6 వేల కోట్లతో ఆహార శుద్ధి పరిశ్రమ | food refining industry with 6,000 crore | Sakshi
Sakshi News home page

6 వేల కోట్లతో ఆహార శుద్ధి పరిశ్రమ

Published Sat, Nov 4 2017 1:26 AM | Last Updated on Sat, Nov 4 2017 1:26 AM

food refining industry with 6,000 crore  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జహీరాబాద్‌ నిమ్జ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. రాష్ట్ర ఆహార శుద్ధి పరిశ్రమకు ఊతమిచ్చేలా దక్షిణ్‌ ఆగ్రో పొలిస్‌ సంస్థ రూ.6 వేల కోట్లతో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. శుక్రవారం ఈ మేరకు ఢిల్లీలో ప్రారంభమైన వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా–2017 సదస్సులో తెలంగాణ ప్రభుత్వం, దక్షిణ్‌ ఆగ్రో సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ సదస్సులో పాల్గొనాల్సి ఉన్నా అసెంబ్లీ సమావేశాల కారణంగా ఆయన హాజరుకాలేదు.

దీంతో ఆయనకు బదులుగా మంత్రి కేటీఆర్‌ సదస్సులో పాల్గొని పలు ఆహార శుద్ధి సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నిమ్జ్‌లో వివిధ రకాల ఆహార పదార్థాల శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు దక్షిణ్‌ ఆగ్రో పొలిస్‌ సంస్థ ముందుకొచ్చింది. మూడు నుంచి ఐదేళ్ల కాలంలో రూ.6 వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ ద్వారా సుమారు 5 వేల మందికి ఉపా«ధి లభించనుంది. ఈ పరిశ్రమలో మహిళలకు 4 వేలు, పురుషులకు వెయ్యి ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కేటీఆర్‌ మీడియాకు వెల్లడించారు.

నేడు మరో 10 ఒప్పందాలు: కేటీఆర్‌
నిమ్జ్‌లో ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన దక్షిణ్‌ ఆగ్రో పొలిస్‌ సంస్థ.. రైతులకు పలు పంటల సాగు విషయంలోనూ శిక్షణ కల్పిస్తుందని కేటీఆర్‌ తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటు కానుండటం తెలంగాణలో ఆహార శుద్ధి పరిశ్రమకు ఊతమిచ్చినట్టు అవుతుందన్నారు.

మొక్కజొన్న, చెరుకు, వరితోపాటు ఇతర ఆహార పదార్థాల శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. రూ.6 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి సదరు సంస్థ జర్మన్‌ బ్యాంక్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకుందని, దీనికి సంబంధించిన పత్రాలను సమర్పించిందని వివరించారు. ఈ పరిశ్రమ ఏర్పాటుపై మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌ రెడ్డిలతో కూడా చర్చిస్తామని తెలిపారు.

జర్మనీ అగ్రీ బిజినెస్‌ అలయన్స్‌తో తెలంగాణ ఆగ్రో సమాఖ్య ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. దీని ద్వారా ఆహార శుద్ధిలో ప్రపంచవ్యాప్తంగా అవలంబిస్తున్న నూతన పద్ధతులపై తెలంగాణలో రైతులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. శనివారం జరిగే తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక సెషన్‌లో మరో 10 ఒప్పందాలు కుదుర్చుకోనున్నామని, దీని విలువ సుమారు రూ.7,500 కోట్లు ఉంటుందని వెల్లడించారు.

కొత్త పాలసీ నేడు ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీని కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ ఆవిష్కరిస్తారని కేటీఆర్‌ తెలిపారు. ఈ విధానం ద్వారా తెలంగాణలో అన్ని రకాలుగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ను ప్రోత్సహిస్తామని తెలిపారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల 12 లాజిస్టిక్‌ పార్కులను ఏర్పాటు చేయనున్నామని, ఇందులో ఫుడ్‌ ప్రాసెసింగే కాకుండా వేర్‌ హౌసింగ్, డ్రైపోర్ట్, కంటైనరైజేషన్, కోల్డ్‌ స్టోరేజ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా అన్ని సంస్థలు ఈ సదస్సు ద్వారా ఒకచోటికి చేర్చడానికి కేంద్రం చేసిన కృషిని ఆయన అభినందించారు. సదస్సులో భాగంగా తెలంగాణలో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు, రాయితీలు, వాటి ఫలితాలను వివరిస్తూ ఇండియా గేట్‌ వద్ద ఏర్పాటు చేసిన పెవిలియన్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement