వీళ్లు జనం నాడి పట్టేస్తారు! | sakshi starup | Sakshi
Sakshi News home page

వీళ్లు జనం నాడి పట్టేస్తారు!

Published Sat, May 9 2015 1:56 AM | Last Updated on Fri, Jul 26 2019 4:10 PM

వీళ్లు జనం నాడి పట్టేస్తారు! - Sakshi

వీళ్లు జనం నాడి పట్టేస్తారు!

సర్వేలకు టెక్నాలజీని జోడించిన స్టడీ ఎన్ సర్వే, క్యూథియరీ స్టార్టప్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సర్వే అనగానే తెల్ల కాగితాలో, పుస్తకాలో చేత పట్టుకొని.. ఇంటింటికీ తిరిగి చెప్పిన వాటిని రాసుకోవడమేనని అనుకుంటాం. కానీ పరిస్థితులు మారుతున్నాయి. కొత్తగా కంపెనీ పెట్టాలన్నా.. కొత్త ఉత్పత్తుల్ని ప్రారంభించాలన్నా.. అంతెందుకు తమ కంపెనీ ప్రొడక్ట్స్ గురించి జనాలేమనుకుంటున్నారో తెలుసుకోవాలన్నా.. అన్నింటికీ సర్వేనే గతి. అందుకే దీన్ని తెల్లకాగితాలకే పరిమితం చేయకుండా టెక్నాలజీని జోడించాయి హైదరాబాదీ కంపెనీలు స్టడీ ఎన్ సర్వే, క్యూథియరీ బ్రోస్. ఆ వివరాలే ఇవి....
 
సర్వేతోనే సరిపెట్టం...
కొత్త కంపెనీ పెట్టే ముందు అది ఎక్కడ పెడితే సక్సెస్ అవుతుంది? మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన ప్రొడక్ట్ ప్రజలకు చేరువ కావాలంటే ఏం చేయాలి? వంటి మార్కెట్ స్థితిగతుల్ని సర్వే చేయడమే ‘క్యూథియరీ బ్రోస్’ పని. అడ్వర్టయిజింగ్, పొలిటికల్, సోషియో ఎకనమిక్, ప్రొడక్ట్స్, మార్కెట్ విభాగాల్లో ఖఖీజిౌ్ఛటడఛటట.ఛిౌఝ సర్వే చేస్తుంది.. అని చెప్పారు కంపెనీ ఫౌండర్ రవిశంకర్ బొజ్జంకి. ‘సర్వేతోనే మా పని అయిపోదు.

మా కస్టమర్ల వ్యాపారాలు మార్కెట్‌లో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి? వారి ఉత్పత్తుల్లో వినియోగదారులు కోరుతున్న మార్పులేంటి? పోటీదారులు ఎలాంటి ఆఫర్లు, ప్రొడక్ట్‌లను విడుదల చేస్తున్నారు? నకిలీల ప్రభావం? వంటి అన్ని కోణాల్లో సూచనలనూ ఇస్తాం. ప్రస్తుతం తయారీ రంగ కంపెనీలకు సంబంధించిన సర్వేలను.. అది కూడా ఇంటర్వ్యూ విధానంలో చేస్తున్నాం. త్వరలోనే ఇతర విభాగాలకూ విస్తరిస్తాం’ అని వివరించారాయన.

సర్వే స్థాయిని బట్టి ధర రూ.25 వేల నుంచి లక్షన్నర వరకు ఉంటుంది. హైదరాబాద్, వరంగల్, రాజమండ్రి, కర్నూల్, విజయవాడ, విశాఖపట్నం, అనంతపురంలలో పలు ప్రాజెక్ట్‌లను సంస్థ పూర్తి చేసింది. 2014 ఎలక్షన్స్ ఫలితాలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్‌కు కూడా సర్వేలు చేసిచ్చామని రవిశంకర్ చెప్పారు.

త్వరలోనే యాప్ ద్వారా సర్వే..
సర్వేల్లోనూ మార్పులు తేవటానికే రూ.5 లక్షల పెట్టుబడితో 2014 డిసెంబర్‌లో ‘స్టడీ ఎన్ సర్వే’ను స్థాపించామన్నారు సంస్థ సీఈఓ రాహుల్.  ఈ సంస్థ ప్రత్యేకత ఏంటంటే.. ట్యాబ్లెట్స్ ద్వారా సర్వే చేస్తుంది. వాటి తాలుకా రిపోర్ట్‌లు విభాగాల వారీగా మేనేజ్‌మెంట్‌కు ఒక్క క్లిక్‌తో వెళ్లిపోతాయి. ‘‘ఇప్పటివరకు హైదరాబాద్‌లో ప్రసాద్ ఐమ్యాక్స్, రాయల్ రీఫ్ హోటల్, వీఎల్‌సీసీ సంస్థలకు సర్వే చేసిచ్చాం. సర్వే స్థాయిని బట్టి నెలకు రూ.3-10 వేల వరకూ ధరలుంటాయి.

విద్యా సంస్థలకు ఉచితంగానే సేవలందిస్తున్నాం. ‘‘మణిపాల్‌లోని టాంపీ, చెన్నైలోని గ్రేట్‌లెగ్స్ వంటి సుమారు 15 విద్యా సంస్థలకు సర్వే చేసిచ్చాం. తొలిసారిగా నిధుల సమీకరణపై దృష్టి పెట్టాం. ముంబైకి చెందిన ఓ టెక్నాలజీ కంపెనీ రూ.60 లక్షల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. వచ్చిన పెట్టుబడులతో త్వరలోనే యాప్ ద్వారానే సర్వే చేసే విధానాన్ని తీసుకొస్తాం. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల్లో సేవలు అందుబాటులో ఉండగా.. ఫండింగ్ అనంతరం ఇతర నగరాలకూ విస్తరిస్తాం’’ అని వివరించారు రాహుల్..

అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement