హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కుయ్.. కుయ్.. కుయ్‌మంటూ వచ్చే అంబులెన్స్ క్షణం ఆలస్యమైతే? ప్రాణం ఖరీదవుతుంది! నిజం, ఫ్రాన్స్‌కు చెందిన ఆంటోని పోయిర్సన్ విషయంలో జరిగిందిదే. చేతిలో డబ్బుతో.. బృందంతో.. పక్కా ప్రణాళికతో ఇండియాకు వచ్చాడు సోలార్ ప్లాంట్ పెడదామని! కానీ, ‘తానొకటి తలిస్తే.. దైవం ఇంకోటి తలచినట్లు’ సోలార్ ప్లాంట్ కాస్త స్టాన్‌ప్లస్ అత్యవసర వైద్య సేవల కంపెనీగా మారింది. అసలేం జరిగిందో ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు కంపెనీ కో–ఫౌండర్లు ఆంటోని పోయిర్సన్, జోసీ లియోన్, ప్రదీప్ సింగ్. అది వారి మాటల్లోనే చూద్దాం...
‘‘రాజస్థాన్‌లో సోలార్ ప్లాంట్ పెట్టాలని 2013లో ఫ్రాన్స్ నుంచి ఇండియాకొచ్చా. ఆ సమయంలో నా బృందంలోని ఓ సహచరుడికి రోడ్డు ప్రమాదం జరిగింది. వెంటనే మేం అంబులెన్స్‌కు ఫోన్ చేశాం. కానీ, లాభం లేకపోయింది! అంబులెన్స్ ఆలస్యంగా వచ్చింది. పైగా ఆసుపత్రికి వెళ్లటానికి 3 గంటలు పట్టింది. ఆ అంబులెన్స్‌లో పూర్తి స్థాయి వైద్య సౌకర్యాలూ లేవు. అందులోని సిబ్బంది శిక్షణ ఉన్నవారు కూడా కాదు. ఇవన్నీ నా మనసులో బలమైన ముద్రవేశాయి.
రెండేళ్ల తర్వాత ఫ్రాన్స్‌లోని ఇన్‌సీడ్‌లో (బిజినెస్ స్కూల్ ఫర్ వరల్డ్) ఎంబీఏలో చేరా. అక్కడ చండీగఢ్‌కు చెందిన ప్రదీప్ సింగ్‌తో పరిచయమైంది. తను ఫార్మాసూటికల్ రంగం నుంచి వచ్చాడు. ఓ రోజు మా ఇద్దరి మధ్య దేశంలోని అత్యవసర వైద్య సేవల గురించి చర్చ జరిగింది. అప్పుడే... దేశంలో అంబులెన్స్ సేవలను ప్రారంభించాలని నిర్ణయించుకుని.. ఇన్‌సీడ్‌లోని మరో స్నేహితుడు కోస్టారికాకు చెందిన జోసి లియోన్‌తో కలిసి స్టాన్‌ప్లస్‌కు ప్రాణం పోశాం.
స్టార్టప్ ఎక్కడ పెట్టాలని బెంగళూరు, ముంబై, పుణె, హైదరాబాద్ నగరాలను పరిశీలించాం. స్థానిక ప్రభుత్వ ప్రోత్సాహం, వాతావరణం, మార్కెట్ అవకాశాల దృష్ట్యా హైదరాబాద్ కేంద్రం గా రూ.50 లక్షల పెట్టుబడితో 2016 సెప్టెంబర్లో ప్రారంభించాం. అంబులెన్స్‌తో పాటు కాల్ సెం టర్, డ్రైవర్లు, పారా మెడికల్ స్టాఫ్ ఇతరత్రా నిర్వహణ సేవలన్నీ అందించడమే స్టాన్‌ప్లస్ ప్రత్యేకత.
300 వాహన; 8 ఎయిర్ అంబులెన్స్‌లు..
అత్యవసర వైద్య సేవలతో పాటూ, వాహనాన్ని జీపీఆర్‌ఎస్‌తో అనుసంధానించటం వల్ల వాహన వేగం, ట్రాఫిక్ రద్దీ, ఆసుపత్రికి చేరే సమయం ప్రతి ఒక్కటీ ట్రాక్ అవుతుంటుంది. పేషెంట్ మెడికల్ రికార్డులను డిజిటలైజ్ చేసి ఆసుపత్రికి చేరేలోపు సంబంధిత ఆసుపత్రికి చేరవేస్తాం. దీంతో పేషెం ట్‌కు మరింత వేగంగా చికిత్స అందించే వీలుంటుం ది. ప్రస్తుతం స్టాన్‌ప్లస్‌లో 300 అంబులెన్స్‌లున్నాయి.
ఎయిర్ అంబులెన్స్ సేవల కోసం 8 సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. త్వరలో స్టాన్ మూవ్ పేరిట మెడికల్ యుటిలిటీ వెహికిల్ (ఎంయూవీ) సేవలు ప్రారంభిస్తాం. వీటి ప్రత్యేకత ఏంటంటే.. వాహనంలోని సీట్లను పూర్తిగా మారుస్తాం. దీంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన పేషెంట్‌కు సౌకర్యవంతంగా వీల్ చెయిర్‌తో సహా అంబులెన్స్‌లో ఎక్కొచ్చు. 360 డిగ్రీల కోణంలో సీటు తిరుగుతుంది. వచ్చే 3 నెలల్లో బైక్ అంబులెన్స్‌లనూ ప్రారంభిస్తాం.
నెలకు 2 వేల బుకింగ్స్..
ప్రస్తుతం తెలంగాణ మొత్తం, ఏపీలో ఏలూరులో మాత్రమే స్టాన్‌ప్లస్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి నుంచి సన్‌షైన్, శ్రీకర, ఓమ్నీ, నైటింగేల్స్, మల్లారెడ్డి నారాయణ, హిమగిరి, కాల్‌హెల్త్, సిటిజెన్స్ స్పెషాలిటీ, హోలిస్టిక్ వంటి 15 ఆసుపత్రులతో ఒప్పందం చేసుకున్నాం.
నెల రోజుల్లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు పట్టణాలకు విస్తరిస్తాం. ఆయా ప్రాంతాల్లో 20 ఆసుపత్రులతో ఒప్పందమైంది. ప్రతి కిలోమీటర్‌కు రూ.15–30 చార్జీ ఉంటుంది. ప్రస్తుతం నెలకు 2,000 ఆర్డర్లొస్తున్నాయి. నెలనెలా 20 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాం. ఇప్పటివరకు 10 వేల మంది మా సేవలు వినియోగించుకున్నారు.
6 నెలల్లో రూ.65 కోట్ల సమీకరణ..
ప్రస్తుతం 68 మంది ఉద్యోగులున్నారు. జూన్ నాటికి రూ.7 కోట్ల వ్యాపారాన్ని చేరుకోవాలని లకి‡్ష్యంచాం. రెండు నెలలక్రితం కలారీ క్యాపిటల్ నుంచి రూ.8 కోట్ల నిధులను సమీకరించాం. మరో 6 నెలల్లో రూ.65 కోట్ల నిధులు సమీకరిస్తాం. దేశంలోని అతిపెద్ద వీసీ ఫండ్‌తో చర్చలు జరుగుతున్నాయి. మరో 6 నెలల్లో డీల్ క్లోజ్ అవుతుంది’’ అని ప్రదీప్‌సింగ్‌తో కలిసి జోయిర్సన్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment