selphie
-
పాణం తీసిన సెల్ఫీ
చిల్పూరు: సెల్ఫీ మోజు ఓ యువకుడిని బలి తీసుకుంది. ఈ ఘటన జనగామ జిల్లా చిల్పూరు మం డలం మల్లన్నగండి వద్ద సోమవారం చోటుచేసుకుంది. సీఐ రాజిరెడ్డి కథనం ప్రకారం.. లింగాలఘణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన హరికృష్ణ ఓ ప్రయివేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. సంక్రాంతి సెలవుల సందర్భంగా గ్రామానికి వచ్చిన అతను సోమవారం ఉదయం స్నేహితులైన మధు, సాయితేజ, శేఖర్, కిషోర్, సాయికుమార్‌లతో కలసి చుట్టుపక్కల రిజర్వాయర్లను చూసుకుంటూ మల్లన్నగండికి చేరుకున్నారు. అక్కడ కాసేపు సరదాగా తిరిగారు. చివరకు ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి మల్లన్నగండిలోకి నీరు పోస్తున్న పైప్‌లైన్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న స్థానికులు పైకి ఎక్కి ఫొటోలు దిగవద్దని వారించి వెళ్లి పోయారు. అయినా వినకుండా సెల్ఫీ దిగేందుకు ఎక్కారు. హరికృష్ణ సెల్ఫీ తీసేందుకు అందరిని ఒకదగ్గరకు రమ్మంటూ వెనక్కి జరగడంతో ప్రమాదవశాత్తు జారీ రిజర్వాయర్‌లో పడి పోయాడు. అతని స్నేహితులు వెంటనే సమీపంలో ఉన్న రైతులకు సమాచారం ఇవ్వగా వారు పోలీసులకు తెలిపారు. మృతదేహం కోసం గాలించినా ఫలితం దక్కలేదు. -
విషాదం మిగిల్చిన సెల్ఫీ సరదా
ఎదులాపురం (ఆదిలాబాద్): సెల్ఫీ మోజు రెండు కుటుంబాలలో తీవ్ర విషాదం నింపింది. బోటింగ్ సమయంలో సెల్ఫీకి ప్రయత్నించి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్యనగర్ కాలనీకి చెందిన సోను, సోఫీల్, ఉమేర్, ఇర్ఫాన్, మన్సూర్‌లు మోటార్ సైకిళ్లపై బుధవారం మొహర్రం వేడుకలను చూడటానికి చంద్రపూర్ జిల్లా రాజురాకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మహారాష్ట్రలోని పెన్‌గంగ ముకుడ్‌బంద్ ప్రాంతంలో గురువారం బోటింగ్ నిమిత్తం ఆగారు. బోటింగ్ చేస్తున్న తరుణంలో మధ్యలోకి వెళ్లిన వారు సెల్ఫీ దిగేందుకు యత్నించారు. ఈ తరుణంలో ఒకే వైపు భారం పడటంతో బోటు బోల్తా పడింది. గమనించిన స్థానికులు రక్షణ చర్యలు చేపట్టారు. అప్పటికే గల్లంతైన సోను(22), సోఫిల్(23) నీటమునిగి మృతిచెందారు. ఉమేర్, ఇర్ఫాన్‌లు తీవ్ర అస్వస్థతకు గురి కాగా, చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
కేటీఆర్ సెల్ఫీ.. యువతి ఫిదా
హైదరాబాద్: ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో నిత్యం రద్దీగా ఉండే కింగ్‌కోఠి సిగ్నల్ వద్ద కేటీఆర్ కాన్వాయ్ అగింది. అక్కడే ఉన్న ఓ బెంగళూరు యువతి కేటీఆర్‌ను చూసి హాయ్ అంటూ విష్ చేసింది. వెంటనే హాయ్.. అమ్మా అంటూ నవ్వుతూ ఆ యువతిని పలకరించారు. దీంతో ఆమె ‘సార్ మీతో ఓ సెల్ఫీ దిగొచ్చా’అని అడిగింది. సరే అంటూ మంత్రి కాన్వాయ్ దిగి సెల్ఫీ ఇవ్వడంతో ఆమె ఫిదా అయింది. ఈ సంఘటనను చూసిన మరికొందరూ ఆయనతో సెల్ఫీ దిగారు. సెల్ఫీ ఫొటోలను కొందరు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి. -
ప్రాణాలు పోతుంటే.. సెల్ఫీల గోల
బర్మర్: సెల్ఫీల పిచ్చి మనుషుల్ని ఎంతలా దిగజార్చిందో తెలిపే ఘటన రాజస్తాన్‌లో జరిగింది. బర్మర్ జిల్లాలోని ఛోహ్‌టన్‌లో సోమవారం బైక్‌పై వెళుతున్న ముగ్గురు యువకుల్ని ఓ స్కూల్ బస్సు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై రక్తపు మడుగులో పడున్న యువకులు నొప్పితో సాయం కోసం అర్థిస్తుంటే.. చుట్టుపక్కల వాళ్లు మాత్రం ఘటనాస్థలంలో సెల్ఫీలు, వీడియోలు తీసుకునేపనిలో పడ్డారు. ఏ ఒక్కరూ సాయంచేయలేదు. ఓ అరగంట తర్వాత పోలీసులు అక్కడకు చేరుకుని ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. క్షతగాత్రుల్లో ఒకరు ప్రమాదంజరిగిన చోటే చనిపోయారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. -
ట్రంప్‌తో కుదరలేదు.. కారుతోనే సెల్ఫీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారు ముందు నిల్చొని సెల్ఫీ దిగుతున్న ఈ యువకుడు భారత సంతతికి చెందిన మహరాజ్ మోహన్(25). మలేసియాలో నివాసముంటున్న మోహన్ ట్రంప్‌ను కలవాలనే కోరికతో సింగపూర్ వెళ్లి, ట్రంప్ దిగిన హోటల్లోనే బస చేశాడు. ఇందుకోసం అతను ఒక్కరోజుకే రూ.38 వేలు చెల్లించాడు. మంగళవారం ఉదయం 6.30 గంటల నుంచి లాబీ బయట నిల్చుని పడిగాపులు కాసిన మోహన్‌కు 8 గంటలకు ట్రంప్ బయటకు వెళ్తున్న సమయంలో కనిపించారు. ట్రంప్‌తో మాట్లాడే అవకాశం రాకపోవడంతో ఆయన కారుతో సెల్ఫీ దిగి సంతృప్తి పొందాడు. -
క్రికెట్ దేవుడే దిగి వస్తే...
అది ముంబైలోని బాంద్రా ప్రాంతం... నిర్మాణంలో ఉన్న మెట్రో వద్ద రాత్రివేళ కొందరు కుర్రాళ్లు క్రికెట్ ఆడుతున్నారు. ఇంతలో అక్కడో కారు ఆగింది... అందులోంచి తెల్ల చొక్కా, నల్ల ప్యాంట్ వేసుకున్న వ్యక్తి దిగాడు... నేరుగా యువకుల వద్దకు వచ్చి కరచాలనం చేశాడు... ఇది కలా? నిజమా? అని ఆశ్చర్యంలో ఉండగానే వారి నుంచి బ్యాట్ తీసుకుని తనదైన శైలిలో ఐదు బంతులు ఆడాడు... సెల్ఫీలు దిగాడు. ఇంతలో జనం పోగవసాగారు. దీంతో ఆ ‘క్రికెట్ దేవుడు’ మాయమైపోయాడు. ఇప్పటికే అర్థమైందిగా వచ్చింది ఎవరనేది? అవును...! ఆ వ్యక్తి సచిన్ టెండూల్కర్. ఈ మేరకు వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. -
సెల్ఫీల వీరుడు!
స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ఈ మధ్య యువత తెగ సెల్ఫీలకు పోజులిచ్చేస్తున్నారు. కాస్త ప్రత్యేకంగా ఉండాలని ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. అయితే సెల్ఫీలంటే ప్రాణంగా భావించే వారూ ఈ మధ్య పెరిగిపోతున్నారు. అయితే వారందరినీ వెనక్కు నెట్టేసి ముందువరుసలో నిలుస్తాడు ఈ ఫొటోలోని యువకుడు. బ్రిటన్‌లోని పీటర్స్బర్గ్కు చెందిన జునైద్ అహ్మద్‌కు సెల్ఫీలంటే మహా............ పిచ్చి. ఎంత పిచ్చి అంటే సెల్ఫీలు దిగే ముందు కనీసం మూడు గంటల పాటు తయారవుతాడట. రోజుకు తక్కువలో తక్కువ 200 సెల్ఫీలు దిగుతాడట. అంతేకాదు వాటిని వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తాడట. తన ఇన్‌స్టాగ్రామ్‌లో అహ్మద్‌కు 50 వేల మంది ఫాలోవర్లు ఉన్నారట. దీంతో వారందరికీ నచ్చేలా ఉండేట్లు గంటల తరబడి అద్దం ముందు నిల్చుని రెడీ అవుతాడట. అంతేకాదు వారానికోసారి ఫేషియల్స్, కంటిబొమ్మలను సరిచేసుకోవడం వంటివి చేస్తాడట. అలాగే ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయించుకున్నాడట. ఉదయం తన ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగానే వందల కొద్దీ లైక్‌లు కామెంట్లు వస్తాయని, దీంతో తనకు ఎంతో ఆనందంగా ఉంటుందని చెబుతున్నాడు. తనకు సెల్ఫీ కింగ్ అని కూడా బిరుదు ఇచ్చుకున్నాడు. ఇంతకు మించి సెల్ఫీ అంటే ‘పిచ్చి’ ఉన్న వ్యక్తి లోకంలో ఉండడేమో! -
ఆఫీసుకొచ్చారా.. సెల్ఫీ ఇవ్వండి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘సెల్ఫీ’.. సెల్‌ఫోన్ వినియోగదారులకు పరిచయం చేయాల్సిన పనిలేదేమో! ప్రమాదాలు కోరితెచ్చుకున్న వాళ్లనూ చూశాం. కానీ, అదే సెల్ఫీతో వ్యాపారం చేసేవాళ్లూ పెరుగుతున్నారు. రెగ్యులర్.లి... ఆ కోవలోదే. సెల్ఫీతో హెచ్ఆర్ సేవలందిస్తోంది. వివరాలు వ్యవస్థాపకుడు అవిజిత్ సర్కార్ మాటల్లోనే... ‘‘గతంలో ఉద్యోగులు, విద్యార్థులు, మార్కెటింగ్ వారు ఎవరైనా సరే.. హాజరైనట్టుగా రిజిస్టర్లో సంతకం చేసేవారు. తర్వాత బయోమెట్రిక్స్.. ఇకిప్పుడు ఐరిస్, ఫేసియల్ స్కానర్లు వచ్చేశాయి. వీటిలో దేనికైనా నిర్వహణ వ్యయం కాసింత ఎక్కువ. కానీ, సెల్ఫీ ఫొటోనే అటెండెన్స్ రిజిస్టర్‌లా మార్చేస్తే ఈ వ్యయం ఉండదుగా అనే ఆలోచన వచ్చింది. ఇంకేముంది మాతృసంస్థ అయిన అవీఫా ఇన్ఫోటెక్ బృందంతో కలిసి రెగ్యులర్.లి పేరిట క్లౌడ్ ఆధారిత యాప్‌ను అభివృద్ధి చేశాం. రూ.4 లక్షలతో గతేడాది ఆగస్టులో కోల్‌కతా కేంద్రంగా ప్రారంభించాం. ఎలా పనిచేస్తుందంటే? ఇది క్లౌడ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. రెగ్యులర్ యాప్‌లో ఒప్పంద కంపెనీకి ప్రత్యేక ఖాతా తెరిచి అందులో వారి ఉద్యోగులను నమోదు చేయాలి. ఉద్యోగి ఆఫీసు పరిసరాల్లోకి చేరగానే ఆటోమేటిక్‌గా యాప్‌కు అనుసంధానమై పోతాడు. అందులో ఉన్న చెకిన్ బటన్‌ను నొక్కగానే సెల్ఫీతో కూడిన హాజరు నమోదవుతుంది. ఇది నేరుగా యాజమాన్యానికి చేరిపోతుంది. అంతే!! స్మార్ట్‌ఫోన్ లేని ఉద్యోగులు ఆఫీసులోని లాప్‌ట్యాప్ లేదా డెస్క్‌టాప్ ద్వారా చెకిన్ కావచ్చు. ఇందులో క్యూఆర్ లేదా బార్ కోడ్ ఉంటుంది. దాన్ని ఫొటో ఐడీతో స్కాన్ చేయగానే సెల్ఫీతో కూడా చెకిన్ అవుతుంది. జీపీఎస్, వైఫై ఎస్ఎస్ఐడీ ఆధారంగా ఔట్‌డోర్ ఉద్యోగుల ఫీల్డ్ ట్రాకింగ్ కూడా చేస్తుంది. యాజమాన్యానికి ఉద్యోగి లొకేషన్ మ్యాప్స్ ద్వారా కనిపిస్తుంటుంది. జీతభత్యాలు; ప్రదర్శన సేవలు కూడా.. హాజరు నమోదొక్కటే కాదు. సమయ పాలన, పనితీరు నివేదికలు, సెలవుల నిర్వహణ సేవలూ ఈ యాప్‌తోనే నిర్వహించుకునే వీలుంది. ఒప్పందం కంపెనీల హెచ్ఆర్ విభాగం పనిభారాన్ని తగ్గించేందుకు వచ్చే ఏడాది తొలి త్రై మాసికం నాటికి జీతభత్యాల నిర్వహణ సేవలను కూడా అందిస్తాం. జీపీఎస్, వైఫైలకు లాకింగ్స్ ఉంటాయి. కాబట్టి భద్రత విషయంలోనూ అనుమానాలవసరం లేదు. 60 కంపెనీలు; 10 వేల ఉద్యోగులు.. ప్రస్తుతం ఇండియాతో పాటు ఆగ్నేయాసియా దేశాల్లో సేవలందిస్తున్నాం. లెన్స్‌కార్ట్, వెస్ట్‌విండ్, సరళ్ డయాగ్నస్టిక్స్, నానో ఐడీ, గ్రాబ్ ట్యాక్సీ వంటి 60కి పైగా సంస్థలు మా కస్టమర్లుగా ఉన్నాయి. వీటిలో 10 వేలకు పైగా ఉద్యోగుల అటెండెన్స్‌ను మేం నిర్వహిస్తున్నాం. చార్జీలు నెలకు ఒక యూజర్‌కు 1 డాలర్. రూ.6 కోట్ల నిధుల సమీకరణ..: జూలై నాటికి బ్రేక్‌ఈవెన్‌కొస్తాం. ఈ ఏడాది ముగిసే నాటికి 200 మంది కస్టమర్లను చేరుకోవాలని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం మా సంస్థలో ఐదుగురు ఉద్యోగులున్నారు. తొలిసారిగా నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించాం. పలువురు వీసీ ఇన్వెస్టర్లు రూ.6 కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నారు. కానీ విస్తరణ తర్వాతే సమీకరిస్తాం’’‘ అని అవిజిత్ వివరించారు. -
బీచ్‌లో సెల్ఫీ తీసుకుంటూ ముగ్గురు గల్లంతు
డామన్: కేంద్ర పాలిత ప్రాంతం డామన్ డయ్యూలోని నగవ్ బీచ్‌లో సెల్ఫీలు తీసుకుంటుండగా పెద్ద అల వచ్చి ముగ్గురు కొట్టుకుపోయారు. రాజస్తాన్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులు డయ్యూ దగ్గర్లో భవన నిర్మాణ పనిలో చేరారు. ఆదివారం బీచ్‌లో నలుగురు ఓ రాయిపై కూర్చొని సెల్ఫీ తీసుకుంటుం డగా, మరొకరు కాస్త దూరం నుంచి వారిని వీడియో తీస్తున్నారు. అదే సమయంలో రాకాసి అల వచ్చి రాయిపై కూర్చున్న నలుగురిని సముద్రంలోకి లాక్కుపోయింది. కొద్ది సేపటి తర్వాత ఒకరు ఈదుకుంటూ ఒడ్డుకు రాగలిగారు. మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.