‘జాతీయ స్థాయి’కి సాత్విక్
‘జాతీయ స్థాయి’కి సాత్విక్
Published Mon, Aug 29 2016 8:32 PM | Last Updated on Fri, Jul 26 2019 4:10 PM
మద్దిరాల (చిలకలూరిపేట రూరల్): తుపాకులతో టెర్రరిస్టులను మాత్రమే చంపవచ్చు, విలువలతో కూడిన విద్యతో టెర్రరిజాన్ని రూపుమాపవచ్చు. నేటి విద్యావిధానంలో విలువలకు తక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులు కూడా టెర్రరిస్టులుగా మారుతున్నారు. మహాత్మాగాంధీ స్వాతంత్య్రం కోసం అహింసా విధానాన్ని పాటించారు. పెన్ను, పుస్తకం, ఉపాధ్యాయుడితో కలిసి టెర్రరిజాన్ని రూపుమాపవచ్చని ఇటీవల నోబుల్ బహుమతి పొందిన మలాలా యూసఫ్ జాయ్ ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని కేంద్రీయ విద్యాలయమైన జవహర్ నవోదయకు చెందిన విద్యార్థి సాత్విక్ ప్రదర్శించిన ఎగ్జిబిషన్ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో జరిగిన క్లస్టర్ పోటీల్లో విజేతగా, ఆంధ్ర, కేరళ, కర్ణాటక, తెలంగాణ, పాండిచ్చేరి ఐదు రాష్ట్రాల విద్యార్థులకు రీజనల్ స్థాయిలో సైతం విజేతగా నిలిచాడు. త్వరలో జాతీయస్థాయిలో నిర్వహించే పోటీలకు ఎంపికయ్యాడు.మండలంలోని మద్దిరాల గ్రామంలో నవోదయ పాఠశాలలో సీహెచ్ సాత్విక్ పదోతరగతి విద్యను అభ్యసిస్తున్నాడు. ఈనెల 18, 19వ తేదీలలో శ్రీకాకుళంలో జరిగిన క్లష్టర్ పోటీల్లో, 23,24 తేదీలలో తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో నిర్వహించిన రీజనల్ పోటీల్లో పాల్గొన్నాడు. రెండు పోటీలను సోషల్ సైన్స్ విభాగంలో అధ్యాపకుడు బ్రహ్మానందరెడ్డి సూచనలు, సలహాలతో ఎగ్జిబిషన్‌ను ప్రదర్శించి ప్రతిభను కనబరచాడు.
వ్యవసాయ కూలీ కుటుంబంలో మెరిసిన విద్యార్థి..
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఆరవ తరగతి ప్రవేశానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణుడై 2012–13 విద్యా సంవత్సరంలో జిల్లాలోని పెదకాకాని మండలం తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన అనుదీప్– శాంతి దంపతుల కుమారుడు సీహెచ్ సాత్విక్ ప్రవేశం పొందాడు. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి సాత్విక్‌ను ప్రిన్సిపాల్ ఎన్వీడీ విజయకుమారి జ్ఞాపిక, సర్టిఫికెట్‌లను అందించారు. డిప్యూటీ ప్రిన్సిపాల్ రాఘవయ్య, అధ్యాపకుడు బ్రహ్మానందరెడ్డి, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.
Advertisement
Advertisement