హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎస్‌ఎంఈ)లకు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా, విస్తరించాలన్నా ప్రధానంగా ఎదురయ్యే సమస్య నిధులే!! పోనీ, నిధులు సమకూరాయనుకుంటే ఆయా పరిశ్రమకు అవసరమైన ముడి పదార్థాలను కొనుగోలు చేయటం మరో సమస్య. ఈ రెండింటికీ ఒకే వేదికగా పరిష్కారం చూపిస్తోంది ‘ఆఫ్ బిజినెస్.కామ్’! అవునండి.. ఎస్‌ఎంఈలకు కేవలం నిధులను అందించడమే కాకుండా.. అవే నిధులతో అవసరమైన ముడిసరుకుల కొనుగోలు చేసే వీలు కల్పించడమే దీని ప్రత్యేకత.
నిధుల కోసం పెట్టుబడిదారులతో.. ముడి పదార్థాల కోసం తయారీ సంస్థలతో ఒప్పందం కూడా చేసుకుంది. మరిన్ని వివరాలు ఆఫ్ బిజినెస్.కామ్ సీఈవో ఆశిష్ మోహపత్రా ‘స్టార్టప్ డైరీ’కి వివరించారు. ఆఫ్‌బిజినెస్.కామ్ ప్రారంభానికి కారణం నాతో పాటు ఉన్న కో–ఫౌండర్లు పెద్ద ఎంఎన్‌సీ కంపెనీల్లో పని చేయడమే. బడా కంపెనీలకు రుణాలు, పెట్టుబడులు పొందడం పెద్ద ఇబ్బందేమీ కాదు. కానీ, ఎస్‌ఎంఈల పరిస్థితికొస్తే? ఇదే ఆలోచన ఆఫ్ బిజినెస్.కామ్‌కు పునాది వేసింది.
నిధుల పంపిణీతోనే సరిపెట్టకుండా ఎస్‌ఎంఈలకు ముడి పదార్ధాల కొనుగోలులోనూ సేవలందించాలని నిర్ణయించుకొని రూ.32 కోట్ల పెట్టుబడులతో 2015 ఆగస్టులో గుర్గావ్ కేంద్రంగా ఆఫ్‌బిజినెస్.కామ్‌ను ప్రారంభించాం. నాతో పాటూ రుచి కర్లా, భువన్ గుప్తా, చంద్రాన్షు, నితిన్ జైన్, వసంత్ శ్రీధర్, బిస్వజిత్, ధావల్ రాడియా కో–ఫౌండర్లుగా ఉన్నారు. ఆఫ్ బిజినెస్.కామ్ షరతేంటంటే.. ఎస్‌ఎంఈలు నిధులతో పాటూ ముడి పదార్థాలను కూడా విక్రయ సంస్థల వద్దే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
1,200 ఎస్‌ఎంఈలు; రూ.800 కోట్ల నిధులు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, ఎన్‌సీఆర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 1,200 ఎస్‌ఎంఈలు మా కస్టమర్లుగా ఉన్నారు. ఇందులో 110 ఎస్‌ఎంఈలు తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నాయి. ప్రారంభించిన 16 నెలల్లో రూ.800 కోట్లను అందించాం. ఎస్‌ఎంఈని బట్టి రూ.6 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకూ అందిస్తాం. నెలకు రూ.50 కోట్ల నిధుల వితరణ చేస్తుంటాం. వడ్డీ రేటు సెక్యూర్డ్ అయితే ఏడాదికి 12 శాతం, అన్‌సెక్యూర్డ్ 18 శాతంగా ఉంది.
త్వరలోనే రసాయనాలు, గార్మెట్ కొనుగోలు కూడా..
ప్రస్తుతం మా సంస్థ నుంచి ఉక్కు, అల్యూమినియం, ప్లాస్టిక్, పేపర్ ప్యాకేజ్, సిమెంట్, ఇనుము వంటి నిర్మాణ సామగ్రి మెటీరియల్స్‌ను కొనుగోలు చేయవచ్చు. ఆయా ఉత్పత్తుల కొనుగోలు కోసం సెయిల్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ, జిందాల్, వైజాగ్, రాఠి వంటి 500లకు పైగా తయారీ సంస్థలు, డిస్ట్రిబ్యూటర్లతో ఒప్పందం చేసుకున్నాం. దీంతో ధరలు 8 శాతం వరకు తక్కువగా ఉంటాయి. నెల రోజుల్లో పారిశ్రామిక రసాయనాలు, గార్మెట్ ముడిసరకులనూ చేర్చనున్నాం.
రూ.150 కోట్ల నిధుల సమీకరణ..
ఎస్‌ఎంఈ కస్టమర్ నుంచి వడ్డీ, డిస్ట్రిబ్యూటర్ నుంచి కమీషన్ 2 శాతం తీసుకుంటాం. ఇదే మా వ్యాపార విధానం. గతేడాది రూ.220 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నాం. ఇందులో 18 శాతం వాటా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలది ఉంటుంది.
ఈ ఏడాది రూ.900 కోట్ల వ్యాపారాన్ని జనవరి నుంచి మహారాష్ట్రలోని ఎస్‌ఎంఈలకూ మా సేవలను అందించనున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 180 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు రూ.120 కోట్ల నిధులను సమీకరించాం. మ్యాట్రిక్స్ పార్టనర్స్, జోడియస్ టెక్నాలజీస్‌తో పలు టెక్నాలజీ కంపెనీల సీఈఓలు ఈ పెట్టుబడులు పెట్టారు. ‘‘వచ్చే 6 నెలల్లో రూ.150 కోట్ల నిధులను సమీకరించనున్నాం. ఈ రౌండ్‌లో పాత ఇన్వెస్టర్లతో పాటూ కొత్తవాళ్లూ పాల్గొంటారని’’ ఆశిష్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment