లు, ఫైబర్ రిచ్ స్వీట్ పొటాటో.
బుధవారం: మేతి రోటీ, టమాటా పప్పు, టోఫూ ఆలు మిక్స్‌డ్ కర్రీ, పెరుగు, బీట్ రూట్ రైస్, బ్రౌన్/వైట్ రైస్.
స్నాక్స్: ఉలవల లడ్డూ, స్వీట్ కార్న్.
గురువారం: మల్టీ గ్రెయిన్ రోటీ, దోసకాయ పప్పు, క్యాలీఫ్లవర్ గ్రీన్ పీస్ కర్రీ, పెరుగు, కొబ్బరన్నం, బ్రౌన్/వైట్ రైస్.
స్నాక్స్: మిక్స్‌డ్ నట్స్, పీనట్ సలాడ్.
శుక్రవారం: సొరకాయ రోటీ, ఉలవచారు, వంకాయ కర్రీ విత్ ఉలవల పౌడర్, పెరుగు, రాగి జావ, బ్రౌన్/వైట్ రైస్
స్నాక్స్: మిక్స్‌డ్ ఫ్రూట్స్, నల్ల శనగల సలాడ్.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే
startups@sakshi.comకు మెయిల్ చేయండి...