heavy industry
-
శ్రీ సిమెంట్ ఉత్పత్తి షురూ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో భారీ పరిశ్రమ వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించింది. ప్రభుత్వ సహకారంతో నిర్దేశించుకున్న లక్ష్యం కంటే 6 నెలల ముందుగానే ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా శ్రీ సిమెంట్ రికార్డు సృష్టించింది. గతేడాది విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఒప్పందం చేసుకున్న శ్రీ సిమెంట్ రికార్డు సమయంలోనే యూనిట్‌ను సిద్ధం చేసింది. పల్నాడు జిల్లా దాచేపల్లి వద్ద రూ.2,500 కోట్లతో ఏర్పాటు చేసిన సిమెంట్ పరిశ్రమ వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించినట్టు శ్రీ సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ అకోరే ప్రకటించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రారం¿ోత్సవ కార్యక్రమాలు నిర్వహించకుండానే ఉత్పత్తిని ప్రారంభించినట్టు కంపెనీ అధికారులు వెల్లడించారు. ఏటా 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసిన దాచేపల్లి యూనిట్‌తో శ్రీ సిమెంట్ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 56.4 మిలియన్ టన్నులకు చేరింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర అవసరాలను తీర్చేవిధంగా దాచేపల్లిలో ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్టు శ్రీ సిమెంట్ ప్రకటించింది. ఈ యూనిట్ రాకతో మొత్తం 2,000 మందికి ఉపాధి లభించిందని, ఇందులో అత్యధికంగా స్థానిక యువతకే ప్రాధాన్యతను కల్పించామని పేర్కొంది. దేశంలోనే తొలి పర్యావరణహిత యూనిట్ పూర్తిగా పర్యావరణహితంగా అత్యంత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి దాచేపల్లి యూనిట్ నిర్మించినట్టు నీరజ్ తెలిపారు. ఈ యూనిట్‌కు అవసరమయ్యే ఇంధన వినియోగంలో 30 శాతం మునిసిపల్ వ్యర్థాలు, బయోమాస్‌తో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిపారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించి 30 శాతం విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తున్న తొలి సిమెంట్ యూనిట్‌గా దాచేపల్లి రికార్డులకు ఎక్కింది. అదేవిధంగా సున్నపురాయి తవ్వకాన్ని కూడా ప్రయోగాత్మకంగా చేపట్టడం ద్వారా ఇంధన పొదుపు చేస్తున్నట్టు తెలిపారు. భూ మట్టానికి 40 అడుగుల దిగువన సున్నపురాయి క్రషింగ్‌ను చేపట్టడం ద్వారా డీజిల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించగలిగినట్టు వివరించారు. భారీగా విస్తరణ భంగర్బ్రాండ్ పేరుతో శ్రీ సిమెంట్ భారీ విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా మరో 13 యూనిట్లను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఏడాదికి 56.4 మిలియన్ టన్నులుగా ఉన్న సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 2028 నాటికి 80 మిలియన్ టన్నులకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 2025 నాటికి మరో 5 యూనిట్లను వాణిజ్యపరంగా ఉత్పత్తిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
6 వేల కోట్లతో ఆహార శుద్ధి పరిశ్రమ
సాక్షి, న్యూఢిల్లీ: జహీరాబాద్ నిమ్జ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. రాష్ట్ర ఆహార శుద్ధి పరిశ్రమకు ఊతమిచ్చేలా దక్షిణ్ ఆగ్రో పొలిస్ సంస్థ రూ.6 వేల కోట్లతో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. శుక్రవారం ఈ మేరకు ఢిల్లీలో ప్రారంభమైన వరల్డ్ ఫుడ్ ఇండియా–2017 సదస్సులో తెలంగాణ ప్రభుత్వం, దక్షిణ్ ఆగ్రో సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సదస్సులో పాల్గొనాల్సి ఉన్నా అసెంబ్లీ సమావేశాల కారణంగా ఆయన హాజరుకాలేదు. దీంతో ఆయనకు బదులుగా మంత్రి కేటీఆర్ సదస్సులో పాల్గొని పలు ఆహార శుద్ధి సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నిమ్జ్‌లో వివిధ రకాల ఆహార పదార్థాల శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు దక్షిణ్ ఆగ్రో పొలిస్ సంస్థ ముందుకొచ్చింది. మూడు నుంచి ఐదేళ్ల కాలంలో రూ.6 వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ ద్వారా సుమారు 5 వేల మందికి ఉపా«ధి లభించనుంది. ఈ పరిశ్రమలో మహిళలకు 4 వేలు, పురుషులకు వెయ్యి ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కేటీఆర్ మీడియాకు వెల్లడించారు. నేడు మరో 10 ఒప్పందాలు: కేటీఆర్ నిమ్జ్‌లో ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన దక్షిణ్ ఆగ్రో పొలిస్ సంస్థ.. రైతులకు పలు పంటల సాగు విషయంలోనూ శిక్షణ కల్పిస్తుందని కేటీఆర్ తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటు కానుండటం తెలంగాణలో ఆహార శుద్ధి పరిశ్రమకు ఊతమిచ్చినట్టు అవుతుందన్నారు. మొక్కజొన్న, చెరుకు, వరితోపాటు ఇతర ఆహార పదార్థాల శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. రూ.6 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి సదరు సంస్థ జర్మన్ బ్యాంక్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకుందని, దీనికి సంబంధించిన పత్రాలను సమర్పించిందని వివరించారు. ఈ పరిశ్రమ ఏర్పాటుపై మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డిలతో కూడా చర్చిస్తామని తెలిపారు. జర్మనీ అగ్రీ బిజినెస్ అలయన్స్‌తో తెలంగాణ ఆగ్రో సమాఖ్య ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. దీని ద్వారా ఆహార శుద్ధిలో ప్రపంచవ్యాప్తంగా అవలంబిస్తున్న నూతన పద్ధతులపై తెలంగాణలో రైతులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. శనివారం జరిగే తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక సెషన్లో మరో 10 ఒప్పందాలు కుదుర్చుకోనున్నామని, దీని విలువ సుమారు రూ.7,500 కోట్లు ఉంటుందని వెల్లడించారు. కొత్త పాలసీ నేడు ఆవిష్కరణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఆవిష్కరిస్తారని కేటీఆర్ తెలిపారు. ఈ విధానం ద్వారా తెలంగాణలో అన్ని రకాలుగా ఫుడ్ ప్రాసెసింగ్‌ను ప్రోత్సహిస్తామని తెలిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల 12 లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేయనున్నామని, ఇందులో ఫుడ్ ప్రాసెసింగే కాకుండా వేర్ హౌసింగ్, డ్రైపోర్ట్, కంటైనరైజేషన్, కోల్డ్ స్టోరేజ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్‌కు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా అన్ని సంస్థలు ఈ సదస్సు ద్వారా ఒకచోటికి చేర్చడానికి కేంద్రం చేసిన కృషిని ఆయన అభినందించారు. సదస్సులో భాగంగా తెలంగాణలో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు, రాయితీలు, వాటి ఫలితాలను వివరిస్తూ ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన పెవిలియన్‌ను కేటీఆర్ ప్రారంభించారు. -
పరిశ్రమలకు స్వర్గధామం తెలంగాణ
రాష్ట్ర పారిశ్రామిక విధానంపై జాతీయ సదస్సులో కేటీఆర్ భారీ పరిశ్రమలకు 15 రోజుల్లోనే అన్ని అనుమతులు సాక్షి, హైదరాబాద్: పారిశ్రామికవేత్తలకు తెలంగాణ రాష్ట్రం స్వర్గధామమని, ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షిస్తోందని మంత్రి కె. తారక రామారావు అన్నారు. పరిశ్రమలకు తగిన ప్రోత్సాహకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్), నేషనల్ అకాడమీ ఆఫ్ డెవలప్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానంపై రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. తెలంగాణలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు 15 రోజుల్లో అన్ని అనుమతులు లభించేలా సింగిల్ విండో విధానాన్ని పకడ్బందీగా అమలుచేయనున్నట్లు కేటీఆర్ చెప్పారు. పరిశ్రమలు ఏర్పా టు చేసేవారికి అందించే రాయితీలు, ప్రోత్సాహకాలను టీఎస్-ఐపాస్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు ప్రభుత్వంతో సంప్రదిం పులు జరుపుతున్నట్లు మంత్రి చెప్పారు. ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్తల ద్వారా రూ. లక్ష కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చేందుకు సీఎం కృషి చేస్తున్నారని... ఇందులో భాగంగా త్వరలో ప్రవాసీ దివస్ పేరుతో సదస్సు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. జిల్లాల వారీగా పరిశ్రమల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధమైందని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ఐదు పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు అనువైన పారిశ్రామిక విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం ముదావహమని కేంద్ర మాజీ మంత్రి, గుజరాత్ సెంట్రల్ వర్సిటీ చాన్సలర్ వై.కె.అలఘ్ పేర్కొన్నారు. పరిశ్రమలతో పాటు డైరీ ప్రాజెక్టులు, పప్పు ధాన్యాల వంటి వ్యవసాయాధారిత ప్రత్యామ్నాయాల పట్ల కూడా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. నూతన పారి శ్రామిక విధానంలో ఉన్న లోటుపాట్లను సవరించుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు రాష్ట్రానికి తరలివచ్చేలా ప్రభుత్వం పనిచేయాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డెరైక్టర్ ఆర్కే మిశ్రా, సెస్ చైర్మన్ ఆర్.రాధాకృష్ణ సూచించారు. -
బిల్ట్ దుస్థితికి యాజమాన్యమే కారణం
కార్మిక నాయకుల మండిపాటు కమలాపురంలో బహిరంగ సభ పాల్గొన్న కార్మికులు, వారి కుటుంబాలు కమలాపురం : యాజమాన్యం కుట్రల కారణంగానే బిల్ట్ పరిశ్రమకు ఈ దుస్థితి పట్టింది.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కర్మాగారా న్ని తెరిపించేలా చర్యలు తీసుకోవాలని ట్రేడ్ యూనియన్ల నాయకులు డిమాండ్ చేశారు. అండగా ఉంటాం.. అధైర్యపడవద్దని కార్మికులకు భరోసా ఇచ్చారు. గురువారం కమాలాపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ముందుగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బిల్ట్ యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పలువురు నాయకులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. కర్మాగారంలో దారపు మిల్లును ఏర్పాటు చేయాలని, లేఆఫ్ ఆలోచన మానుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం సభలో నాయకులు మాట్లాడుతూ కార్మికులు పని చేయకనో, నష్టాలు రావడంతోనో కర్మాగారం మూతపడలేదని, యాజమాన్యం మార్కెట్లో తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు చేతకాకనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులను నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల శ్రమతో 33 ఏళ్లుగా సుమారు రూ.3వేల కోట్లు కూడబెట్టిన సంస్థ శ్రమజీవులకు కాలుష్యాన్ని, అనారోగ్యాలను వదిలి బ్రిటీష్ పాలనను మరిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభా లు వచ్చినప్పుడు కార్మికులకు పంచని సంస్థ నష్టాల సాకుతో కార్మికులను ఇబ్బందులు పెట్టడం ఏమిటన్నారు. కార్మికులంతా నా గుండెపైనే ఉన్నారన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వారు ఒక పక్క ఉపాధి కోల్పోయి రోడ్డుతున్నా కనిపించడంలేదాని అని ప్రశ్నించారు. జిల్లాలో భారీ పరిశ్రమగా వెలుగొందుతున్న బిల్ట్ కర్మాగారంపై సుమారు 20వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, పరిశ్రమను పునరుద్ధరించి కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉందని పేర్కొన్నారు. లేని పక్షంలో అన్ని కార్మిక సంఘాలు, ఇతర సంఘాలను కలుపుకుని కర్మాగారం తెరిపించే వరకూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిం చారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్కయ్య, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఓంపెల్లి పురుషోత్తమరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రభాకర్, టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి మారుతీరావు, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంకే.బోస్, బీఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లట్టి జగన్మోహన్రావు, కార్యదర్శి పెంట శ్రీనివాసరావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు చాగంటి కిషన్, బిల్ట్ జేఏసీ నాయకులు, కార్మికులు, వారి కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.