వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో అగ్రరాజ్యం అమెరికా చీకట్లో చిక్కుకుపోయిందని డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో ఉన్న జో బైడెన్ ఆరోపించారు. ఆ చీకట్లో నుంచి వెలుగు రేఖలోకి ప్రయాణించడానికి దేశ ప్రజలందరూ ఏకతాటిపైకి రావాలని అన్నారు. అమెరికాలో వెలుగులు నింపడానికి తన శక్తి మేర కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అధ్యక్ష అభ్యర్థిగా డెమొక్రట్ పార్టీ చేసిన నామినేషన్‌ను పార్టీ జాతీయ సదస్సు ముగింపు రోజైన గురువారం ఆయన ఆమోదించారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 77 ఏళ్ల వయసున్న బైడెన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ అధ్యక్ష అభ్యర్థిగా నిల్చోవడం తనకు దక్కిన అత్యంత గౌరవమని అన్నారు. ‘‘అమెరికా చరిత్రలోనే ఇవి అత్యంత చీకటి రోజులు. సమాజం రెండుగా విడిపోయింది. ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. నేను ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ ఒక మాట ఇస్తున్నాను. మీరు నాకు అధికారాన్ని అప్పగిస్తే నాలో అత్యుత్తమ పని తీరు మీరు చూస్తారు. నేనే ఒక కాంతి పుంజంలా మారి అమెరికా చీకట్లను పారదోలతాను’’అని అన్నారు.
‘‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోనే యునైటెడ్ అన్న పదం ఉంది. మనం అందరమూ కలసికట్టుగా మన భవిష్యత్ కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం, మనందరి ఉమ్మడి కలల్ని సాకారం చేసుకోవడం కోసం పాటుపడాలి’’అని బైడెన్ పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రభుత్వం వైఫల్యంతో ఆర్థికంగా గ్రేట్ డిప్రెషన్‌ను మించిన సంక్షోభంలో పడిపోయామన్నారు. జాతి వివక్ష అంశంలో తిరిగి 1960లలోకి వెళ్లిపోయామన్న బైడెన్ వాతావరణంలో మార్పుల్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు.
కమలా హ్యారిస్ అమెరికన్
జో బైడెన్ తన ప్రసంగంలో భారత సంతతి మహిళ, ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌పై ప్రశంసలు కురిపించారు. ఆమెది అత్యంత శక్తిమంతమైన గళమని కొనియాడారు. భారతీయ, నల్లజాతి మూలాలున్నప్పటికీ కమల ఎప్పటికీ అమెరికనేనని అన్నారు. కమలా హ్యారిస్ తనని తాను అమెరికన్‌గా నిరూపించుకోవడానికి ఎన్నో అడ్డంకుల్ని అధిగమించారని చెప్పుకొచ్చారు ‘‘కమలా హ్యారిస్ కథ ఒక అమెరికన్ కథ.
మన దేశంలో ఆమె ఎన్నో ముళ్ల బాటల్ని దాటుకుంటూ ఈ స్థాయికి ఎదిగారు. ఆమె ఒక మహిళ, నల్లజాతి మహిళ. దక్షిణాసియా అమెరికన్, వలసదారు.. ఇవన్నీ ఆమె ఎదుగుదలకు అడుగడుగునా అవరోధాలు కల్పించాయి. వాటన్నింటినీ దాటుకుంటూ అత్యంత శక్తిమంతంగా ఎదిగి ఈ స్థాయికి వచ్చారు’’అని బైడెన్ అన్నారు. అమెరికా ప్రజలకి హామీ ఇచ్చినట్టుగా అధ్యక్ష పదవిని అందుకోవడానికి తాను ఒక్కడే పోరాడనక్కర్లేదని, తన వెన్నంటి అతి గొప్ప ఉపాధ్యక్ష అభ్యర్థి ఉన్నారని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment