స్టాక్ మార్కెట్లను నియంత్రించే సెబీ (సెక్యూరిటీస్ ఎక్స్చేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా) ఆమధ్య కొన్ని చర్యలు తీసుకుంది. అవి నవంబర్ 20 నుంచి అమల్లోకి వచ్చాయి కూడా. కొన్ని ఇండెక్స్‌లలో వారాంతపు ట్రేడింగ్‌లు నిలిపివేయడం, లాట్ సైజులను పెంచడం వీటిలో ప్రధానమైనది. ఇలా చేయడం ద్వారా రిటైల్ ట్రేడర్లు భారీ స్థాయిలో నష్టపోకుండా చూడవచ్చన్నది సెబీ ఉద్దేశం. నిజంగా సెబీ లక్ష్యం నెరవేరిందా / నెరవేరుతుందా.. అంటే ఎన్నో ప్రశ్నలు. ఆ చర్యలను ఒకసారి విశ్లేషిస్తే...
గత నవంబర్ దాకా మిడ్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీ, నిఫ్టీ, సెన్సెక్స్‌లలో వారాంతపు కాంట్రాక్టులు ఉండేవి. ప్రతి వారం.. సోమవారం మిడ్ నిఫ్టీ, మంగళ వారం ఫిన్ నిఫ్టీ, బుధవారం బ్యాంకు నిఫ్టీ, గురువారం నిఫ్టీ, శుక్రవారం సెన్సెక్స్ ఎక్సపైరీలు జరిగేవి. తదనుగుణంగా ట్రేడర్లు పొజిషన్స్ తీసుకుని ట్రేడ్ చేసుకునేవారు. ఇప్పుడు కేవలం నిఫ్టీ, సెన్సెక్స్‌లలో మాత్రమే వారాంతపు కాంట్రాక్టులు అమలు చేస్తున్నారు.
మిడ్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీలలో ట్రేడ్ చేయాలి అనుకునేవారు.. తప్పనిసరిగా నెలవారీ కాంట్రాక్టులు మాత్రమే తీసుకోవాల్సి వస్తోంది. పైన పేర్కొన్న అయిదు సూచీల్లో మీకు నచ్చిన ఏదో ఒక సూచీని వారాంతపు ఎక్సపైరీ సూచీలుగా కొనసాగించుకోవచ్చని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీలకు సెబీ సూచించింది. ఈ రెండు ఎక్స్చేంజీలు సహజంగానే వాటి ప్రామాణిక సూచీలైన నిఫ్టీ, సెన్సెక్స్‌లలో వారాంతపు కాంట్రాక్టులు నిర్వహిస్తామని సెబీకి చెప్పాయి. దీంతో నిఫ్టీ, సెన్సెక్స్‌లలో మాత్రమే ఇప్పుడు వారాంతపు కాంట్రాక్టులు నడుస్తూండగా.. మిగిలిన మూడూ నెలవారీ కాంట్రాక్టులుగా కొనసాగుతున్నాయి. అలాగే మిడ్ నిఫ్టీ లాట్ సైజు ఇప్పటిదాకా 50 ఉంటే.. ఫిబ్రవరి నుంచి 120కి పెరిగింది. ఫిన్ నిఫ్టీ లాట్ సైజు 25 నుంచి 65కి, బ్యాంకు నిఫ్టీ 15 నుంచి 30కి, నిఫ్టీ 25 నుంచి 75కి, సెన్సెక్స్ 10 నుంచి 20కి పెరిగాయి.
వారాంతపు కాంట్రాక్టులు ఇప్పటికే నెలవారీ కాంట్రాక్టులుగా మారిపోగా.. లాట్ సైజుల్లో మార్పులు త్వరలోనే అమల్లోకి రానున్నాయి. ఇంతవరకూ బాగానే ఉంది. అన్ని అలవాట్లకు లోనైన వ్యక్తి తొందరగా వాటిని ఎలా మానుకోలేడో.. ట్రేడింగ్ కూడా అలాంటిదే. పైగా ఇది ఆర్ధిక పరమైన అంశం. స్టాక్ మార్కెట్లో ఉండే బలహీనత ఏమిటంటే.. పోగొట్టుకున్న వ్యక్తి అంతటితో ఊరుకోడు. ఎలాగైనా ఆ పోగొట్టుకున్నది రాబట్టుకోవాలన్న తాపత్రయంతో ఇంకా ఇంకా డబ్బులు తెచ్చి ట్రేడింగ్‌లో పెడుతూనే ఉంటాడు. వీక్లీ కాంట్రాక్టులు తీసేయడం వల్ల వారం వారం డబ్బులు పోగొట్టుకునే ట్రేడర్లు తగ్గిపోతారని.. తద్వారా సగటు ట్రేడర్లను కాపాడినట్లు అవుతుందన్నది సెబీ సదుద్దేశం. కానీ అలా జరిగిందా..??
సగటు ట్రేడర్.. ట్రేడింగ్ ఆపేయలేదు. నెలవారీ కాంట్రాక్టులు కొనడం మొదలుపెట్టాడు. ఇవి రేటు ఎక్కువ ఉంటాయి. పైగా లాట్ సైజు పెరిగింది కూడా.. దీనికి ఒక ఉదాహరణ పరిశీలిద్దాం..
బ్యాంకు నిఫ్టీ లాట్ ప్రస్తుతం15 షేర్స్. ఈ సూచీ 51000 దగ్గర ఉంది అనుకుందాం. దాని కాల్ ప్రీమియం రూ. 200 ఉంది అనుకుంటే రూ. 3,000 చేతిలో ఉంటే చాలు. 1 లాట్ వస్తుంది. ఇప్పుడు మంత్లీ కాంట్రాక్టు మాత్రమే కొనాలి. మంత్లీ కాంట్రాక్ట్స్ రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇదే 51000 కాల్ మంత్లీలో రూ. 1000 దరిదాపుల్లో ఉంది. కనీసం ఒక లాట్ కొనాలంటే రూ. 15,000 కావాలి. అదే ఫిబ్రవరి నుంచి అయితే లాట్ సైజు 30కి పెరుగుతుంది. అప్పుడు 30,000 అవసరమవుతాయి. దీంతో అంత పెట్టుబడి పెట్టలేక చాలామంది రిటైల్ ట్రేడర్లు మార్కెట్‌కి దూరమవుతారని, తద్వారా ఇలాంటి చిన్న ట్రేడర్లను నష్టాల నుంచి కాపాడవచ్చు అన్నది సెబీ ఉద్దేశం.
ఇది జరగొచ్చు.. జరక్కపోవచ్చు కూడా.. అదెలాగంటే...
1. అంత డబ్బులు పెట్టలేని వ్యక్తి ట్రేడింగ్‌కు దూరమవుతాడు. సెబీ కోరుకున్నది ఇదే.
2. ట్రేడింగ్‌కు అలవాటు పడ్డ వ్యక్తి, డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి అంత తొందరగా ట్రేడింగ్ మానేయడు. అప్పు చేసో, పొదుపు మొత్తాలు ఖాళీ చేసో.. మరిన్ని డబ్బులు తెచ్చి పెడతాడు. ఇది సెబీ ఉద్దేశాన్ని నెరవేర్చకపోగా రిటైల్ ట్రేడర్లను మరిన్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది.
కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఫిన్ నిఫ్టీ, మిడ్ నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీల్లో వారాంతపు కాంట్రాక్టుల్లో ట్రేడ్ చేసే వ్యక్తులు ఇప్పుడు మంత్లీ వైపు మళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత డిసెంబర్లో (అంతక్రితం 11 నెలలతో పోలిస్తే) బ్యాంకు నిఫ్టీ మంత్లీ కాంట్రాక్టుల్లో రోజువారీ ప్రీమియం టర్నోవర్ 377 శాతం పెరిగి రూ.12,200 కోట్లుగా నమోదైంది. అదే మిడ్ నిఫ్టీలో 819 శాతం పెరిగి 512 కోట్లకు చేరగా, ఫిన్ నిఫ్టీ లో 575 శాతం పెరిగి రూ. 398 కోట్లకు చేరింది.
దీన్నిబట్టి చూస్తే ట్రేడర్లు ఎక్కడా తగ్గడం లేదని తెలుస్తోంది. వ్యాపార పరిమాణం మందగించవచ్చేమో కానీ వ్యాపారం మాత్రం తగ్గట్లేదు. దీనివల్ల పోగొట్టుకునే వ్యక్తులు మరింత పోగొట్టుకోవడానికి, లబ్ది పొందేవాళ్ళు మరింత ప్రయోజనం పొందడానికి తలుపులు తెరిచినట్లే అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. పోగొట్టుకునేది చిన్న ట్రేడర్లే కానీ.. ప్రయోజనం పొందేది మాత్రం భారీ స్థాయిలో లావాదేవీలు నిర్వహించే విదేశీ మదుపర్లు, హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్సే.
సెబీ నిర్ణయాలు అమల్లోకి వచ్చి ఇంచుమించు రెండు నెలలే కావస్తోంది. కాబట్టి మరికొన్ని నెలల పరిశీలన తర్వాత సెబీ తన నిర్ణయాలను ఏవైనా మార్చుకుంటుందా.. కొత్త పద్ధతినే కొనసాగిస్తుందా.. ఏవైనా మార్పులు చేస్తుందా.. ఇవన్నీ వేచి చూడాల్సిన ప్రశ్నలే.
-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment