పరిశ్రమలకు స్వర్గధామం తెలంగాణ
- రాష్ట్ర పారిశ్రామిక విధానంపై జాతీయ సదస్సులో కేటీఆర్
- భారీ పరిశ్రమలకు 15 రోజుల్లోనే అన్ని అనుమతులు
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామికవేత్తలకు తెలంగాణ రాష్ట్రం స్వర్గధామమని, ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షిస్తోందని మంత్రి కె. తారక రామారావు అన్నారు. పరిశ్రమలకు తగిన ప్రోత్సాహకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్), నేషనల్ అకాడమీ ఆఫ్ డెవలప్‌మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానంపై రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది.
తెలంగాణలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు 15 రోజుల్లో అన్ని అనుమతులు లభించేలా సింగిల్ విండో విధానాన్ని పకడ్బందీగా అమలుచేయనున్నట్లు కేటీఆర్ చెప్పారు. పరిశ్రమలు ఏర్పా టు చేసేవారికి అందించే రాయితీలు, ప్రోత్సాహకాలను టీఎస్-ఐపాస్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు ప్రభుత్వంతో సంప్రదిం పులు జరుపుతున్నట్లు మంత్రి చెప్పారు. ఎన్‌ఆర్‌ఐ పారిశ్రామికవేత్తల ద్వారా రూ. లక్ష కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చేందుకు సీఎం కృషి చేస్తున్నారని... ఇందులో భాగంగా త్వరలో ప్రవాసీ దివస్ పేరుతో సదస్సు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.
జిల్లాల వారీగా పరిశ్రమల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధమైందని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ఐదు పారిశ్రామిక కారిడార్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు అనువైన పారిశ్రామిక విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం ముదావహమని కేంద్ర మాజీ మంత్రి, గుజరాత్ సెంట్రల్ వర్సిటీ చాన్సలర్ వై.కె.అలఘ్ పేర్కొన్నారు.
పరిశ్రమలతో పాటు డైరీ ప్రాజెక్టులు, పప్పు ధాన్యాల వంటి వ్యవసాయాధారిత ప్రత్యామ్నాయాల పట్ల కూడా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. నూతన పారి శ్రామిక విధానంలో ఉన్న లోటుపాట్లను సవరించుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు రాష్ట్రానికి తరలివచ్చేలా ప్రభుత్వం పనిచేయాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ డెరైక్టర్ ఆర్‌కే మిశ్రా, సెస్ చైర్మన్ ఆర్.రాధాకృష్ణ సూచించారు.