హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెల్‌ఫోన్లు, దుస్తులే కాదు ఔషధాలూ డిస్కౌంట్లతో ఆన్‌లైన్‌లో కొనడం మనకు తెలిసిందే. కానీ, కేన్సర్, గుండె జబ్బులు వంటి ఖరీదైన మందులు సైతం రాయితీలో దొరకటమంటే కష్టం. అందుకే దీన్నే వ్యాపారంగా మార్చి ‘కోమెడ్జ్.కామ్’ను ఆరంభించారు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన శ్రీహరి అరిగె. వ్యక్తిగత అవసరాలతో పాటు స్థానిక రిటైల్ మందుల షాపులకూ ఔషధాలను అందించడం దీని ప్రత్యేకత. మరిన్ని వివరాలు వ్యవస్థాపకుడు శ్రీహరి మాటల్లోనే...
ఎస్‌వీయూ ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక.. ఐటీలో ఉద్యోగ రీత్యా లండన్‌కెళ్లా. కుటుంబ వ్యాపారం మెడికల్ స్టోర్ కావటంతో దీనికి టెక్నాలజీని జోడించా. రూ.కోటి పెట్టుబడులతో గతేడాది ఆగస్టులో కోమెడ్జ్.కామ్‌ను ప్రారంభించా. ప్రస్తుతం కోమెడ్జ్.కామ్‌లో 80 వేలకు పైగా ఔషధాలున్నాయి. సాధారణ మందులతో పాటూ మధుమేహం, గుండె జబ్బులు, కేన్సర్ చికిత్స వంటి ఖరీదైన మందులు, పోషకాహార ఉత్పత్తులు, మాతాశిశు సంరక్షణ ఔషధాలు, ఆయుర్వేద మందులు కూడా లభిస్తాయి.
ప్రస్తుతం నెలకు 3,000–5,000 ఆర్డర్లు వస్తున్నాయి. వీటి విలువ సుమారు రూ.5 లక్షల వరకుంటుంది. నెలకు రూ.లక్ష వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నాం. వెయ్యి పైన ఆర్డర్‌కు ఉచిత డెలివరీ, 22 శాతం డిస్కౌంట్ ఉంటుంది. వెయ్యి లోపయితే రూ.50 డెలివరీ చార్జీ, 15 శాతం డిస్కౌంట్ ఉంటుంది. ప్రస్తుతం మాకు 800 మంది కస్టమర్లున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఎక్కువగా ఆర్డర్లు వస్తున్నాయి. కేన్సర్, గుండె జబ్బుల మందుల ఆర్డర్లు ఎక్కువగా వస్తుంటాయి. కారణం డిస్కౌంట్లే.
హైదరాబాద్‌లో మందుల డెలివరీ కోసం సొంతంగా 15 మంది సిబ్బందిని నియమించుకున్నాం. ఇతర నగరాల్లో డెలివరీ కోసం తపాలా శాఖతో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 22 మంది ఉద్యోగులున్నారు. త్వరలోనే ల్యాబ్ పరీక్షలను అందించాలని నిర్ణయించాం. ఈ ఏడాది ముగిసేసరికి 5 వేల మంది కస్టమర్లు, నెలకు రూ.కోటి వ్యాపారం చేయాలని లకి‡్ష్యంచాం. ఈ ఏడాది ముగింపులోగా రూ.10 కోట్ల నిధుల సమీకరణ చేయనున్నాం. పలువురు ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment