ఫిట్‌నెస్‌కు ఫిట్‌మీల్స్‌! | new startup dairy | Sakshi
Sakshi News home page

ఫిట్‌నెస్‌కు ఫిట్‌మీల్స్‌!

Published Sat, Nov 18 2017 1:29 AM | Last Updated on Sat, Nov 18 2017 1:29 AM

new startup dairy - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డరివ్వటం మెట్రో నగరాల్లో కామన్‌. కానీ, ఆర్డరిచ్చిన ఆహారాన్ని ఎలా తయారు చేస్తున్నారు? ఎంత శుభ్రత పాటిస్తున్నారు? అసలు ఎలాంటి ఉత్పత్తులను వినియోగిస్తున్నారనేది మనకు తెలియదు. రుచిగా, వేడిగా ఉంటే చాలు. తినేస్తాం! కానీ, న్యూట్రిషన్‌ ఫుడ్‌ను అందించడం, అందులోనూ ఆర్డరిచ్చిన ఫుడ్‌లో ఏవి ఎంత పాళ్లలో ఉన్నాయో చెప్పటం ఇవన్నీ చేస్తే!! కస్టమర్లకు నాణ్యమైన ఫుడ్‌తో పాటూ నమ్మకమూ ఏర్పడుతుంది. ఇదే హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఫిట్‌మీల్స్‌ ప్రత్యేకత. మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్‌ జీశాన్‌ అహ్మద్‌ మాటల్లోనే..

అపూర్వ రావ్, అమన్‌ రాయగురు, భవ్యాంత్‌ కొల్లి, నేను నలుగురం కలసి దీన్ని ఏర్పాటు చేశాం. చదువు, ఉద్యోగం రీత్యా మేం ఇతర నగరాల్లో, విదేశాల్లో ఉన్నాం. అప్పుడు మాకు ఎదురైన ప్రధాన సమస్య ఆహారం. టైమ్‌ లేకపోవటం, వంట సరిగా రాకపోవటం.. కారణమేదైనా బయటి ఫుడ్‌ దిక్కయ్యేది. దీంతో అనారోగ్య సమస్యలు. వీటికి చెక్‌ చెప్పేందుకే ఆరోగ్యకరమైన, సేంద్రియ ఆహారం కోసం వెతికాం. అదే ఫిట్‌మీల్స్‌కు ప్రాణం పోసింది. పుట్టిపెరిగింది హైదరాబాద్‌ కావటంతో రూ.35 లక్షల పెట్టుబడితో 2015లో ఫిట్‌మీల్స్‌ ఇండియా.కో.ఇన్‌ను ఆరంభించాం.

8 కిచెన్స్‌; 4 ఔట్‌లెట్లు..: ప్రస్తుతం హైదరాబాద్‌లో సేవలందిస్తున్నాం. సోమాజిగూడ, బంజారాహిల్స్, కృష్ణా నగర్, శ్రీనగర్‌ కాలనీ, జూబ్లిహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలల్లో 8 కిచెన్స్‌ ఉన్నాయి. ఇందులో 4 మెయిన్‌ కిచెన్స్‌. ఒక్కోటి 2.500 చ.అ.ల్లో ఉంటుంది. 4 ఔట్‌లెట్లు కూడా ఉన్నాయి. ఆహారం తయారీ, ప్యాకేజింగ్, డెలివరీ అన్నీ మేమే చేస్తాం. ఐదుగురు షెఫ్‌లున్నారు. శాకాహారం, మాంసాహారం కలిపి... ఇండియన్, కాంటినెంటల్, ఇంటర్నేషనల్‌ వెరైటీలు 2,500 వరకూ ఉన్నాయి. కూరగాయలు, మాంస ఉత్పత్తులు, ఇతరత్రా దినుసుల కోసం స్థానిక వెండర్లు, రైతులతో ఒప్పందం చేసుకున్నాం. దీంతో తక్కువ ధరకు నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తాయి.

వైజాగ్, భీమవరం, రాజమండ్రి..
ప్రస్తుతం మాకు 10 వేల మంది రిజిస్టర్‌ కస్టమర్లున్నారు. ఇందులో వెయ్యి మంది వరకు సబ్‌స్క్రిప్షన్‌ యూజర్లు. వారం రోజుల సబ్‌స్క్రిప్షన్‌కు రూ.3,373 చార్జీ. టిఫిన్, లంచ్, డిన్నర్‌ అన్నీ కస్టమైజ్డ్‌ రీతిలో ఆర్డరివ్వొచ్చు. త్వరలోనే విశాఖ, భీమవరం, రాజమండ్రిలల్లో ఫ్రాంచైజీ విధానంలో ఔట్‌లెట్లను ప్రారంభిస్తున్నాం. ఒక్కో స్టోర్‌ 1,500 చదరపు అడుగుల్లో ఉంటుంది. ఒకో ఔట్‌లెట్‌కు రూ.15 లక్షలు ఖర్చవుతుంది. ఫ్రాంచైజర్లకు ఫిట్‌మీల్స్‌ నుంచి రెసిపీ, సాఫ్ట్‌వేర్, టెక్నాలజీ సేవలందిస్తాం. 3 నెలల్లో బెంగళూరులో సేవలను ప్రారంభిస్తాం. ఇంద్రానగర్‌లో ప్రధాన కిచెన్‌ నెలకొల్పుతున్నాం. ఏడాదిలో ముంబై, గుర్గావ్‌లకూ విస్తరించాలనేది లక్ష్యం.

రూ.12 కోట్ల వ్యాపార లక్ష్యం..
ప్రస్తుతం రోజుకు 1,500 ఆర్డర్లొస్తున్నాయి. ఐటీ, కార్పొరేట్లు, ఎగువ మధ్యతరగతి కస్టమర్లు అధికం. ఎక్కువగా నాన్‌వెజ్‌ ఆర్డర్లు, అందులోనూ లంచ్‌ ఆర్డర్లే ఉంటాయి. ప్రస్తుతం 64 మంది ఉద్యోగులున్నారు. గతేడాది రూ.2.25 కోట్ల టర్నోవర్‌ సాధిం చాం. వ్యాపారంలో ఆన్‌లైన్‌ వాటా 70%, ఔట్‌లెట్ల వాటా 30%. ఈ ఏడాది రూ.6 కోట్ల వ్యాపారాన్ని ల క్ష్యించాం. బెంగళూరు విస్తరణతో రూ.12 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంటాం’’ అని జీశాన్‌ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement