ఫెస్టివ్యా సీఈఓ సురేష్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్‌లైన్‌లో దొరకనిదంటూ లేని ఈ రోజుల్లో ఎంతో విలువైన భారతీయ హస్తకళలు మాత్రం ఆమడ దూరంలోనే ఉండిపోయాయి. ఈ అవకాశాన్ని వ్యాపార సూత్రంగా మలుచుకుంది ఫెస్టివ్యా. మన దేశ హస్తకళలకు విదేశాల్లో ఉన్న డిమాండ్‌ను గుర్తించి ఫెస్టివ్యా.ఇన్‌ను ప్రారంభించింది. ఆన్‌లైన్ వేదికగా స్థానిక హ్యాండ్‌మేడ్ జువెలరీని విక్రయించడమే దీని పని. మన దేశంతో పాటూ అమెరికా, యూకే, సింగపూర్, మలేషియా వంటి ఆరేడు దేశాల్లో విక్రయాలు సాగిస్తోంది. మరిన్ని వివరాలు ఫెస్టివ్యా సీఈఓ సురేష్ రాధాకృష్ణన్ నాయర్, మాటల్లోనే..
37 మంది డిజైనర్స్; 3,700 ఉత్పత్తులు..
‘‘2016 మేలో రూ.20 లక్షల పెట్టుబడితో మాథ్యూ అబ్రహం రాయ్, రాహుల్ ఆర్, నిక్కీ జోసెఫ్‌తో కలిసి దీన్ని ప్రారంభించాం. ప్రస్తుతం తమిళనాడు, కేరళ, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రాంతాలకు చెందిన 37 మంది డిజైనర్ వర్తకులతో ఒప్పందం ఉంది. ఇందులో ఆనోకి, ఆరాధ్య, దిశా, అవతరణ, ఎత్నిక్ మ్యాజిక్స్, మీరా, కళాధర్ వంటి డిజైనర్స్‌కు చెందిన 3,700 రకాల ఆభరణాలున్నాయి. నగలు, గాజులు, చెవిదిద్దులు, ముక్కుపుడకలు, పట్టీలు వంటి ఉన్నాయి. ధరలు రూ.250 నుంచి రూ.6 వేల వరకున్నాయి.
కనీస ఆర్డర్ విలువ రూ.1,500..
ప్రస్తుతం 3 వేల మంది రిజిస్టర్ కస్టమర్లున్నారు. ఇందులో మిస్ ఇండియా యూనివర్స్ 2017 శ్రేయా కృష్ణన్‌తో పాటూ పలువురు వ్యాపార ప్రముఖులున్నారు. ఫెస్టివ్యా వెబ్‌సైట్‌తో పాటూ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌ల ద్వారా ఆర్డర్ బుక్ చేయవచ్చు. ఆర్డర్ రాగానే వర్తకుడికి ఉత్పత్తుల ప్యాకింగ్ కోసం బాక్స్‌లు, లేబుల్స్ ఇస్తాం.
ఉత్పత్తి తయారీ పూర్తవ్వగానే వాటిని ప్యాకింగ్ చేయగానే స్థానిక లాజిస్టిక్ సంస్థ వాటిని సేకరించి కస్టమర్‌కు పంపిస్తుంది. ఫెడెక్స్, డీటీపీసీ, గతి వంటి ఆరేడు సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతం నెలకు 250కి పైగా ఆర్డర్లొస్తున్నాయి. కనీస ఆర్డర్ విలువ రూ.1,500.
వారం రోజుల్లో వైజాగ్, హైదరాబాద్ డిజైన్స్..
వారం రోజుల్లో విశాఖపట్నం, హైదరాబాద్‌కు హస్తకళ ఆభరణాలను జోడించనున్నాం. వైజాగ్ నుంచి టెర్రకోట, హైదరాబాద్ నుంచి పట్టుదారంతో చేసే గాజులు, నగలు తయారు చేసే 10 మంది వర్తకులను ఎంపిక చేశాం. తొలిదశలో నలుగురితో ప్రారంభిస్తాం. డిజైనర్స్ పేరు మీదే ఉత్పత్తులను విక్రయించడం మా ప్రత్యేకత.
రూ.2 కోట్ల నిధుల సమీకరణ..
వర్తకుడి నుంచి అమ్మకం విలువలో 30 శాతం కమీషన్‌గా తీసుకుంటాం. ఈ ఏడాది ముగిసే నాటికి 200 మంది వర్తకులు, కోటి రూపాయల ఆదాయాన్ని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం 9 మంది ఉద్యోగులున్నారు. ఏప్రిల్ నాటికి రూ.2 కోట్ల నిధులను సమీకరించనున్నాం. అమెరికా నుంచి పలువురు ఇన్వెస్టర్లు రెడీగా ఉన్నారు. కానీ, దేశీయంగానే నిధులు సమీకరించాలని నిర్ణయించాం. ఒకరిద్దరు ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నాం’’ అని సురేశ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment