దాచేపల్లిలో రూ.2,500 కోట్లతో యూనిట్ ఏర్పాటు
6 నెలల ముందుగానే ఉత్పత్తి ప్రారంభించిన శ్రీ సిమెంట్
ఏటా 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి.. 2 వేల మందికి ఉపాధి
దేశంలోనే తొలి పర్యావరణహిత సిమెంట్ యూనిట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో భారీ పరిశ్రమ వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించింది. ప్రభుత్వ సహకారంతో నిర్దేశించుకున్న లక్ష్యం కంటే 6 నెలల ముందుగానే ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా శ్రీ సిమెంట్ రికార్డు సృష్టించింది. గతేడాది విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఒప్పందం చేసుకున్న శ్రీ సిమెంట్ రికార్డు సమయంలోనే యూనిట్‌ను సిద్ధం చేసింది.
పల్నాడు జిల్లా దాచేపల్లి వద్ద రూ.2,500 కోట్లతో ఏర్పాటు చేసిన సిమెంట్ పరిశ్రమ వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించినట్టు శ్రీ సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ అకోరే ప్రకటించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రారం¿ోత్సవ కార్యక్రమాలు నిర్వహించకుండానే ఉత్పత్తిని ప్రారంభించినట్టు కంపెనీ అధికారులు వెల్లడించారు.
ఏటా 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసిన దాచేపల్లి యూనిట్‌తో శ్రీ సిమెంట్ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 56.4 మిలియన్ టన్నులకు చేరింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర అవసరాలను తీర్చేవిధంగా దాచేపల్లిలో ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్టు శ్రీ సిమెంట్ ప్రకటించింది. ఈ యూనిట్ రాకతో మొత్తం 2,000 మందికి ఉపాధి లభించిందని, ఇందులో అత్యధికంగా స్థానిక యువతకే ప్రాధాన్యతను కల్పించామని పేర్కొంది.
దేశంలోనే తొలి పర్యావరణహిత యూనిట్
పూర్తిగా పర్యావరణహితంగా అత్యంత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి దాచేపల్లి యూనిట్ నిర్మించినట్టు నీరజ్ తెలిపారు. ఈ యూనిట్‌కు అవసరమయ్యే ఇంధన వినియోగంలో 30 శాతం మునిసిపల్ వ్యర్థాలు, బయోమాస్‌తో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిపారు.
ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించి 30 శాతం విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తున్న తొలి సిమెంట్ యూనిట్‌గా దాచేపల్లి రికార్డులకు ఎక్కింది. అదేవిధంగా సున్నపురాయి తవ్వకాన్ని కూడా ప్రయోగాత్మకంగా చేపట్టడం ద్వారా ఇంధన పొదుపు చేస్తున్నట్టు తెలిపారు. భూ మట్టానికి 40 అడుగుల దిగువన సున్నపురాయి క్రషింగ్‌ను చేపట్టడం ద్వారా డీజిల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించగలిగినట్టు వివరించారు.
భారీగా విస్తరణ
భంగర్‌బ్రాండ్ పేరుతో శ్రీ సిమెంట్ భారీ విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా మరో 13 యూనిట్లను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఏడాదికి 56.4 మిలియన్ టన్నులుగా ఉన్న సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 2028 నాటికి 80 మిలియన్ టన్నులకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 2025 నాటికి మరో 5 యూనిట్లను వాణిజ్యపరంగా ఉత్పత్తిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment