సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: రోజూ కళాశాలకు వె ళ్లి విద్యను అభ్యసించలేని ఔత్సాహిక విద్యార్థుల కోసం దూరవిద్యను ముగింట్లోకే తీసుకువచ్చే ప్రయత్నానికి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (సీడీఈ) శ్రీకారం చుట్టింది. జిల్లాలో అడ్మిషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులను, గృహిణులను, ఉద్యోగులను ఉన్నత విద్యాధికులుగా తీర్చిదిద్దేందుకు వినూత్న ప్రక్రియను చేపట్టింది. హైదరాబాద్‌తో అనుసంధానాన్ని తగ్గిస్తూ స్థానికంగా అడ్మిషన్ కేంద్రాల ద్వారా విద్యను అందించి వ్యయప్రయాసలను తగ్గించడమే లక్ష్యంగా సీడీఈ ప్రణాళిక రూపొందించింది. అం దులో భాగంగానే జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి కేంద్రాల్లో అడ్మిషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలోనే నిర్వహించేలా దూరవిద్య అధికారులు భవిష్యత్ ప్రణాళికను రూపొందించారు. అందుకు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్టడీ సెంటర్‌ను సంస్కరిస్తూ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ విధానంతో జిల్లాలోని వేలాది మందికి ప్రయోజనం చేకూరనుంది.
సిద్దిపేటలోనే అడ్మిషన్ కేంద్రం
డిగ్రీ, పీజీ లాంటి కోర్సులను రెగ్యులర్‌గా చదువుకోలేని ఔత్సహికుల కోసం ఉస్మానియా యూనివర్సిటీ అనుసంధానంగా ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లు దూరవిద్యను అందిస్తున్నాయి. అందులో భాగంగానే మెదక్ జిల్లా వాసుల కోసం సీడీఈ 2001లో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒకే ఒక స్టడీ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ కేంద్రం ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు దూరవిద్యలో డిగ్రీ, పీజీతో పాటు డిప్లొమా కోర్సులను అభ్యసిస్తున్నారు. కేవలం స్టడీ కేంద్రంగానే ఉన్న సిద్దిపేట సీడీఈతో జిల్లా విద్యార్థులకు దూరవిద్య సేవలను ఆశించిన స్థాయిలో అందడం లేదన్న వాదనలున్నాయి. మరోవైపు దూరవిద్య విధానంలోని నిబంధనల మేరకు కోర్సులు పూర్తయ్యే వరకు ప్రక్రియ అంత హైదరాద్‌లోని సీడీఈ ప్రధాన కేంద్రంతోనే కొనసాగుతుంది.
ఇది జిల్లా విద్యార్థులకు, గృహిణులకు ఇబ్బందిగా మారుతోంది. దీంతో రె గ్యులర్ విద్యకు దీటుగా దూరవిద్యను క్షేత్ర స్థాయిలో విస్తృత పరిచి, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులను ముఖ్యంగా బాలికలు, మహిళలు, నిరుద్యోగ యువతకు ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో ఈ ఏడు సీడీఈ అధికారులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కేవలం స్టడీ సెంటర్‌గా ఉన్న సిద్దిపేటలో తొలిసారిగా అడ్మిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి దూరవిద్య సేవలను విద్యార్థుల ముంగిట్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలకు అధికారులు శ్రీకారం చుట్టారు. అందుకు అనుగుణంగానే సిద్దిపేటతో పాటు మెదక్, సంగారెడ్డిలో అడ్మిషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి దరఖాస్తు విక్రయాలు, ఫీజుల వసూలు, స్టడీ మెటీరియల్ సరఫరా, తరగతి గదుల నిర్వహణ, హాల్ టికెట్ల జారీ, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పరీక్ష కేంద్రాలను స్థానికంగానే నిర్వహించేందుకు సీడీఈ భవిష్యత్ ప్రణాళిక రూపొందించింది. ఈ విధానం అమలైతే జిల్లాలోని వేలాది మంది విద్యార్థులు బీఏ, బీకాంతో పాటు ఎంఏ, ఎంకాం, ఎంబీఏ, ఎంసీఏ లాంటి ఫ్రొఫెషనల్ కోర్సులను పీజీ డిప్లొమా కోర్సులను ఇంటి వద్ద ఉంటూ స్థానికంగా ఉన్న కేంద్రాల ద్వారా దూరవిద్యను అభ్యసించవచ్చు. ఈ విద్య సంవత్సరానికి గాను డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు డిప్లొమా కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 31వ తేదీ చివరి గడువుగా అధికారులు నిర్ణయించారు.
జిల్లా ప్రజలకు వరం
సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రస్తుతం సిద్దిపేటలో ఒకే ఒక స్టడీ సెంటర్ ఉంది. దూరవిద్య సంస్కరణల్లో భాగంగా జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డిలో పూర్తి స్థాయి అడ్మిషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. ఈ విధానం ద్వారా విద్యార్థులకు, గృహిణులకు వ్యయప్రయాస తగ్గుతుంది.
- వెంకటేశ్వర్లు ( డెరైక్టర్, సీడీఈ)
ముంగిట్లోకి దూరవిద్య
Published Thu, Jan 9 2014 2:39 AM | Last Updated on Fri, Jul 26 2019 4:10 PM
Advertisement
Advertisement