అగ్రరాజ్యం అమెరికాలో మరికొద్ది గంటల్లో ఎన్నికలు!.. నాలుగేళ్ల అధ్యక్ష అనుభవంతో రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడు, 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో డెమొక్రాట్ పార్టీ తరఫున జో బైడెన్ మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది! విజేత ఎవరో తెలిసేందుకు ఇంకా సమయమున్నా.. కొన్ని నెలలుగా దేశం మొత్తమ్మీద వేర్వేరు సంస్థలు నిర్వహిస్తున్న ఒపీనియన్ పోల్స్ గెలిచేదెవరో చూచాయగా చెప్పేస్తున్నాయి. ఒపీనియన్ పోల్స్ తారుమారైన చరిత్ర ఉన్న నేపథ్యంలో ఈనెల 3న జరిగే ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.
ఒపీనియన్ పోల్స్‌లో ‘జై’డెన్
ఎన్నికల గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో అమెరికాలోని పలు సంస్థలు అభిప్రాయ సేకరణ చేపడుతున్నాయి. యూనివర్సిటీలు, ప్రైవేట్ సంస్థలు నిర్వహించిన ఈ పోల్స్ అన్నింటి సారాంశం రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ గెలుపు వాకిట్లో ఉన్నారని!. అయితే ఎన్నికల ఫలితాలను కచ్చితంగా తేల్చేందుకు ఇవి పెద్దగా ఉపయోగపడవు. 2016లో హిల్లరీ క్లింటన్ దాదాపు అన్ని నేషనల్ ఒపీనియన్ పోల్స్‌లో కలిపి ట్రంప్ కంటే దాదాపు 30 లక్షల ఓట్లు అధికంగా సాధించినా అసలు ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. ఎలక్టోరల్ కాలేజీ వ్యవస్థ దీనికి కారణం. ఇక, అక్టోబర్ 29న మూడు సంస్థలు నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం కూడా జో బైడెన్‌దే పైచేయిగా తేలింది. ఇప్పటివరకు నిర్వహించిన అన్ని ఒపీనియన్ పోల్స్ సగటు తీసుకుంటే బైడెన్ (52%), ట్రంప్ (43%) మధ్య తొమ్మిది శాతం ఓట్ల అంతరం ఉంది. గత ఎన్నికల్లో ఈ అంతరం ఒకట్రెండు శాతానికి మించలేదు.
ఈ రాష్ట్రాలు ఎటు మొగ్గితే వారే విజేత!
అమెరికా ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయన్నది కాకుండా.. ఎవరికి ఎన్ని ఓట్లు ఏయే రాష్ట్రాల్లో పడ్డాయన్నదే కీలకం. ఉదాహరణకు 2016లో హిల్లరీ క్లింటన్‌కు పాపులర్ ఓట్లు ఎక్కువగా పోలైనా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు తక్కువగా పడ్డాయి. ట్రంప్‌కు 303 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు పడటంతో విజేతగా నిలిచారు. సంప్రదాయకంగా అమెరికన్ రాష్ట్రాల్లో ఓటింగ్ సరళి దాదాపుగా ఒకేలా ఉంటుంది. మొత్తం 50 రాష్ట్రాల్లో రిపబ్లికన్లకు కొన్ని, డెమొక్రాట్లకు మాత్రమే ఓటేసే రాష్ట్రాలు కొన్ని ఉంటాయి. వీటిని మినహాయిస్తే మిగిలిన కొన్ని రాష్ట్రాలు ఒక్కోసారి ఒక్కోలా స్పందిస్తుంటాయి. ఈ బ్యాటిల్ గ్రౌండ్ రాష్ట్రాలే అధ్యక్ష ఎన్నికల విజేతను నిర్ణయిస్తుంటాయి. 2020 ఎన్నికల విషయా నికొస్తే.. ఈసారి 38 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్న టెక్సాస్ బ్యాటిల్‌గ్రౌండ్ రాష్ట్రాల్లో అతి పెద్దది. కేవ లం 4 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్న న్యూహ్యాంప్‌షైర్ అతిచిన్నది. అమెరికా మొత్తమ్మీద 538 ఎలక్టోరల్ ఓట్లు అందుబాటులో ఉండగా, 270 ఓట్లు సాధించిన పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తాడు. బ్యాటిల్ గ్రౌండ్ రాష్ట్రాల్లో జరిగిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం జో బైడెన్ అధ్యక్షుడు ట్రంప్ కంటే ఆధిక్యంలో ఉన్నారు.
హాట్‌హాట్‌గా డిబేట్
అమెరికా ఎన్నికల్లో ఒపీనియన్ పోల్స్, బ్యాటిల్‌గ్రౌండ్ రాష్ట్రాల పరిస్థితి ఎంత ముఖ్యమో.. అధ్యక్ష స్థానానికి పోటీచేస్తున్న అభ్యర్థుల ముఖాముఖి చర్చలూ అంతే ముఖ్యం. సెప్టెంబర్ 29న జరిగిన తొలి ముఖాముఖి చర్చపై సీబీఎస్ న్యూస్/యూగవ్ సంస్థలు బ్యాటిల్‌గ్రౌండ్ రాష్ట్రాల్లో సర్వే నిర్వహించాయి. టెలివిజన్ చానళ్లలో చర్చను వీక్షించిన వారిలో 48% మంది బైడెన్‌కు, 41% మంది ట్రంప్‌కు ఓటేశారు. సీఎన్‌ఎన్ ఆకస్మిక పోలింగ్‌లో బైడెన్ ఏకంగా 60 శాతం మంది మద్దతు కూడగట్టగలిగారు. అక్టోబర్ 22న జరిగిన మూడో డిబేట్‌పై సీఎన్‌ఎన్, యూగవ్ నిర్వహించిన పోల్‌లోనూ బైడెన్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపారు.
శతాబ్దపు రికార్డు... ముందస్తు ఓటింగ్
అధ్యక్ష ఎన్నికలలో 2020 అక్టోబర్ 29వ తేదీ నాటికి అత్యధికంగా 8.63 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది ఈ శతాబ్దపు రికార్డుగా భావిస్తున్నారు. దేశమంతటా కోవిడ్ సమస్య ఉండటంతో ఓటర్లు ఎవరికి వారు వీలుని బట్టి ఓటు వేస్తున్నారు. ఓటర్లలో చైతన్యం పెరిగిందనీ, మొదటిసారి ఓటేస్తున్న యువత, ఓటు హక్కు కొత్తగా వచ్చిన విదేశీయులు కూడా ముందస్తు ఓటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారని అంటున్నారు. దాదాపు దేశమంతా ముందస్తు ఓటింగ్ రికార్డు స్థాయిలో పెరిగింది. ముందస్తు ఓటర్లలో ఆఫ్రికన్ అమెరికన్ల సంఖ్య మామూలుగానే ఉందని తెలుస్తోంది. ముందుగానే ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో 27 శాతం మంది కొత్త ఓటర్లని తేలింది. 2016లో 10% ముందస్తు ఓటు వేసిన ఈ వర్గం వారిలో ఇప్పటికి 9% మంది ఓటేశారు. మంగళవారం కూడా ఎక్కువ శాతం పోలింగ్ జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ట్రంప్ ర్యాలీలతో 30వేల మందికి కోవిడ్
డొనాల్డ్ ట్రంప్ జూన్ 20 నుంచి సెప్టెంబర్ 22 వరకు నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల ద్వారా 30 వేల మందికి పైగా కరోనా సోకిందని, వారిలో 700 మంది చనిపోయారని స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ పరిశోధకులు తెలిపారు. ట్రంప్ ఎన్నికల ర్యాలీలలో పాల్గొన్న ప్రజలు వ్యాధుల రూపంలో, మరణాల రూపంలో తీవ్రంగా నష్టపోయినట్టు చెప్పారు. ‘ది ఎఫెక్ట్స్ ఆఫ్ లార్జ్ గ్రూప్ మీటింగ్స్ ఆన్ ది స్ప్రెడ్ ఆఫ్ కోవిడ్ 19 : ద కేస్ ఆఫ్ ట్రంప్ ర్యాలీస్’ పేరుతో స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.
భారీ సభల ద్వారా కోవిడ్ విజృంభించే ప్రమాదం ఉంటుందని, అధికారులు చేసిన హెచ్చరికలను, సిఫార్సులను తమ విశ్లేషణ బలపరుస్తోందని వారు తెలిపారు. ‘‘ట్రంప్ మీ గురించి పట్టించుకోడు. తన సొంత మద్దతుదారులనూ పట్టించుకోడు’’ అని డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఈ అధ్యయనంపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా హాజరయ్యే వ్యక్తిగత సభలు కోవిడ్ వ్యాప్తికి అవకాశం కల్పిస్తాయని ది సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment