అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు. మితంగా ఉపయోగిస్తేనే మేలు జరుగుతుంది. అలా కాదని అతిగా అలవాటు పడితే దుఃఖానికే దారితీస్తుందనే విషయం ఇప్పటికే అనేక సందర్భాల్లో రుజువైంది. ఇదే సూత్రం స్మార్ట్‌ఫోన్ ఉపయోగించేవారికి కూడా వర్తిస్తుందట.
వాషింగ్టన్: కొన్న కొత్తలో ఏదైనా బాగానే ఉంటుంది. చివరికి స్మార్ట్ ఫోన్ అయినా సరే..! వాడేకొద్దీ, అందులోని ఫీచర్లను ఉపయోగిస్తున్నకొద్దీ మన సంతోషం కొద్ది కొద్దిగా తగ్గిపోతుంది. అది చివరకు దుఃఖానికి దారితీస్తుంది. ఇదేదో మాటవరసకు అంటున్న విషయం కాదు.. అమెరికాలో లక్షలాది మంది యువతపై అధ్యయనం చేసి, చెబుతున్న విషయం. స్మార్ట్‌ఫోన్ల కారణంగా యువత సంతోషంగా ఉండడం కంటే ఎక్కువగా దుఃఖంగానే ఉంటున్నారట. అమెరికాలోని జార్జియా యూనివర్సిటీ పరిశోధనలో ఈ విషయం తేటతెల్లమైంది.
మిలియన్ మందికి ప్రశ్నలు..
సర్వేలో భాగంగా దాదాపుగా మిలియన్ మంది యువతను కొన్ని ప్రశ్నలు అడిగారట. కంప్యూటర్, ట్యాబ్, స్మార్ట్‌ఫోన్ వంటివి రోజులో ఎంతసేపు వినియోగిస్తున్నారు? సోషల్ మీడియాలో ఎంతసేపు గడపుతున్నారు? వీడియో కాలింగ్, చాటింగ్ వంటివి మిమ్మల్ని సంతోషంగా ఉంచుతున్నాయా? గతంలో సంతోషంగా ఉన్నారా? స్మార్ట్ స్క్రీన్లు వచ్చిన తర్వాత ఆనందంగా ఉన్నారా? వంటి కొన్ని ప్రశ్నలను అడిగి, వారిచ్చిన సమాధానాలను పరిశీలించారట.
మిస్ అవుతున్నాం..
సర్వేలోభాగంగా యువత నుంచి వచ్చిన సమాధానాలను పరిశీలిస్తే.. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్లు వాడుతున్నవారంతా.. తాము గతంలో కంటే సంతోషంగా లేమంటూ చెప్పారట. నాన్‌స్క్రీన్ యాక్టివిటీస్‌తో ఎంతో సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. స్పోర్ట్స్, అవుట్‌డోర్ గేమ్స్, పుస్తకాలు, న్యూస్‌పేపర్లు చదవడం, స్నేహితులతో ప్రత్యక్షంగా మాట్లాడడం వంటివి తమను ఎంతో సంతోషంగా ఉంచేవని చెప్పారట. ఆన్‌స్క్రీన్‌లో మునిగిపోయి చిన్నచిన్న సంతోషాలన్నింటికీ దూరమవుతున్నామని, పిల్లలతో, తల్లిదండ్రులతో, పొరుగువారితో గడపలేకపోతున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment