మిషెల్ వ్యాఖ్యలు
ట్రంప్ జాతి విద్వేషి, స్త్రీ విద్వేషి
తూర్పారబట్టిన మాజీ ఫస్ట్ లేడీ
షికాగో: ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకు నేతృత్వం వహించేందుకు అత్యంత అర్హురాలు, సమర్థురాలు కమలా హారిసేనని దేశ మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా అభిప్రాయపడ్డారు. ‘‘చాలామంది సగటు అమెరికన్ల మాదిరిగానే కమలా హారిస్‌ది కూడా మధ్యతరగతి నేపథ్యం. అక్కడినుంచి ప్రతి దశలోనూ నిరంతరం కష్టించి ఎదిగారు. తనను తాను మలచుకుంటూ ఉపాధ్యక్షురాలి స్థాయికి చేరుకున్నారు. అందుకే ఆమె కథ మీ కథ. నా కథ.
మెరుగైన జీవితం కోసం కలలుగంటున్న అమెరికన్లందరి కథ!’’ అంటూ కొనియాడారు. షికాగోలో జరుగుతున్న డెమొక్రాట్ల జాతీయ కన్వెన్షన్‌లో మంగళవారం ఆమె ఆద్యంతం స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. హారిస్ రాకతో అమెరికాకు మెరుగైన భవితపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ‘‘అమెరికన్లందరికీ ఎదుగుదలకు అవకాశాలు దక్కేలా కమల నిరంతరం కృషి చేశారు.
దేశం పట్ల తన నిబద్ధతను అలా చాటుకున్నారు. అంతే తప్ప ట్రంప్ మాదిరిగా జాతులపై విద్వేషం చిమ్మడం ద్వారానో, వ్యక్తులపై బురదజల్లడం ద్వారానో కాదు’’ అని రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యరి్థపై మిషెల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ట్రంప్ ప్రపంచం పట్ల విశాల దృష్టి లేని కురచ వ్యక్తి. బాగా చదువుకున్న, నిరంతరం కష్టించే స్వభావమున్న నల్లజాతీయులను చూస్తే ఆయనకు భయం’’ అంటూ దుయ్యబట్టారు.
‘‘నన్ను, నా భర్త (మాజీ అధ్యక్షుడు) ఒరాక్ ఒబామాను ట్రంప్ ఎప్పుడూ ఆయన రాజకీయ మనుగడకే పెను ముప్పుగానే చూశారు. మేం అత్యంత విజయవంతమైన నల్లజాతి వ్యక్తులం కావడమే అందుకు కారణం’’ అని చెప్పుకొచ్చారు. కనుక హారిస్‌పై కూడా ట్రంప్ జాతి విమర్శలు, తప్పుడు ప్రచారాలు చేయడం ఖాయమన్నారు.
వాటన్నింటినీ అమెరికన్లు తిప్పికొడతారని, హారిస్‌ను ప్రెసిడెంట్‌గా ఎన్నుకుని చరిత్ర సృష్టిస్తారని జోస్యం చెప్పారు. అయితే, ‘‘ఈసారి అధ్యక్ష ఎన్నిక అత్యంత హోరాహోరీగా సాగడం ఖాయం. చాలా రాష్ట్రాల్లో అతి తక్కువ ఓట్ల తేడాతో ఫలితాలు తారుమారు కావచ్చు. అందుకే భారీ సంఖ్యలో తరలిరండి. పార్టీ అభిమానాలను, రాగద్వేషాలను పక్కన పెట్టి కేవలం మీ మనస్సాక్షి ప్రకారం నడచుకోండి.
అమెరికన్లు ప్రాణప్రదంగా భావించే స్వేచ్ఛను, మానవత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, హుందాతనాన్ని నిలబెట్టే హారిస్‌కే ఓటేయండి’’ అని అమెరికన్లకు పిలుపునిచ్చారు. ట్రంప్ రూపంలో మరో నాలుగేళ్ల అస్తవ్యస్త పాలనను నెత్తిన రుద్దుకునేందుకు అమెరికన్లు సిద్ధంగా లేరని, హారిస్‌ను ప్రెసిడెంట్‌గా ఎన్నుకుని కొత్త చరిత్ర సృష్టించనున్నారని బరాక్ ఒబామా అన్నారు.
నల్లవాళ్లంటే ట్రంప్‌కు చులకన
నల్లవాళ్లంటే ట్రంప్‌కు బాగా చిన్నచూపంటూ మిషెల్ మండిపడ్డారు. అసహ్యకరమైన స్త్రీ విద్వేష, జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం ఆయన నైజమన్నారు. ‘‘అందుకే ఆయన అమెరికా అధ్యక్షునిగా ఉన్న నాలుగేళ్ల కాలంలో నల్లజాతీయులంటే అందరికీ భయం కలిగించేందుకు ఎంతగానో ప్రయతి్నంచారు. నల్లజాతీయులు చేసే ఉద్యోగాలను బ్లాక్ జాబ్స్ అంటూ చులకనగా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ అర్రులుచాస్తున్న అమెరికా అధ్యక్ష పదవి కూడా బ్లాక్ జాబేనని ఆయనకు ఎవరు చెప్పాలి!’’ అంటూ ఎద్దేవా చేశారు. అమెరికా చరిత్రలో తొలి నల్లజాతి అధ్యక్షునిగా బరాక్ ఒబామా చరిత్ర సృష్టించడం తెలిసిందే.
మా తల్లులు నేరి్పందదే
‘‘హారిస్ తల్లి, నా తల్లి సప్త సముద్రాలకు చెరోవైపున పుట్టి ఉండొచ్చు. కానీ వాళ్లు నిత్యం విశ్వసించిందీ, మాకు నిరంతరం నేరి్పంది ఒక్కటే. వ్యవస్థను విమర్శించే బదులు దాన్ని సరిచేసేందుకు మన వంతుగా శక్తివంచన లేకుండా కృషి చేయాలని’’ అని మిషెల్ అన్నారు. మిషెల్ ప్రసంగానికి డెమొక్రాట్ ప్రతినిధులంతా మంత్రముగ్ధులయ్యారు. ఆమె మాట్లాడటం ముగించిన చాలాసేపటిదాకా చప్పట్లతో అభినందించారు.
హారిస్, నేను అలా కలిశాం: డగ్లస్
అమెరికన్లందరూ గరి్వంచేంత గొప్ప ప్రెసిడెంట్‌గా హారిస్ చరిత్రలో నిలిచిపోతారని ఆమె భర్త డగ్లస్ ఎమోఫ్ అభిప్రాయపడ్డారు. తనను తాను అమెరికా చరిత్రలో తొలి ‘సెకండ్ జంటిల్మన్ (ఉపాధ్యక్షురాలి భర్త)’గా సభకు పరిచయం చేసుకుని ఆకట్టుకున్నారు! 2013లో ఒక క్లయింట్ మీటింగ్ సందర్భంగా కమలతో తాను బ్లైండ్ డేట్‌కు వెళ్లడం, అది ప్రేమగా మారి, పెళ్లిగా పరిణమించిన వైనాన్ని ఆసక్తికరంగా వివరించారు. తొలి భార్యతో తనకు కలిగిన సంతానం కూడా కమలను ప్రేమగా మొమలా అని పిలుస్తారని డగ్లస్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment