న్యూఢిల్లీ: అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా నిధులను సమీకరించడంలో కంపెనీలు ఈ కేలండర్ ఏడాది(2024)లో కొత్త రికార్డ్‌కు తెరతీశాయి. జనవరి నుంచి నవంబర్‌వరకూ దేశీ కార్పొరేట్లు రూ. 1,21,321 కోట్లు అందుకున్నాయి.
దేశీ కార్పొరేట్ చరిత్రలోనే ఇవి అత్యధికంకాగా.. స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరడం, షేర్ల అధిక విలువలు ఇందుకు సహకరిస్తున్నాయి. ప్రైమ్ డేటాబేస్ గణాంకాల ప్రకారం గతేడాది క్విప్ ద్వారా రూ. 52,350 కోట్లు మాత్రమే సమకూర్చుకున్నాయి. వెరసి రెట్టింపునకు మించి పెట్టుబడులను ఆకట్టుకున్నాయి.
క్విప్ అంటే?
లిస్టెడ్ కంపెనీలు సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ ద్వారా వేగంగా నిధులు సమీకరించేందుకు వీలు కల్పించేదే క్విప్. నవంబర్‌వరకూ 82 కంపెనీలు క్విప్‌ను చేపట్టాయి. గతేడాది కేవలం 35 కంపెనీలు రూ. 38,220 కోట్లు సమీకరించాయి. ఈ ఏడాది రికార్డుకు కారణమైన కంపెనీలలో ప్రధానంగా వేదాంతా గ్రూప్, జొమాటో, అదానీ ఎనర్జీ, వరుణ్ బెవరేజెస్ తదితరాలను ప్రస్తావించవచ్చు. వేదాంతా, జొమాటో విడిగా రూ. 8,500 కోట్లు చొప్పున అందుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment