స్మార్ట్ ఫోన్లను ఎలా వాడుతున్నారో తెలుసా?
ఆధునిక ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉదయం లేవడంతోనే స్మార్ట్ ఫోన్ యూజర్స్ సోషల్ మీడియాలో చాటింగ్, వీడియో కాలింగ్,ఇతర పనులు చేస్తుంటారు. అయితే స్మార్ట్ ఫోన్ యూజర్లకు సంబంధించి నిర్వహించిన ఓ సర్వేలో కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
స్మార్ట్ ఫోన్ వినియోగించేవారు సగటున రోజులకు 2,617 సార్లు ఫోన్ ను టచ్ చేస్తారు. కొంతమంది ఆండ్రాయిడ్ యూజర్లపై అమెరికాలో ఈ సర్వే నిర్వహించారు. అధిక సమయం స్మార్ట్ ఫోన్ వాడేవారు ఏకంగా 5,427 సార్లు స్క్రీన్ మీద స్వైప్ చేయడం చేస్తుంటారని సర్వేలో తేలింది. తక్కువగా యూజ్ చేసేవారు మొబైల్ లో సగటున 76 సార్లు ఏదో ఒక పనిలో నిమగ్నం కాగా, టాప్ టెన్ యూజర్లు సగటున 132 సందర్భాలలో ఒకేరోజులో యాప్స్ వినియోగించడం, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం వంటివి చేస్తుంటారు.
ఉదయం 7 గంటలకు మొబైల్ వాడకం మొదలుపెట్టే యూజర్లు డిన్నర్ సమయంవరకూ అప్పుడప్పుడూ గ్యాప్ ఇచ్చి ఫోన్ కోసం సమయాన్ని వెచ్చిస్తుంటారు. 87 శాతం యూజర్లు అర్ధరాత్రి నుంచి ఉదయం 5 గంటలలోపే కనీసం ఒక్కసారి అయినా ఫోన్ అప్ డేట్స్ చెక్ చేసుకుంటారని సర్వేలో వెల్లడైంది. ఫేస్బుక్ యూజ్ చేసేవారు 15 శాతం ఉండగా, మరో 11 శాతం యూజర్లు ఇతర యాప్స్ ద్వారా ఛాటింగ్ చేస్తుంటారు. మెస్సేజ్ యాప్ ను 26 యూజర్స్ వాడుతుండగా, సోషల్ మీడియాలో యాక్టివ్ గా 22శాతం మంది ఉంటున్నారని సర్వే బృందం వివరించింది.