పరిశోధన మీది.. పెట్టుబడి మాది! | new startup dairy | Sakshi
Sakshi News home page

పరిశోధన మీది.. పెట్టుబడి మాది!

Published Sat, Dec 23 2017 1:38 AM | Last Updated on Sat, Dec 23 2017 1:38 AM

new startup dairy - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో :  హవాయ్‌కు చెందిన ఓ రీసెర్చ్‌ స్కాలర్‌ ‘అగ్నిపర్వతాల నుంచి విద్యుత్‌ తయారీ’ అంశాన్ని శోధిస్తున్నాడు. జర్మనీకి చెందిన మరో స్కాలర్‌ ‘మైక్రోసెన్సార్లతో భవనాల్లో విద్యుత్‌ వినియోగాన్ని ఎలా చేయాలి’ అనేది పరిశోధిస్తున్నాడు. ఢిల్లీకి చెందిన ఇంకో రీసెర్చర్‌ ‘డ్రోన్లు, సెన్సార్ల ఆధారంగా గాలి, కాలుష్యం స్థాయి ఎలా ఉంటుందోనని’ చూస్తున్నాడు.

..ఇలా ఒకటి, రెండూ కాదు!. సైన్స్, సామాజిక అంశాలపై 30కి పైగా రీసెర్చ్‌లు జరుగుతున్నాయి. వీటన్నింటికీ వేదిక మన తెలుగు కుర్రాడి స్టార్టప్‌ ‘రీసెర్చ్‌ ఫండర్స్‌’!! నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన అకీరా పీఎస్‌ ప్రారంభించిన రీసెర్చ్‌ ఫండర్స్‌ గురించి మరిన్ని వివరాలు ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే...

‘‘రీసెర్చ్‌ స్కాలర్స్‌కు ఎదురయ్యే ప్రధాన సమస్యలు.. నిధులు, మార్గదర్శనం, పరిశోధన పరికరాలు. ఇక ల్యాబ్, ఆర్‌అండ్‌డీ కోసమైతే కోట్లలోనే ఖర్చవుతుంది. కానీ, ప్రభుత్వమిచ్చే నిధులు 40 శాతమే. మిగిలిన మొత్తాన్ని స్కాలర్లు సమకూర్చుకోలేక మధ్యలోనే పరిశోధనలు నిలిపేస్తున్న సంఘటనలు బోలెడు. ‘ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ’ అంశంపై ఎంఎస్‌ చేస్తున్న సమయంలో నాకూ ఇవన్నీ ఎదురయ్యాయి. దీనికి పరిష్కారం చూపే క్రమంలోనే ‘రీసెర్చ్‌ ఫండర్స్‌.ఓఆర్‌జీ’ సంస్థను ప్రారంభించా. రూ.18 లక్షల పెట్టుబడితో గతేడాది సెప్టెంబర్‌లో మొదలైంది. రీసెర్చ్‌ స్కాలర్లు, ఇన్వెస్టర్లను కలపడమే మా పని. అంటే రీసెర్చ్‌ అకడమిక్‌కు మాది ఒక సామాజిక వేదికన్న మాట.

స్కాలర్లకు రూ.1.4 కోట్ల నిధులు..
బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎకనమిక్స్, డాటా సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, పొలిటికల్‌ సైన్స్‌ వంటి 25కి పైగా సబ్జెక్ట్‌ల్లోని పరిశోధనలను మా వేదికపై నమోదు చేసుకోవచ్చు. ఇప్పటివరకు 30కి పైగా పరిశోధన ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి. మన దేశంతో పాటు జర్మనీ, యూకే, సింగపూర్‌ దేశాల నుంచి కూడా పరిశోధనలున్నాయి. రీసెర్చ్‌ ఫండర్స్‌లో 7 వేల మంది ఇన్వెస్టర్లు (బ్రాకర్స్‌) నమోదయ్యారు. ఇప్పటివరకు రీసెర్చ్‌ స్కాలర్స్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.1.4 కోట్ల నిధులను సమీకరించారు.

నమోదు ఉచితమే, కానీ..
రీసెర్చ్‌ ఫండర్స్‌లో పరిశోధనల నమోదు ఉచితమే. కాకపోతే, నిధులు పొందాక దాన్లో 5 శాతం, ల్యాబ్‌కైతే 10 శాతం రీసెర్చ్‌ ఫండర్స్‌కు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మరి, ఇన్వెస్టర్లకేం ప్రయోజనమంటే.. రీసెర్చ్‌ స్కాలర్లు తమ పరిశోధన పూర్తయ్యాక దాని ఫలితాలను వారికి ఫండింగ్‌ ఇచ్చిన వారితోనే పంచుకోవాల్సి ఉంటుంది. గత నెలలో రూ.12 లక్షల వ్యాపారాన్ని నమోదు చేశాం.

హైదరాబాద్‌లో ఏఐ ఆర్‌అండ్‌డీ ల్యాబ్‌..
ప్రస్తుతం మా సంస్థలో ఆరుగురు ఉద్యోగులున్నారు. దేశంలో ఆర్‌ అండ్‌ డీ పరిశ్రమ విలువ 48 బిలియన్‌ డాలర్లు. పలు ఆర్‌అండ్‌డీ వర్సిటీలు, ప్రైవేట్‌ సంస్థల సహకారంతో హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) అకడమిక్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నాం. ఇందుకోసం కేంద్ర పరిశోధన విభాగం(సీబీడీ) తోనూ చర్చలు జరిపాం. కలారీ క్యాపిటల్‌ ‘కే స్టార్ట్‌’ కార్యక్రమంలో రూ.5 కోట్ల నిధులను సమీకరించనున్నాం. తొలి విడత చర్చలూ ముగిశాయి’’ అని అకీరా వివరించారు.


అకీరా పీఎస్‌కు జర్మనీ ఫెలోషిప్‌..
అకీరా పీఎస్‌ అసలు పేరు పరిశణబోయిన శ్రవణ్‌ కుమార్‌. హైదరాబాద్‌లోని టీకేఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తయ్యాక.. ఉద్యోగం రాకపోవటంతో జేఎన్‌టీయూలో ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీపై ఎంఎస్‌లో చేరాడు. ఆర్ధిక ఇబ్బందులతో మధ్యలోనే వదిలేసి.. అదే జేఎన్‌టీయూలో పరీక్షల విభాగంలో ఉద్యోగంలో చేరాడు. ‘‘అప్పుడే అనిపించింది చిన్న నగరాలు, పట్టణాల్లో యువతకు నిరుద్యోగ సమస్యలేంటో? ఉద్యోగావకాశాలు సరిగా తెలియవు? తెలిసినా ఎలా దరఖాస్తు చేసుకోవాలో? ఎలా ఎదుర్కోవాలో తెలియదని.

దీనికి పరిష్కారం చూపించే క్రమంలోనే ఇంటర్నెట్‌ అవసరం లేకుండా స్థానిక ఉద్యోగ అవకాశాలను తెలుసుకునే ‘నోటిఫై యూ’ అనే ఓ సామాజిక సెర్చ్‌ ఇంజిన్‌ను అభివృద్ధి చేశా.  ఉద్యోగార్థులు  విద్యార్హత, చిరునామా, ఫోన్‌ నంబరు వంటి వ్యక్తిగత వివరాలను నోటిఫై యూ డేటాబేస్‌లో నమోదు చేస్తే.. మీ అర్హతకు తగ్గ ఉద్యోగం స్థానికంగా ఎక్కడ ఉందో వెతికి సంబంధిత కస్టమర్‌ ఫోన్‌కు మెసేజ్‌ పంపిస్తుంది. 2013లో ప్రారంభించి.. 2014 డిసెంబర్‌ వరకూ నోటిఫై యూను నడిపించాం. సుమారు 20 లక్షల మంది నమోదయ్యారు. నోటిఫై యూ ప్రాజెక్ట్‌ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. దీన్ని గమనించిన జర్మనీలోని ఇంక్యుబేటర్‌ 2016లో సోషల్‌ ఆస్ట్రోనాట్‌ రీసెర్చ్‌లో ఫెలోషిప్‌ ఇచ్చింది’’ అని అకిరా తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement