న్యూఢిల్లీ: కొద్ది నెలలుగా సందడి చేస్తున్న ప్రైమరీ మార్కెట్ మరోసారి కళకళలాడనుంది. రానున్న రెండు నెలల్లో కనీసం 30 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టనున్నాయి. తద్వారా రూ. 45,000 కోట్లకుపైగా సమీకరించే అవకాశమున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు తెలియజేశాయి. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు సిద్ధపడుతున్న కంపెనీలలో టెక్నాలజీ ఆధారిత కంపెనీలదే పైచేయిగా నిలవనున్నట్లు పేర్కొన్నాయి. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో చేపట్టిన ఐపీవో విజయవంతంకావడంతో పలు టెక్నాలజీ సంబంధ కంపెనీలు నిధుల సమీకరణకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశాయి.
తొలుత పీఈ ఫండ్స్
జొమాటో తదితర ఆధునికతరం కంపెనీలు తొలుత ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) సంస్థల నుంచి నిధులను సమకూర్చుకుంటున్నాయి. అయితే ఇటీవల సెకండరీ మార్కెట్లు సరికొత్త రికార్డులతో కదం తొక్కుతున్న నేపథ్యంలో ప్రైమరీ మార్కెట్లు సైతం జోరందుకున్నాయి. దీంతో టెక్ ఆధారిత నవతరం కంపెనీలకు ఐపీవోలు మరో మార్గాన్ని చూపుతున్నాయి. వెరసి నిధుల సమీకరణ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు క్యూ కడుతున్నట్లు ఏంజెల్ వన్ ఈక్విటీ వ్యూహకర్త జ్యోతి రాయ్ పేర్కొన్నారు.
కారణాలివీ.
కోవిడ్–19 సెకండ్ వేవ్ నుంచి ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి పుంజుకోనుందన్న అంచనాలకుతోడు విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు), దేశీ ఫండ్స్ పెట్టుబడులు మార్కెట్లకు జోష్‌నిస్తున్నట్లు రాయ్ పేర్కొన్నారు. మరోవైపు రిటైల్ ఇన్వెస్టర్లు సైతం రికార్డ్ స్థాయిలో పెట్టుబడులకు దిగుతుండటం దీనికి జత కలుస్తున్నట్లు తెలియజేశారు. వెరసి సెకండరీ మార్కెట్ బాటలో ప్రైమరీ మార్కెట్ సైతం సందడి చేస్తున్నట్లు వివరించారు. ఇకపైన ఇదే పరిస్థితి కొనసాగితే మరో ఏడాదిపాటు మార్కెట్లు బుల్ జోరులో కదిలే వీలున్నట్లు ఇన్వెస్ట్19 వ్యవస్థాపకుడు, సీఈవో కౌశలేంద్ర జెరోధా, ట్రూ బీకన్ సహవ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ రంగం ఇందుకు దోహదం చేయనున్నట్లు అంచనా వేశారు.
40 కంపెనీలు
ఈ ఏడాది(2021)లో ఇప్పటివరకూ 40 కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా ఉమ్మడిగా రూ. 64,217 కోట్లు సమీకరించాయి. బుధవారం నుంచీ ప్రారంభకానున్న ఐపీవో ద్వారా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ రూ. 2,778 కోట్లు సమకూర్చుకోనుంది. మరోవైపు వాటాల విక్రయం ద్వారా పవర్‌గ్రిడ్ ఇన్విట్ రూ. 7,735 కోట్లు, బ్రూక్‌ఫీల్డ్ రియల్టీ ట్రస్ట్ రూ. 3,800 కోట్లు చొప్పున నిధులను సమీకరించాయి. కాగా.. 2020లో 15 కంపెనీలు రూ. 26,611 కోట్లు మాత్రమే సమకూర్చుకున్న విషయం విదితమే. ఇంతక్రితం 2017లో మాత్రమే 36 కంపెనీలు రూ. 67,147 కోట్లను ఐపీవోల ద్వారా అందుకున్నాయి.
జాబితా ఇలా..
అక్టోబర్–నవంబర్‌లో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రానున్నాయి. జాబితాలో పాలసీ బజార్ రూ. 6,017 కోట్లు, ఎమ్‌క్యూర్ ఫార్మాస్యూటికల్స్ రూ. 4,500 కోట్లు, నైకా రూ. 4,000 కోట్లు, సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ రూ. 2,000 కోట్లు, మొబిక్విక్ సిస్టమ్స్ రూ. 1,900 కోట్లు తదితరాలున్నాయి. జాబితాలో ఇంకా నార్థర్న్ ఆర్క్ క్యాపిటల్ రూ. 1,800 కోట్లు, శాఫైర్ ఫుడ్స్ రూ. 1,500 కోట్లు, ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 1,330 కోట్లు, స్టెరిటైల్ పవర్ రూ. 1,250 కోట్లు, రేట్‌గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్ రూ. 1,200 కోట్లు, సుప్రియా లైఫ్‌సైన్స్ రూ. 1,200 కోట్లు చేరినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి.
2 నెలల్లో 30 కంపెనీలు రెడీ
Published Mon, Sep 27 2021 3:58 AM | Last Updated on Mon, Sep 27 2021 3:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment