ఆఫీసుకొచ్చారా.. సెల్ఫీ ఇవ్వండి! | new startup | Sakshi
Sakshi News home page

ఆఫీసుకొచ్చారా.. సెల్ఫీ ఇవ్వండి!

Published Sat, Feb 3 2018 12:46 AM | Last Updated on Sat, Feb 3 2018 12:46 AM

new startup  - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ‘సెల్ఫీ’.. సెల్‌ఫోన్‌ వినియోగదారులకు పరిచయం చేయాల్సిన పనిలేదేమో! ప్రమాదాలు కోరితెచ్చుకున్న వాళ్లనూ చూశాం. కానీ, అదే సెల్ఫీతో వ్యాపారం చేసేవాళ్లూ పెరుగుతున్నారు. రెగ్యులర్‌.లి... ఆ కోవలోదే.  సెల్ఫీతో హెచ్‌ఆర్‌ సేవలందిస్తోంది.  వివరాలు వ్యవస్థాపకుడు అవిజిత్‌ సర్కార్‌ మాటల్లోనే...

‘‘గతంలో ఉద్యోగులు, విద్యార్థులు, మార్కెటింగ్‌ వారు ఎవరైనా సరే.. హాజరైనట్టుగా రిజిస్టర్‌లో సంతకం చేసేవారు. తర్వాత బయోమెట్రిక్స్‌.. ఇకిప్పుడు ఐరిస్, ఫేసియల్‌ స్కానర్లు వచ్చేశాయి. వీటిలో దేనికైనా నిర్వహణ వ్యయం కాసింత ఎక్కువ. కానీ, సెల్ఫీ ఫొటోనే అటెండెన్స్‌ రిజిస్టర్‌లా మార్చేస్తే ఈ వ్యయం ఉండదుగా అనే ఆలోచన వచ్చింది. ఇంకేముంది మాతృసంస్థ అయిన అవీఫా ఇన్ఫోటెక్‌ బృందంతో కలిసి రెగ్యులర్‌.లి పేరిట క్లౌడ్‌ ఆధారిత యాప్‌ను అభివృద్ధి చేశాం. రూ.4 లక్షలతో గతేడాది ఆగస్టులో కోల్‌కతా కేంద్రంగా ప్రారంభించాం.

ఎలా పనిచేస్తుందంటే?
ఇది క్లౌడ్‌ టెక్నాలజీతో పనిచేస్తుంది. రెగ్యులర్‌ యాప్‌లో ఒప్పంద కంపెనీకి ప్రత్యేక ఖాతా తెరిచి అందులో వారి ఉద్యోగులను నమోదు చేయాలి. ఉద్యోగి ఆఫీసు పరిసరాల్లోకి చేరగానే ఆటోమేటిక్‌గా యాప్‌కు అనుసంధానమై పోతాడు. అందులో ఉన్న చెకిన్‌ బటన్‌ను నొక్కగానే సెల్ఫీతో కూడిన హాజరు నమోదవుతుంది.

ఇది నేరుగా యాజమాన్యానికి చేరిపోతుంది. అంతే!! స్మార్ట్‌ఫోన్‌ లేని ఉద్యోగులు ఆఫీసులోని లాప్‌ట్యాప్‌ లేదా డెస్క్‌టాప్‌ ద్వారా చెకిన్‌ కావచ్చు. ఇందులో క్యూఆర్‌ లేదా బార్‌ కోడ్‌ ఉంటుంది. దాన్ని ఫొటో ఐడీతో స్కాన్‌ చేయగానే సెల్ఫీతో కూడా చెకిన్‌ అవుతుంది. జీపీఎస్, వైఫై ఎస్‌ఎస్‌ఐడీ ఆధారంగా ఔట్‌డోర్‌ ఉద్యోగుల ఫీల్డ్‌ ట్రాకింగ్‌ కూడా చేస్తుంది. యాజమాన్యానికి ఉద్యోగి లొకేషన్‌ మ్యాప్స్‌ ద్వారా కనిపిస్తుంటుంది.

జీతభత్యాలు; ప్రదర్శన సేవలు కూడా..
హాజరు నమోదొక్కటే కాదు. సమయ పాలన, పనితీరు నివేదికలు, సెలవుల నిర్వహణ సేవలూ ఈ యాప్‌తోనే నిర్వహించుకునే వీలుంది. ఒప్పందం కంపెనీల హెచ్‌ఆర్‌ విభాగం పనిభారాన్ని తగ్గించేందుకు వచ్చే ఏడాది తొలి త్రై మాసికం నాటికి జీతభత్యాల నిర్వహణ సేవలను కూడా అందిస్తాం. జీపీఎస్, వైఫైలకు లాకింగ్స్‌ ఉంటాయి. కాబట్టి భద్రత విషయంలోనూ అనుమానాలవసరం లేదు.

60 కంపెనీలు; 10 వేల ఉద్యోగులు..
ప్రస్తుతం ఇండియాతో పాటు ఆగ్నేయాసియా దేశాల్లో సేవలందిస్తున్నాం. లెన్స్‌కార్ట్, వెస్ట్‌విండ్, సరళ్‌ డయాగ్నస్టిక్స్, నానో ఐడీ, గ్రాబ్‌ ట్యాక్సీ వంటి 60కి పైగా సంస్థలు మా కస్టమర్లుగా ఉన్నాయి. వీటిలో 10 వేలకు పైగా ఉద్యోగుల అటెండెన్స్‌ను మేం నిర్వహిస్తున్నాం. చార్జీలు నెలకు ఒక యూజర్‌కు 1 డాలర్‌.

రూ.6 కోట్ల నిధుల సమీకరణ..: జూలై నాటికి బ్రేక్‌ఈవెన్‌కొస్తాం. ఈ ఏడాది ముగిసే నాటికి 200 మంది కస్టమర్లను చేరుకోవాలని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం మా సంస్థలో ఐదుగురు ఉద్యోగులున్నారు. తొలిసారిగా నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించాం. పలువురు వీసీ ఇన్వెస్టర్లు రూ.6 కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నారు. కానీ విస్తరణ తర్వాతే సమీకరిస్తాం’’‘ అని అవిజిత్‌ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement