2 నిమిషాల్లో బైక్‌ సర్వీసింగ్‌..! | Bike Servicing in 2 minutes ..! | Sakshi
Sakshi News home page

2 నిమిషాల్లో బైక్‌ సర్వీసింగ్‌..!

Published Sat, Oct 7 2017 1:03 AM | Last Updated on Sat, Oct 7 2017 1:03 AM

Bike Servicing in 2 minutes ..!

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నేటి యువత తిండి, నిద్ర లేకపోయినా ఉండగలరేమో గానీ, చేతిలో మొబైల్, తిరగడానికి బైక్‌ లేనిదే ఉండలేరు. లాంగ్‌ రైడ్‌ అనో, ఫ్రెండ్స్‌తో షికారనో, వీకెండ్స్‌ రైడ్‌ అనో బైక్‌ను రయ్‌మనిపించేందుకు బోలెడన్ని సందర్భాలు. కానీ, అదే బైక్‌ సర్వీసింగ్‌ అంటే!! టైమ్‌ వేస్ట్‌ అనే అభిప్రాయం చాలా మందికి ఉంది.

పైగా పర్సుకు భారం కూడానూ! కానీ, రెండంటే రెండు నిమిషాల్లో బైక్‌ సర్వీసింగ్, అది కూడా జస్ట్‌ రూ.40కే అంటోంది ఎక్స్‌ప్రెస్‌ బైక్‌ వర్క్స్‌(ఈబీడబ్ల్యూ)! వాషింగే కాదు.. మైనర్‌ రిపేర్లు, ఆన్‌ రోడ్‌ అసిస్టెన్స్‌ సేవలనూ అందిస్తామంటోంది. ప్రముఖ అంతర్జాతీయ ఫండ్‌ మేనేజర్, టెంపుల్‌టన్‌ ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ మార్క్‌ మొబియస్‌ నుంచి నిధులను పొందిన ఈబీడబ్ల్యూ ప్రణాళికలను  సంస్థ కో–ఫౌండర్‌ నీరజ్‌ టక్సండే ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు.

చిన్నతనం నుంచే బైకులంటే ఇష్టం వల్ల కావొచ్చు.. వేర్వేరు ప్రాంతాల్లో ఇంజనీరింగ్‌ పూర్తి చేసినా బైక్‌ రైడింగే నన్ను భూషణ్‌ కర్న్, జీగర్‌ వోరాలతో కలిపింది. లాంగ్‌ రైడింగ్‌ వెళ్లినప్పుడల్లా మాకెదురయ్యే ప్రధాన సమస్య సర్వీసింగ్‌. దీనికి పరిష్కారం వెతికే పనిలోనే ఎక్స్‌ప్రెస్‌ బైక్‌ వర్క్స్‌ కంపెనీకి బీజం పడింది. రూ.9 లక్షల పెట్టుబడితో ముంబై కేంద్రంగా 2013 జూన్‌లో ఎక్స్‌ప్రెస్‌ బైక్‌ వర్క్స్‌ను ప్రారంభించాం. 2 నిమిషాల్లో, రూ.40కి, అది కూడా జస్ట్‌ 10 లీటర్ల నీటితో బైక్‌ సర్వీసింగ్‌ మా ప్రత్యేకత.

ప్రతి పెట్రోల్‌ బంకులో ఈబీడబ్ల్యూ లక్ష్యం..
మన దేశంతో పాటూ ఇండోనేషియా, థాయ్‌లాండ్, నేపాల్, రువాండ, కొలంబియా దేశాల్లోనూ ఈబీడబ్ల్యూ కేంద్రాలున్నాయి. దేశంలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, పుణే, నాసిక్, బెంగళూరు, ధన్‌బాద్, కోయంబత్తూర్, హుబ్లీ నగరాల్లో 32 ఈబీడబ్ల్యూ స్టోర్లున్నాయి. త్వరలోనే కొచ్చిన్, వెస్ట్‌ ముంబై, భువనేశ్వర్, నాగ్‌పూర్, సూరత్, విజయవాడ, మైసూర్‌లలో ఫ్రాంచైజీ స్టోర్లను ఏర్పాటు చేయనున్నాం.

ఏడాది ముగింపు నాటికి 100 ఈబీడబ్ల్యూ సెంటర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యించాం. పెట్రోల్‌ బంకుల్లో ఈబీడబ్ల్యూ కేంద్రాల ఏర్పాటు కోసం ఇండియన్‌ ఆయిల్‌(ఐఓసీ), హిందుస్తాన్‌ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్‌)తో ఒప్పందం చేసుకున్నాం. ముంబైలోని పలు బంకుల్లో స్టోర్లను ఏర్పాటు చేశాం. దేశంలో ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌కు ఉన్న 52 వేల పెట్రోల్‌ బంకుల్లోనూ ఈబీడబ్ల్యూ సెంటర్లను ఏర్పాటు చేయాలనేది లక్ష్యం.

వాషింగ్‌కు 10 లీటర్ల నీళ్లు..: సాధారణంగా బైక్‌ వాషింగ్‌కు 50–60 లీటర్ల నీటిని వినియోగిస్తుంటారు. ఈబీడబ్ల్యూలో కేవలం 10 లీటర్లే. అందులోనూ 90% నీటిని పునఃవినియోగానికి వీలుగా శుద్ధి చేస్తాం. ఇదే మా ప్రత్యేకత. ఇప్పటివరకు 2.50 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలను సర్వీసింగ్‌ చేశాం. ప్రస్తుతం రోజుకు ఒక్కో స్టోర్‌ నుంచి 1,500–1,800 బైకులను సర్వీసింగ్‌ చేస్తున్నాం.

రూ.12 లక్షలకు ఫ్రాంచైజీ..: ముంబైలో 2,500 చ.అ.ల్లో ఈబీడబ్ల్యూ తయారీ ప్లాంట్‌ ఉంది. నెలకు 13 ఆటోమెటిక్‌ బైక్‌ వాషింగ్‌ మిషన్లను తయారు చేస్తుంటాం. ధర రూ.8.5 లక్షలు. ఈబీడబ్ల్యూ మిషన్లను హీరో మోటో కార్ప్, ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫాక్చర్‌ (ఓఈఎం) పరీక్షలు నిర్వహించి అనుమతినిచ్చాకే మార్కెట్లోకి విడుదల చేస్తాం.

ఫ్రాంచైజీ రూపంలో ఈబీడబ్ల్యూ సెంటర్లను ఏర్పాటు చేసుకునేందుకు రూ.12 లక్షల పెట్టుబడి అవసరం. మిషన్, నిర్వహన, శిక్షణ, మార్కెటింగ్‌ వంటి వాటికి ఏడాదికి 5% రాయల్టీని తీసుకుంటాం.


6 నెలల్లో 4–5 మిలియన్‌ డాలర్లు..
ప్రస్తుతం మా సంస్థలో 45 మంది ఉద్యోగులున్నారు. నెలకు 150% వృద్ధి రేటును నమోదు చేస్తున్నాం. 6 నెలల్లో 4–5 మిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించాలని నిర్ణయించాం.

‘‘2015లో ప్రముఖ అంతర్జాతీయ ఫండ్‌ మేనేజర్, టెంపుల్‌టన్‌ ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ మార్క్‌ మొబియస్, మదర్సన్‌ సుమీ గ్రూప్‌ వామన్‌ సెహగల్, హీరో ఫిన్‌కార్ప్‌ అభిమన్యు ముంజల్, కార్నేషన్‌ ఆటో ఇండియా కనల్‌ కట్టర్‌ల నుంచి పెద్ద మొత్తంలో నిధులను సమీకరించాం. ప్రస్తుతం వీళ్లు లాభాలను స్వీకరించి కంపెనీ నుంచి తప్పుకున్నారు’’ అని నీరజ్‌ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement