
పెళ్లికి అర్హతలు మారాయా?
పెళ్లి కొడుకు తరఫు వారంటే భయం మాట దేవుడెరుగు... గుర్తిస్తే చాలు అని అనుకుంటున్నారు. ఇది కాలం చేసిన మాయ.
కొన్ని సీరియస్ విషయాలు జోకులుగా చలామణి చేయడం మనకో అలవాటు. పెళ్లాం వేధింపులపై వేలకు వేల కార్టూన్లు, జోకులు వస్తుంటాయి. రాష్ట్రంలో కాదు, దేశమంతటా వస్తుంటాయి. కానీ, ఆ జోకులు వేసినంత మాత్రాన అవి అప్రాధాన్యం అయిపోవు. అలాగే పెళ్లి కాని వాడంటే సమాజానికే ఓ కమెడియన్. కానీ ఆ ప్రక్రియ ఒక క్షోభ. ఆ క్షోభతో కొందరు ఆడుకుంటారు, దానిని ఇంకొందరు వాడుకుంటారు. మరికొందరు దాన్ని చూసి నవ్వుకుంటారు. చాపకింద నీరులా జరిగిన మరో విషయం ఏంటంటే... ఆ క్షోభ ఇపుడు అమ్మాయిల కొరతతో రెట్టింపయింది. పెళ్లి కాని ప్రసాదులు ముందుకంటే మరింత చులకనైపోయారు. ఈ నేపథ్యంలో పెళ్లికి మారిన అర్హతల గురించే లోకం పట్టించుకోలేదు.
గతంలో...
పెళ్లి కొడుకు తరఫు వారంటే భయపడే ఆ రోజుల్లోనూ అమ్మాయిల తరఫు వారికి కొన్ని విషయంలో పట్టింపులుండేవి. అర్హతల లిస్టుండేది. అబ్బాయి ఆదాయం ఎంత? సర్కారు కొలువు అయితే పై ఆదాయమెంత? అని కూడా అడిగేవారు. అంతకు మించి చదువు చేసే వారు. ఇంజినీరింగ్ జాడే లేకపోయినా ‘బియ్యే’ పాసయ్యాడా? అయితే గొప్ప సంబంధమే అనుకునే వారు. ఇవన్నీ సంబంధం దగ్గరగా వచ్చినపుడు అడిగే ప్రశ్నలు. సంబంధాలు వెతకడంతోనే సంస్కారాన్ని వెతికే వాళ్లు. ఉద్యోగం, చదువుకంటే ఆ సంస్కారానికే మార్కులు ఎక్కువగా పడేవి.
ఇక పెళ్లి ఫిక్స్ చేసుకునే ముందు మాటల్లో పెట్టి సిగరెట్టు, మందు కావాలా బావా అంటూ కాబోయే మరదళ్లు, బావమరుదులు అడిగే వారు.... అయితే, ఇందులో పెళ్లి కొడుకు యమా జాగ్రత్తపడేవాడు అది వేరే విషయం అనుకోండి! మొత్తానికి ఈ ప్రక్రియల ప్రకారం పెళ్లి తంతు పూర్తయ్యేది. ఈ తంతంతా భవిష్యత్తు భద్రత, గౌరవ మర్యాదల కోసం చేసే వారు. అందులో ఏం తప్పులేదు.
ఇపుడు...
పెళ్లి కొడుకు తరఫు వారంటే భయం మాట దేవుడెరుగు... గుర్తిస్తే చాలు అని అనుకుంటున్నారు. ఇది కాలం చేసిన మాయ. దీని గురించి పెద్ద బెంగ లేదు కానీ నిగూఢంగా తెరపైకి వచ్చిన వేరే విషయాలే భయపెడుతున్నాయి. పెళ్లి కూతురు తరఫు వారు కాదు పెళ్లి కూతురే ఇంటర్వ్యూ చేస్తోంది. ఉద్యోగం అడగడం కాదు, ఉన్నతోద్యోగం అడుగుతోంది. నెలకు లకారం దాటితేనే గౌరవ మర్యాదలు. అది కూడా తను పనిచేసే ఊర్లో అయితే బెటరట. దీన్ని కూడా కొట్టిపారేయొచ్చు. కానీ, పిల్లాడికి మందు అలవాటుందా? సిగరెట్ అలవాటుందా? అని అడిగేవారే లేరు. ఎంత పెద్ద ఉద్యోగం చేసినా ఆస్తి ఎంత? అని అడుగుతున్నారు.
ఇక్కడే వరుడు, అతని తరఫువారు జావగారి పోతున్నారు. ఇంటి వద్ద ఏం లేకపోయినా కసితో కష్టంతో పెద్ద ఉద్యోగంలో చేరినా ఆస్తి సంగతే ప్రాధాన్యం అయిపోయింది. అంతేనా... మరో రెండు ఊహించని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అక్కాచెల్లెలు ఉన్నారా? ఉంటే... విల్ కాల్ యు లేటర్ అంటున్నారు. చివరగా అమ్మానాన్నతో కలిసి ఉంటున్నారా అని నేరుగా అడగకపోయినా ఆరా తీసి...తీసి పారేస్తున్నారు... ప్రైవసీ ఇంపార్టెంట్ కదండీ ఈరోజుల్లో!
వస్తు డిమాండ్... సరఫరా మధ్య తేడా వల్ల ఈ సమస్యలన్నీ అనుకుని ఆర్థిక శాస్త్రంలోకి వెళ్తారేమో కానే కాదు. పెళ్లి ఇరవై ఏళ్లకే చేసుకోవాల్సిన అవసరం, అగత్యం, ఒత్తిడి లేవు కాబట్టి వీలైనన్ని ఇంటర్వ్యూలు చేస్తున్నారు. అనుకున్నది జరిగితే లక్కే కదా. కాబట్టి అసలు విషయం చెప్పొచ్చేదేంటంటే ‘అమ్మాయిల కొరత’ అనేది భ్రమ. మారిన అర్హతలే అబ్బాయిలకు త్వరగా పెళ్లి కాకపోవడానికి కారణమన్నది నిజం. ఇప్పటికైనా నిజం తెలుసుకుని మేలుకుంటే బెటరేమో!