సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో దూర విద్యా కేంద్రాలు విద్యార్థులతో చెలగాటమాడుతున్నాయి. ఇతర రాష్ట్ర యూనివర్సిటీల స్టడీ సెంటర్లు నిర్వహించడానికి వీల్లేదని తెలిసినా, వాటిలో చదివే విద్యార్థులకు ఇచ్చే సర్టిఫికెట్లు రాష్ట్రంలో చెల్లకున్నా.. తమ కమీషన్ల కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. రాష్ట్ర యూనివర్సిటీల గుర్తింపుతో ఇక్కడ కొనసాగుతున్న కాలేజీలు కూడా ఈజీ మనీ కోసం అక్రమాల బాట పట్టాయి. ఇతర రాష్ట్రాల యూనివర్సిటీలు ఇచ్చే భారీ కమీషన్ల కోసం తమ కాలేజీల్లో దూర విద్యా కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థులను మోసం చేస్తున్నాయి.
ఇలాంటి స్టడీ సెంటర్లు ఒకటీ రెండూ కాదు వందల్లో ఉన్నాయి. ఒక్క నాగార్జున యూనివర్సిటీకి చెందిన స్టడీ సెంటర్లే రాష్ట్రంలో 100కు పైగా ఉన్నాయి. శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ స్టడీ సెంటర్లు 20కి పైగా ఉండగా, ద్రవిడ యూనివర్సిటీ స్టడీ సెంటర్లు 40 వరకు ఉన్నాయి. పాండిచ్చేరి యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మద్రాసు, అన్నామలై యూనివర్సిటీ, సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ, వినాయక విద్యా మిషన్, మధురై కామరాజ్ తదితర యూనివర్సిటీలు కుప్పలుతెప్పలుగా తెలంగాణలో తమ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేశాయి. ఇంత జరుగుతున్నా ఉన్నత విద్యా మండలి కానీ, యూనివర్సిటీలు కానీ నోరు మెదపడం లేదు. తెలంగాణలోని స్టడీ సెంటర్లలో చదివే విద్యార్థుల సర్టిఫికెట్లు చెల్లుబాటు అవుతాయని పేర్కొంటూ ఆయా యూనివర్సిటీలు విద్యార్థుల నుంచి రూ.కోట్లు దండుకుంటున్నా ఉన్నత విద్యా మండలికి చలనం లేకుండా పోయింది.
రెగ్యులర్‌గా చదువుకునే స్తోమత లేక..
రాష్ట్రంలో రెగ్యులర్‌గా కాలేజీలకు వెళ్లి చదువుకునే స్తోమత లేనివారే దూర విద్యా కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో నిజానిజాలు తెలియక దారుణంగా నష్టపోతున్నారు. ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల స్టడీ సెంటర్లను రాష్ట్రంలో నిర్వహించడానికి వీల్లేదన్న విషయం ఉన్నత విద్యా మండలికి తెలుసు. అయినా వాటిని నిర్వహిస్తున్న కాలేజీలకు ఎలాంటి నోటీసులు, ఆదేశాలు జారీ చేసిన దాఖలాలు లేవు. స్టడీ సెంటర్ల నుంచి యూనివర్సిటీల అధికారులు ముడుపులు పుచ్చుకొని ఈ విషయంలో మిన్నకుండిపోతున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఓ విద్యార్థి వేరే రాష్ట్ర యూనివర్సిటీకి చెందిన దూర విద్యా కేంద్రంలో (తెలంగాణలోని) చదివిన సర్టిఫికెట్‌ను పెడితే దాన్ని తిరస్కరిస్తున్న ఉన్నత విద్యా మండలి.. సంబంధిత నిబంధనలపై కనీస ప్రచారం చేయడం లేదు. ఉద్యోగాల్లో అలాంటి సర్టిఫికెట్లను అనుమతించవద్దని చెబుతోందే తప్ప.. ఇతర రాష్ట్ర యూనివర్సిటీల స్టడీ సెంటర్లలో చదవవద్దన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదు. దీంతో లక్షల మంది విద్యార్థులు నష్టపోతున్నారు. ఆ సర్టిఫికెట్లను తెలంగాణలో చెల్లనివిగా పరిగణిస్తారన్న విషయం తెలియక విద్యార్థులు వాటిల్లో చేరుతూనే ఉన్నారు.
బయటకు వచ్చినవి కొన్నే..
ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జున యూనివర్సిటీకి చెందిన దూర విద్యా కేంద్రాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రం ద్వారా డిగ్రీ పూర్తి చేసిన ఓ విద్యార్థి.. గతేడాది టీఎస్ ఐసెట్ రాసి మేనేజ్‌మెంట్ కోటాలో ఘట్‌కేసర్‌లోని ఓ కాలేజీలో ఎంబీఏలో చేరాడు. ఆ కాలేజీకి సంబంధించిన మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాల ర్యాటిఫికేషన్‌కు అతని సర్టిఫికెట్లు ఉన్నత విద్యా మండలికి వెళ్లాయి. వాటిని పరిశీలించిన అధికారులు ఆ విద్యార్థి సర్టిఫికెట్ చెల్లదంటూ ప్రవేశాన్ని తిరస్కరించారు. అలాగే భువనగిరి ప్రాంతంలో ఓ కాలేజీలో గీతమ్ విద్యా సంస్థ పేరుతో ఏర్పాటు చేసిన స్టడీ సెంటర్‌లో మరో విద్యార్థి డిగ్రీ చదివాడు. అతను మేనేజ్‌మెంట్ కోటాలో ఎంబీఏలో చేరగా.. సర్టిఫికెట్లను పరిశీలించిన ఉన్నత విద్యా మండలి అతని ప్రవేశాన్ని తిరస్కరించింది. సిక్కిం మణిపాల్ యూనివర్సిటీకి చెందిన హైదరాబాద్‌లోని దూర విద్యా కేంద్రంలో మరో విద్యార్థి డిగ్రీ పూర్తి చేసి.. లాసెట్ రాసి న్యాయ విద్య కోర్సులో చేరాడు. అతని ప్రవేశాన్ని కూడా అధికారులు తిరస్కరించారు. ఇలా వందల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు తిరస్కరణకు గురవుతున్నాయి. ఉద్యోగాల్లోనూ అలాంటి సర్టిఫికెట్లను ఉన్నత విద్యా మండలి తిరస్కస్తోంది.
అనుమతి లేకున్నా..
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దూర విద్యా కేంద్రాల టెరిటోరియల్ జూరిస్‌డిక్షన్–2013 నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రంలోని యూనివర్సిటీ లేదా డీమ్డ్ యూనివర్సిటీ లేదా ప్రైవేటు యూనివర్సిటీ ఇతర రాష్ట్రాల్లో స్టడీ సెంటర్లను పెట్టడానికి వీల్లేదు. వాటి ద్వారా కోర్సులను నిర్వహించడానికి వీల్లేదు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్లకు 2013 ఆగస్టు 23న యూజీసీ పాలన డైరెక్టర్ విక్రమ్ సాహే లేఖ (ఎఫ్.ఎన్‌ఓ.డీఈబీ/క్యూఎంసీ/2013) రాశారు. దాంతోపాటు నిబంధనల కాపీని జత చేసి పంపించారు. అవే నిబంధనలను తాము అమలు చేస్తున్నామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చెబుతోంది. కానీ తెలంగాణలో స్టడీ సెంటర్ల పెట్టవద్దని ఇతర రాష్ట్రాల యూనివర్సిటీలకు ఓ లేఖ రాయాలన్న ఆలోచన మాత్రం చేయడం లేదు. కనీసం తమ ఆధీనంలోని కాలేజీల్లోనైనా ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల స్టడీ సెంటర్లు పెట్టకుండా కట్టడీ చేయడం లేదు. ఇవేవీ చేయకున్నా అలాంటి స్టడీ సెంటర్లలో చేరవద్దని విద్యార్థుల్లో అవగాహన కూడా కల్పించడం లేదు.
మా సర్టిఫికెట్లు చెల్లుతాయి: నాగార్జున యూనివర్సిటీ
తెలంగాణలోని తమ స్టడీ సెంటర్లలో చదువుకొని పరీక్షలు రాసిన విద్యార్థుల సర్టిఫికెట్లు చెల్లుబాటు అవుతాయని నాగార్జున యూనివర్సిటీ అధికారులు స్టడీ సెంటర్ల నిర్వాహకులకు చెబుతున్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పదేళ్ల వరకు ఉమ్మడి విద్యా అవకాశాల విధానం అమల్లో ఉన్నందున తమ స్టడీ సెంటర్లు కూడా చెల్లుబాటు అవుతాయని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయా యూనివర్సిటీల సర్టిఫికెట్లను తిరస్కరిస్తున్న ఉన్నత విద్యా మండలి కనీసం ఆ రాష్ట్ర ఉన్నత విద్యా మండలితోనైనా ఈ విషయంపై చర్చించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment