తక్కువ సెక్షన్ల నమోదుకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆంజనేయులు
రావులపాలెం : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం టౌన్ సీఐ సీహెచ్ ఆంజనేయులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ డి.శ్రీహరిరాజు కథనం ప్రకారం.. గత నెల 16న రావులపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కోడిపందాల కేసు నమోదు చేశారు. మండలంలోని పొడగట్లపల్లిలో నిర్వహించిన కోడిపందాలపై పోలీసులు దాడి చేసి, అప్పట్లో పలువురిని అరెస్టు చేశారు. కొన్ని వాహనాలను, కోళ్లను స్వా«దీనం చేసుకున్నారు.
ఈ కేసులో కోడిపందాలు నిర్వహించిన స్థల యజమాని కుంచెర్లపాటి లక్ష్మణరాజు నుంచి సీఐ ఆంజనేయులు అప్పట్లో కొంత మొత్తం లంచంగా తీసుకున్నాడు. అనంతరం చార్జిషీటులో తక్కువ సెక్షన్లు నమోదు చేసేందుకు, లక్ష్మణరాజుపై రౌడీ షీట్ తెరవకుండా ఉండేందుకు మరో రూ.50 వేలు లంచం ఇవ్వాలని పలుమార్లు డిమాండ్ చేశాడు.
దీంతో విసిగిపోయిన లక్ష్మణరాజు రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల పథకం ప్రకారం సీఐ ఆంజనేయులుకు లక్ష్మణరాజు స్థానిక పోలీస్ స్టేషన్‌లో శనివారం రూ.50 వేలు లంచం ఇచ్చాడు. ఆ మొత్తాన్ని తీసుకుంటున్న సీఐ ఆంజనేయులును అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment