
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొదటి జాతీయ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియ (Philadelphia) ఎక్స్ పో సెంటర్‌లో మార్చి 28న మొదటి రోజు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులతో మొదటిరోజు వేడుక ఎన్నారైలను ఆకట్టుకుంది. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఘనమైన స్వాగతసత్కారాన్ని నిర్వాహకులు అందించారు.
కన్వెన్షన్ కన్వీనర్ సత్య విజ్జు, రవి చిక్కాల స్వాగతోపన్యాసం చేశారు. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (andhra pradesh american association) ఫౌండర్ హరి మోటుపల్లి AAA ముఖ్య నాయకులను వేదిక మీదకు ఆహ్వానించి, అభినందించారు. అనంతరం ఫౌండర్ హరి మోటుపల్లి AAA ఏర్పాటు, తదితర విషయాలపై క్లుప్తంగా వివరించారు. AAA అధ్యక్షులు బాలాజీ వీర్నాల సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఊహించిన దానికన్నా కన్వెన్షన్ విజయవంతం కావడం పట్ల ప్రెసిడెంట్ ఎలక్ట్ హరిబాబు తూబాటి హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. దాతలు, వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు.
కన్వెన్షన్‌ను పురస్కరించుకుని AAA నిర్వహించిన పోటీల్లో విజేతలకు హీరో, హీరోయిన్లు బహమతులు ప్రదానం చేశారు. హీరోలు సందీప్ కిషన్, ఆది, సుశాంత్, తరుణ్, విరాజ్.. హీరోయిన్స్ దక్ష, రుహాని శర్మ, అంకిత, కుషిత, ఆనంది ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ దర్శకులు సందీప్ వంగా, శ్రీనువైట్ల, వీరభద్రం, వెంకీ అట్లూరి మొదటిరోజు వేడుకల్లో మెరిశారు. డైరక్టర్ సందీప్ వంగాను స్టేజిమీదకు పిలిచినప్పుడు హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ రుహాని శర్మ, సినీ దర్శకులు వెంకీ అట్లూరి మ్యూజిక్ అవార్డ్స్ విజేతలను ప్రకటించారు. తరుణ్ నటించిన సినిమాల పాటలతో చేసిన ట్రిబ్యూట్ డాన్స్ ఆకట్టుకుంది. తానా, నాట్స్ వంటి ఇతర సంస్థల నాయకులను కూడా వేదికపైకి ఆహ్వానించి సన్మానించారు.

మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నిరవల్ బ్యాండ్ మ్యూజికల్ నైట్ అందరినీ అలరించింది. మహిళలు, పిల్లలు నిరవల్ బ్యాండ్ సింగర్స్ పాటలకు డాన్సులు చేసి ఆనందించారు. ఆంధ్ర వంటకాలతో వడ్డించిన బాంక్వెట్ డిన్నర్ అందరికీ ఎంతో నచ్చింది. బాంక్వెట్ డిన్నర్ నైట్‌కి సుప్రీమ్, ఎలైట్, ప్రీమియం అంటూ 3 రకాల సీటింగ్ ఏర్పాట్లు చేసి అందరి ప్రశంసలను నిర్వాహకులు అందుకున్నారు. సెలెబ్రిటీలు, స్టార్స్ అందరికీ అందుబాటులో ఉండేలా ఈ సీటింగ్ ఏర్పాట్లు చేయడం బాగుంది. ఆటపాటలతో ఆనందోత్సాహాలతో మొదటి రోజు కార్యక్రమం ముగిసింది.
చదవండి: గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి