క్విప్ ఇష్యూలతో ఇప్పటికే రూ. లక్ష కోట్లకు పైగా సమీకరణ
లిస్టెడ్ కంపెనీల నిధుల సమీకరణ జోరు...
2020 నాటి రికార్డు బ్రేక్...
తాజాగా జొమాటో రూ.8,500 కోట్ల క్విప్ డెలివరీ...
ఈ ఏడాది స్టాక్ మార్కెట్ల దూకుడుతో నిధుల సమీకరణ కూడా రికార్డుల మోత మోగిస్తోంది. ఒకపక్క పబ్లిక్ ఇష్యూల (ఐపీఓ) వరదతో కంపెనీలు లిస్టింగ్ గంట మోగిస్తుంటే... మరోపక్క, లిస్టెడ్ కంపెనీలు సైతం తగ్గేదేలే అంటున్నాయి. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్విప్) మార్గంలో వేల కోట్లను సమీకరించడం ద్వారా విస్తరణ, ఇతరత్రా అవసరాలను తీర్చుకుంటున్నాయి.
ఈ ఏడాది క్విప్ ఇష్యూల బాట పడుతున్న లిస్టెడ్ కంపెనీల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. నవంబర్ నాటికి దాదాపు 75 కంపెనీలు ఇప్పటికే రూ.1,0,2000 కోట్లను సమీకరించాయి. దీంతో 2020 నాటి రూ.80,800 కోట్ల సమీకరణ రికార్డును బ్రేక్ చేసింది. భారీగా సమీకరిస్తున్న ఈ నిధులను కార్పొరేట్ కంపెనీలు తమ బ్యాలెన్స్ షీట్లను బలోపేతం చేసుకోవడానికి, ప్లాంట్ల విస్తరణ తదితర అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నాయి.
ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో రూ.8,500 కోట్లు, కేఈఐ ఇండస్ట్రీస్ రూ.2,000 కోట్లు చొప్పున తాజాగా సమీకరించాయి. సెప్టెంబర్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా రూ.5,000 కోట్ల క్విప్ ఇష్యూను పూర్తి చేసింది. జూలైలో మెటల్–మైనింగ్ దిగ్గజం వేదాంత రూ.8,500 కోట్లను క్విప్ రూట్లో సమీకరించడం తెలిసిందే. వేదాంత ఈ నిధులను రుణ భారం తగ్గించుకోవడం కోసం వినియోగించుకుంది.
అదే నెలలో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ రూ.8,373 కోట్ల క్విప్ నిధులను దక్కించుకుంది. విద్యుత్ ట్రాన్స్‌మిషన్ కార్యకలాపాల విస్తరణ, స్మార్ట్ మీటరింగ్, రుణాల తిరిగి చెల్లింపు కోసం వీటిని వెచి్చంచనుంది. మరిన్ని కంపెనీలు క్విప్ బాటలో ఉండటంతో మొత్తంమీద ఈ ఏడాది క్విప్ సమీకరణ మరింత ఎగబాకే అవకాశాలున్నాయి.
నిధులతో రెడీ...
దేశీ కార్పొరేట్ దిగ్గజాలు కొత్త ప్లాంట్ల ఏర్పాటుతో పాటు ఇతర కంపెనీలను కొనుగోలు చేయడం ద్వారా భారీగా విస్తరించే ప్రణాళికల్లో ఉన్నాయి. తద్వారా పోటీ కంపెనీలతో తలపడేందుకు, మార్కెట్ వాటాను పెంచుకునేందుకు నిధులను సిద్ధం చేసుకుంటున్నాయని కోటక్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌కు చెందిన క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ వి. జయశంకర్ పేర్కొన్నారు.
బెంగళూరుకు చెందిన బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ సెప్టెంబర్లో రూ.1,500 కోట్ల క్విప్ ఇష్యూకు రాగా, మరో రియల్టీ దిగ్గజం ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్టŠస్ క్విప్ ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించింది. ఏప్రిల్‌లో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ కూడా విస్తరణ ప్రణాళికల కోసం రూ.5,000 కోట్ల క్విప్ నిధులను ఖాతాలో వేసుకుంది.
ఇలా భారీ మొత్తాన్ని దక్కించుకున్న కంపెనీల్లో స్వాన్ ఎనర్జీ (రూ.3,319 కోట్లు), మాక్రోటెక్ డెవలపర్స్ (రూ.3,282 కోట్లు), యూనియన్ బ్యాంక్ (రూ.3,000 కోట్లు), కోఫోర్జ్ (రూ.2,240 కోట్లు) కొన్ని. ‘వేల్యుయేషన్స్ సానుకూలంగా ఉండటం, పటిష్టమైన సెకండరీ మార్కెట్లతో పాటు పెట్టుబడులకు ఇన్వెస్టర్లు క్యూ కడుతుండటం వంటి అంశాలు లిస్టెడ్ కంపెనీల క్విప్ జోరుకు ప్రధాన కారణం.
కొత్త ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, రుణ భారాన్ని తగ్గించుకోవడం కోసం ఈ నిధులను ఖర్చు చేస్తున్నాయి. మూలధన అవసరాల కోసం చాలా లిస్టెడ్ కంపెనీలు ఇదే రూట్‌ను ఆశ్రయిస్తున్నాయి’ అని ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్‌కు చెందిన ఈక్విటీ విభాగం హెడ్ దీపక్ కౌశిక్ చెప్పారు. ఏంజెల్ వన్, శ్యామ్ మెటాలిక్స్, టెక్నో ఎలక్ట్రిక్, లాయిడ్స్ మెటల్స్, క్రాఫ్టŠస్‌మన్ ఆటోమేషన్, చాలెట్ హోల్స్, స్టెరిలైట్ టెక్నాలజీస్ వంటివి కంపెనీలు గడిచిన కొద్ది నెలల్లో రూ.1,000–1,500 కోట్ల స్థాయిలో క్విప్ నిధులను సమీకరించాయి.
క్విప్ అంటే...
ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్టయిన కంపెనీలు నిధులను సమీకరించే సాధనాల్లో క్విప్ కూడా ఒకటి. అర్హతగల సంస్థాగత బయ్యర్లకు (క్యూఐబీ) ఈక్విటీ షేర్లను, పూర్తిగా–పాక్షికంగా షేర్లుగా మార్చుకోగల డిబెంచర్లు లేదా ఇతరత్రా సెక్యూరిటీలను జారీ చేయడం ద్వారా కంపెనీలు నిధులను సమకూర్చుకోవడానికి ‘క్విప్’ వీలు కలి్పస్తుంది. క్యాపిటల్ మార్కెట్ పెట్టుబడుల్లో విశేష అనుభవం గల, ఆరి్థకంగా బలమైన సంస్థాగత ఇన్వెస్టర్లను సెబీ క్యూఐబీలుగా నిర్దేశించింది.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment