హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆసుపత్రిలో అడ్మిట్ అంటే చాలు! చాలా మందికి భయం. ఎందుకంటే ఆసుపత్రి ఎలాంటిదో? వైద్యుడెలాంటి వాడో? అసలేం చికిత్స చేస్తున్నాడో? ఎంత చార్జీ వసూలు చేస్తారో?.. ఇలా ఒకటేమిటి.. అడ్మిషన్ నుంచి డిశ్చార్జయ్యే వరకూ సవాలక్ష సందేహాలు. వీటిన్నంటి నడుమ అసలు మీకొచ్చిన జబ్బేంటి? ఎలాంటి చికిత్స అవసరం? ఏ ఆసుపత్రి అయితే బెటర్? ఏ వైద్యుడైతే కరెక్ట్? ఆసుపత్రి, మందుల ధరలు, గత కస్టమర్ల అనుభవాలూ ప్రతీ అంశాన్ని ఆసుపత్రిలో అడ్మిట్ కాకముందే అందిస్తే? పేషెంటకు భయం పోతుంది!! త్వరగా కోలుకునే అవకాశమూ ఉంటుంది. ఇదిగో ఇలాంటి సేవలనే అందిస్తోంది క్రెడిహెల్త్. సంస్థ సేవల గురించి ఫౌండర్ రవి వీర్మణి మాటల్లోనే..
జంషెడ్‌పూర్‌లోని ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ వర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక.. ఎస్కార్ట్ గ్రూప్‌లో ఉద్యోగంలో చేరా. ఆ తర్వాత సొంతంగా నోబెల్ హౌజ్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ స్టార్టప్‌ను ప్రారంభించా. తర్వాత దీన్ని హెవిట్ అసోసియేట్స్ కొనుగోలు చేసింది. అప్పటి నుంచి హెవిట్‌లో సౌత్ ఏషియా ఎండీగా బాధ్యతలు చేపట్టా. 2005లో సింగపూర్‌లోని అవెంటూస్ కన్సల్టింగ్ సీఈఓగా చేరా. 2010 వరకూ పనిచేశా. తరవాత తిరిగొచ్చి ఢిల్లీ కేంద్రంగా సేవలందిస్తున్న మ్యాక్స్ హెల్త్‌కేర్ గ్రూప్ సీఓఓగా బాధ్యతలు స్వీకరించా. వైద్య రంగంలో రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో గమనించిదొక్కటే..!! స్వదేశంలో, విదేశాల్లో ఎక్కడ చూసినా వైద్య రంగంలో పారదర్శకత లోపమే ప్రధానంగా కనిపించేది.
అంటే ఆసుపత్రి నుంచి మొదలుపెడితే వైద్యుడు, మందులు, చార్జీలు ప్రతి దాంట్లోనూ పేషెంట్‌కు అనుమానమే. దీన్ని తొలగించి రోగికి భరోసా కలిగించాలని నిర్ణయించుకొని గుర్గావ్ కేంద్రంగా 2014 జనవరిలో క్రెడిహెల్త్‌ను ప్రారంభించా. ఇప్పటివరకు రూ.20 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టా. జబ్బు లక్షణాలు చెబితే చాలు ఏ ఆసుపత్రి బెటరో లేక ఏ వైద్యుడు సరైన చికిత్స చేస్తాడో వివరిస్తాం. ఆసుపత్రి నుంచి మొదలుపెడితే డాక్టర్, జబ్బు, చికిత్స విధానం, ధర, దానికి పట్టే సమయం, చికిత్స తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఇలా ఒకటేమిటి ఆసుపత్రిలో అడ్మిట్ నుంచి డిశ్చార్జి వరకూ సమస్త సమాచారం ముందే అందిస్తాం.
630 ఆసుపత్రులు, 30 వేల మంది వైద్యులు..
ప్రస్తుతం దేశంలోని 630 ఆసుపత్రులు, 30 వేల మంది వైద్యులతో ఒప్పందం చేసుకున్నాం. హైదరాబాద్ నుంచి 50 వరకు ఆసుపత్రులుంటాయి. అపోలో, కేర్, యశోదా, రెయిన్‌బో వంటివి కొన్ని. సేవలను బట్టి ఆసుపత్రి నుంచి సబ్‌స్క్రిప్షన్ చార్జీ నెలకు రూ.లక్ష నుంచి 5 లక్షల వరకుంటుంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ ల్లో అంబులెన్స్ సేవలూ లభిస్తాయి. ఆయా నగరాల్లో 800 మంది అంబులెన్స్ డ్రైవర్లు, స్థానిక ఆసుపత్రులతో ఒప్పందం చేసుకున్నాం.
10% విదేశీ పేషెంట్లే..: ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్‌కతా, పుణే, జైపూర్, చండీగఢ్ నగరాల్లో సేవలందిస్తున్నాం. ఆయా నగరాల్లో 4 లక్షల మంది కస్టమర్లున్నారు. మొత్తం కస్టమర్లలో విదేశీ పేషెంట్ల వాటా 10%. హైదరాబాద్ నుంచి 30% కస్టమర్లుంటారు. ప్రతి రోజూ 1,200 మంది పేషెంట్లు మా సేవలను వినియోగించుంటుంటున్నారు. ఇందులో 120 మంది వరకు విదేశీ పేషెంట్లుంటారు. నేపాల్, బంగ్లాదేశ్, ఇరాక్, ఆఫ్రికా నుంచి ఎక్కువగా పేషెంట్లు వస్తుంటారు.
2 నెలల్లో 97 కోట్ల సమీకరణ..
గతేడాది మా ఒప్పందం ఆసుపత్రులకు రూ.90 కోట్ల గ్రాస్ మర్చండేస్ వ్యాల్యూ (జీఎంవీ) చేసిచ్చాం. ఈ ఏడాది రూ.200 కోట్లు దాటుతుందని అంచనా. ప్రస్తుతం మా సంస్థలో 80 మంది ఉద్యోగులున్నారు. 2 నెలల్లో రూ.97 కోట్ల నిధులను సమీకరించనున్నాం. పలువురితో చర్చలు జరుగుతున్నాయి. ఈ నిధుల సహాయంతో కొచ్చిన్, అమృత్‌సర్, గౌహతి, లక్నో నగరాలకు విస్తరించాలని నిర్ణయించాం. ఒక్కో నగరంలో సుమారు 50 ఆసుపత్రులతో ఒప్పందం చేసుకుంటాం. ఏడాదిలో సింగపూర్, దుబాయ్ దేశాల్లోనూ సేవలను ప్రారంభిస్తాం. స్థానిక ఆసుపత్రులతో చర్చలు జరుపుతున్నాం.