(వెబ్ స్పెషల్): ఆకాశంలో సగం.. అన్ని రంగాల్లో ప్రాతినిథ్యం... అత్యున్నత స్థాయి పదవీ బాధ్యతలు.. ఆటపాటలు మొదలు అంతరిక్షయానం వరకు ప్రతీ అంశంలోనూ అతివలు తమదైన ముద్ర వేస్తూ అన్నింటా మెరుగ్గా రాణిస్తున్నారు. రాజకీయ చదరంగంలోనూ ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ ముందుకు సాగుతున్నారు. పాలనాపగ్గాలు చేపట్టి ప్రతికూలతలను అధిగమిస్తూ తమకు తామే సాటి అని నిరూపించిన, నిరూపిస్తున్న మహిళా నాయకులు ఎంతో మంది ఉన్నారు.
అయితే అన్ని విషయాల్లోనూ ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకొనే అమెరికాలో మాత్రం ఇంతవరకు ఒక్కరంటే ఒక్క మహిళకు కూడా అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం రాలేదు. 244 ఏళ్ల స్వాతంత్ర్య చరిత్ర కలిగిన అగ్రరాజ్యంలో నేటికీ దేశాధినేత హోదా ‘ఆమె’కు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. రిపబ్లికన్ల తరఫున ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ నుంచి జో బిడెన్ అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో ఈసారి కూడా మహిళలకు మొండిచేయే ఎదురైంది. వస్తుందో రాదో తెలియని అవకాశం కోసం మరో నాలుగేళ్లపాటు ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొంది.
ఆ ఇద్దరు.. ఎవరి ప్రత్యేకతలు వారివి..
నవంబరు 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు అభ్యర్థిత్వానికై పోటీపడిన మహిళల్లో ఈసారి తులసి గబ్బార్డ్(39), కమలా హారిస్(55) పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వాళ్లిద్దరూ వామపక్ష భావజాలం గల డెమొక్రటిక్ పార్టీకి చెందిన వారే. అయినప్పటికీ ఎవరి ప్రత్యేకతలు వారికి ఉన్నాయి. అయితే ముక్కుసూటిగా మాట్లాడటంలో గానీ, నమ్మిన సిద్ధాంతానికై కట్టుబడి ఉండటంలో గానీ ఇద్దరూ ఘనాపాటీలే. పార్టీలో చేరిన అనతికాలంలోనే లక నేతలుగా ఎదిగి తమకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఆసియా- ఆఫ్రికన్ మూలాలున్న కమల ఫిమేల్ ఒబామాగా ప్రసిద్ధికెక్కితే.. హిందూ ధర్మాన్ని పాటించే తులసి గత ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించి పతాక శీర్షికల్లో నిలిచారు. న్యాయ విద్యనభ్యసించిన కమలా హారిస్‌కు అటార్నీ జనరల్‌గా పనిచేసిన అనుభవం ఉంటే.. సైనికురాలిగా తులసి, అమెరికా తరఫున పలు యుద్ధాల్లో పాల్గొని నేషనల్ గార్డుగా, ఆర్మీ కెప్టెన్‌గా సేవలు అందించారు. (చదవండి: సిరియా ఎప్పుడైనా అమెరికాపై దాడి చేసిందా!)
ఇక రాజకీయాల విషయానికొస్తే అత్యంత పిన్న వయస్సు(21)లోనే హవాయి స్టేట్ లెజిస్లేటివ్(2002)గా ఎన్నికైన ఘనత తులసి గబ్బార్డ్ సొంతమైతే.. 2017 జనవరిలో కాలిఫోర్నియా సెనేటర్‌గా కమలా కీలక బాధ్యతలు చేపట్టారు. అయితే ఇండో-అమెరికన్ల అభిమానం చూరగొన్న విషయంలో మాత్రం ఇద్దరూ ఒకరికొకరు ఏమాత్రం తీసిపోరు. ఇండో- జమైకన్ సంతతికి చెందిన కమలా హారిస్ పట్ల ప్రవాస భారతీయులకు(అమెరికా) ‘మన’ అనే భావన ఉండటం సహజమే అయినప్పటికీ.. అమెరికన్ సమోవా సంతతికి చెందిన తులసికి మద్దతు తెలపడానికి గల ముఖ్య కారణాల్లో ఆమె హిందువు కావడం ఒకటిగా చెప్పవచ్చు. భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న పీవీ గోపాలన్ మనుమరాలైన కమల తనను తాను అమెరికన్‌ను అని చెప్పుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తే.. తులసి అనేకసార్లు భారతదేశంపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.(చదవండి: అమెరికా ఒకప్పుడు బానిసగానే..)
కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే ధీశాలి
భారత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమెరికా పర్యటనకు వీసా నిరాకరించినపుడు ప్రభుత్వంపై విమర్శలు చేసి వార్తల్లో తులసీ గబ్బార్డ్ వార్తల్లో నిలిచారు. అంతేకాదు 2014లో ప్రధాని హోదాలో న్యూయార్క్‌లోని మేడిసన్ స్క్వేర్‌లో ప్రసంగించిన సమయంలో మోదీను కలిసి అభినందించడంతో పాటు.. భగవద్గీతను బహూకరించారు. తద్వారా ఇండో- అమెరికన్లలో మంచి గుర్తింపు పొందారు.
ఇక టెర్రరిజాన్ని వ్యతిరేకించే తులసి... 2017లో సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌ను కలిసేందుకు రహస్యంగా అక్కడికి వెళ్లడం వివాదాస్పదమైంది. ఈ పర్యటనకు హౌజ్ ఎథిక్స్ కమిటీ అనుమతి ఉందని చెప్పినప్పటికీ ప్రత్యర్థులు మాత్రం ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ‘ అతడిని కలిసే అవకాశం వచ్చింది. సిరియా ప్రజల పట్ల నిజమైన బాధ్యత ఉన్న వారెవరైనా నాలాగే చేస్తారు. వారి కష్టాలను స్వయంగా చూసే అవకాశం దక్కింది. శాంతిని పెంపొందించాలంటే చేతులు ముడుచుకుని కూర్చుంటే సరిపోదు. చర్చల ద్వారానే అది సాధ్యమవుతుంది. సిరియా ఎప్పుడైనా అమెరికాపై దాడి చేసిందా అని అక్కడి ప్రజలు అడిగినపుడు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. నిజానికి తప్పు ఎవరిది’ అంటూ తులసి తన చర్యను సమర్థించుకున్నారు.
అంతేకాదు ఆల్‌ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రసంస్థలకు ప్రత్యక్ష, పరోక్షంగా మద్దతు తెలిపే దేశాలకు అమెరికా సహకరించకూడదని, వారికి నిధులు ఇవ్వడం ఆపేయాలని కోరుతూ అదే ఏడాది కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెట్టారు తులసి. ఈ సందర్బంగా..‘ఐసిస్, ఆల్‌ఖైదా వంటి సంస్థలు ఆయుధాలు కొనుగోలు చేసేందుకు డబ్బులు సమకూర్చేది నేనైనా, మరెవరైనా సరే వారికి తప్పకుండా శిక్షపడాలి. వాళ్లను జైళ్లో పెట్టి తీరాలి. ఇటువంటి నిబంధనలను ఏళ్ల నాటి నుంచి అమెరికా ఉల్లంఘిస్తోంది’ అని అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. బాధితులు, మైనార్టీల పక్షాన నిలబడేందుకు ఏమాత్రం వెనకడుగువేయనని చెప్పారు.
ఆలోచిస్తున్నా..
‘అవును.. ఈ విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాను. మా దేశ దశ దిశల గురించిన శ్రద్ధ నాకు ఉంది. అందుకే ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను’ అంటూ గతేడాది డిసెంబరులో తులసి.. తాను అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికై పోటీ పడే విషయమై ప్రకటన చేశారు. అయితే ప్రచారంలో దూకుడు ప్రదర్శించిన తులసికి సరిపడా ఓట్లు పడకపోవడంతో మార్చిలో ఎన్నికల బరి నుంచి తప్పుకొన్నారు. ప్రస్తుత అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ను ఎండార్స్ చేశారు. (చదవండి: అగ్రరాజ్యంలో కమల వికాసం)
ఒక అవకాశం చేజారినా.. చరిత్ర సృష్టించిన కమల
‘అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా. మనమంతా కలిసే ఇది పూర్తి చేద్దాం. నాతో కలిసి రండి’ అంటూ కమలా హారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిత్వానికి పోటీ చేసే విషయమై గతేడాది జనవరిలో ప్రకటన చేశారు. కాలిఫోర్నియాలోని ఆక్లాండ్‌లో గల బాల్టిమోర్ నుంచి‘ఫర్ ద పీపుల్’ అనే నినాదంతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా మధ్యతరగతి ప్రజలు చెల్లించే పన్ను, వలస విధానం, హెల్త్‌కేర్ సిస్టమ్, న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచడం తదితర అంశాలను ఆమె ప్రముఖంగా చర్చించారు. ‘మనమంతా కలిసే ఈ పని పూర్తి చేస్తాం. మన భవిష్యత్తును నిర్మించుకుందాం. మన కోసం, మన పిల్లల కోసం, మన దేశం కోసం’ అంటూ కమల విడుదల చేసిన క్యాంపెయిన్ వీడియోకు అనూహ్య స్పందన లభించింది.(చదవండి: తాతయ్యతో కమలా హారిస్ అనుబంధం)
అందుకు తగ్గట్టే ప్రచార పథంలో దుసుకుపోతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే పార్టీలోని ఇతర సభ్యులతో పోలిస్తే కమల.. 3.5 శాతం ఓట్లు మాత్రమే సంపాదించి ఆరో స్థానానికి పడిపోయారు. ఈ నేపథ్యంలో ఆర్థిక కారణాల వల్ల అగ్రరాజ్య అధ్యక్ష రేసు నుంచి తాను వైదొలుగుతున్నట్లు అదే ఏడాది డిసెంబరులో కమల ప్రకటన చేశారు. అయితే రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిన తరుణంలో అనూహ్యంగా ఆమె ఉపాధ్యక్ష పదవి రేసులో నిలిచి.. ఆ ఘనత సాధించిన తొలి నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించారు. ఇండో- అమెరికన్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా జో బిడెన్ కమలకు ఈ అవకాశం కల్పించారు.
వచ్చే ఎన్నికల్లో అయినా..
ఇక అగ్రరాజ్య చరిత్రలో ఇంతవరకూ మహిళలు అధ్యక్షులుగా లేదా ఉపాధ్యక్షులుగా పనిచేసిన దాఖలాలు లేవు. 1984 లో డెమొక్రాట్ జెరాల్డిన్ ఫెరారో, 2008లో రిపబ్లికన్ సారా పాలిన్ ఉపాధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచినా పార్టీల ఓటమి కారణంగా వారికి నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో ప్రస్తుత ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ విజయం గనుక సాధించినట్లయితే అమెరికా వైస్ ప్రెసిడెంట్ పదవి అలంకరించే తొలి మహిళగా కమలా హారిస్ మరో సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంటుంది. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ప్రతిసారీ ఆమెను పదే పదే టార్గెట్ చేయడం, తనను ఉద్దేశించి జాతి వివక్షపూరిత వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే కమలకు ఉన్న క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతుందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు.
ఏదేమైనా వచ్చే అధ్యక్ష ఎన్నికల్లోనైనా కమలను ప్రెసిడెంట్ క్యాండిడేట్‌గా చూసే అవకాశం లేకపోలేదనే విశ్లేషణలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. అయితే కమల కంటే వయస్సులో 16 ఏళ్లు చిన్నదైనా తులసిని ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని, ఎప్పుడైనా కమలకు ఆమెను పోటీగానే భావించాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు అమెరికాకు ఒక మహిళ గనుక అధ్యక్షురాలు కావాలంటే ఆమె కచ్చితంగా డెమొక్రటిక్ పార్టీకి చెందినవారే అయి ఉంటారని చెప్పవచ్చు. ఎందుకంటే ‘సంప్రదాయ’ రిపబ్లికన్లు అధ్యక్ష ఎన్నికల్లో మహిళకు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు తక్కువే. ఇక డెమొక్రటిక్ పార్టీ 2016 అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌ను తమ అభ్యర్థిగా రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే. కాబట్టి భవిష్యత్తులో కమలా హారిస్‌నో లేదా తులసినో ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్‌గా చూడవచ్చేమో!!
Comments
Please login to add a commentAdd a comment