ఇలా చేస్తే.. స్టాక్ మార్కెట్లో మీరే 'రాజా ది గ్రేట్' | How to Get More Profits in The Stock Market Check The Experts Tips | Sakshi
Sakshi News home page

ఇలా చేస్తే.. స్టాక్ మార్కెట్లో మీరే 'రాజా ది గ్రేట్'

Published Sat, Dec 7 2024 9:37 PM | Last Updated on Sat, Jan 25 2025 4:34 PM

How to Get More Profits in The Stock Market Check The Experts Tips

నిజంగానే ఇలా డబ్బులు సంపాదించేయొచ్చా..?

లక్షలకు లక్షలు వెనకేసుకోవచ్చా..?

మార్కెట్లో అంత పొటెన్షియాలిటీ ఉందా..?

వీటన్నిటికీ సమాధానాలు వెతుకుదాం..

వీటి గురించి లోతుపాతుల్లోకి వెళ్లేముందు డీమ్యాట్ ఖాతాల గురించి తెలుసుకోవాలి. కోవిడ్‌కు ముందు వరకూ.. అంటే 2020 మార్చి వరకు దేశంలో దాదాపు 4 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉంటే.. కేవలం నాలుగున్నరేళ్ల వ్యవధిలో అవి 17 కోట్లు దాటేశాయి. సుమారు నాలుగు రెట్లు పెరిగాయన్న మాట.

ఇలా ఖాతాలు తెరిచినవాళ్లు ఊరకనే ఉంటారా.. ఉండరు కదా.. కొంత డబ్బులు పట్టుకెళ్లి డీమ్యాట్ ఖాతాకు మళ్లించడం.. ఆ తరువాత ట్రేడ్ చేయడం మొదలెట్టారు. వీళ్లల్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు తక్కువే.. 100 కి 95 మంది తమ కష్టార్జితాన్ని ట్రేడింగ్ వైపే మళ్లిస్తున్నారు. దీనికి కారణం చాలా తక్కువ టైంలోనే ఎక్కువ సంపాదించేయవచ్చన్న అత్యాశ.

సంపాదించొచ్చు.. తప్పు లేదు. మనం డిగ్రీ దాకా వచ్చామంటే ముందు అ, ఆ లు నేర్చుకుని, ఆ తర్వాత ఒక్కో తరగతి పాస్ అవుతూ వచ్చాం కదా.. మరి ఇదే సూత్రం మార్కెట్‌కి కూడా వర్తిస్తుందన్న ప్రాథమిక సూత్రాన్ని మరిచిపోయి.. చేతిలో డబ్బులున్నాయి కదా అని, ఒకేసారి భారీగా సంపాదించేయాలని ఉబలాటపడిపోతారు.

వెంటనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తారు. స్కాల్పింగ్ స్ట్రాటజీ తో నిమిషాల్లో అధిక లాభాలు వస్తాయనే ఓ థంబ్‌నెయిల్‌ కనిపిస్తుంది. అది బాగా అట్ట్రాక్ట్ చేస్తుంది. వెంటనే అది చూసి ట్రేడింగ్ మొదలెట్టేస్తారు. నిమిషాల్లో లాభాలు కళ్ళచూడొచ్చని ఆ పెద్ద  మనిషి చెప్పింది వాస్తవమే.. కానీ అక్కడ మనం పాటించాల్సిన కొన్ని సూత్రాలు చెబుతాడు ఆ వీడియో పెద్ద మనిషి. కానీ మనోడు అవేవీ తలకెక్కించుకోడు. ఫలితం నిమిషాల్లో సంపాదించడం మాట అటుంచి.. ఉన్నది మొత్తం నిమిషాల్లో పోగొట్టుకుంటాడు.

ఈతరహా వ్యక్తుల్లో రెండు రకాలు ఉంటారు.. ఒకళ్ళు పోగొట్టుకున్న దానితో కళ్ళు తెరిచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని భవిష్యత్తులో ఆచితూచి వ్యవహరిస్తారు. అంటే.. అన్నీ తెలుసుకున్నాకే మళ్ళీ మార్కెట్లోకి అడుగుపెడతారు.

ఇక రెండోరకం... వీళ్ళు సబ్జెక్టు నేర్చుకోవడం మాట అటుంచి.. పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ ఎలాగైనా సంపాదించేయాలని ఈసారి గతంలో కంటే ఇంకొంచెం ఎక్కువ డబ్బులు తెచ్చి మార్కెట్లో పెడతారు.  ఈసారి సక్సెస్ కారు. అది కూడా పోగొట్టుకుంటారు. అటు బయటకు చెప్పుకోలేక, ఇటు దుఃఖాన్ని దిగమింగుకోలేక వేదన అనుభవిస్తూ ఉంటారు. వీళ్ళు చేసిన ఒక చిన్న తప్పుకి వీళ్ళ ఆర్ధిక జీవితం అతలాకుతలం అయిపోయినట్లే.

ఇలా తప్పుల మీద తప్పులు చేసేవాళ్లను ఎవరూ మార్చలేరు. వారి ఖర్మకి వారినే వదిలేయడం తప్ప. ఇప్పుడు మనం పైన ప్రశ్నించుకున్న పాయింట్లకొద్దాం.

మీరు ఏ సంప్రదాయ పెట్టుబడులు పరిగణనలోకి తీసుకున్నా వాటికి మించి రెండింతలు, మూడింతలు, అంతకుమించి ఇవ్వగల సామర్ధ్యం స్టాక్ మార్కెట్‌కు ఉంది. మీరు చేయాల్సిందల్లా.. సరైన స్టాక్‌నుసెలెక్ట్ చేసుకోవడం. ముందు మీ దగ్గర పెట్టుబడి పెట్టదగ్గ సొమ్ములు ఎన్ని ఉన్నాయో చూసుకోండి. ఆ తర్వాత అందులో సగం డబ్బుల్ని మాత్రమే పెట్టుబడుల వైపు మళ్లించండి.

ఉదా: మీదగ్గర ఓ రూ. 2 లక్షలు ఉన్నాయి అనుకుందాం. అందులో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టండి. అయితే ఆ లక్షతో ఏ షేర్లు కొనాలనే సందేహం రావొచ్చు. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సెన్సెక్స్‌లో 30 షేర్లు ఉంటాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి విషయానికొస్తే దీని ప్రామాణిక సూచీ నిఫ్టీ. దీంట్లో 50 షేర్లు ఉంటాయి. పెట్టుబడులకు వీటిని ఎంచుకోవచ్చు.

ఈ షేర్లు మార్కెట్ పడినా పెద్దగా పడిపోవు. మళ్ళీ మార్కెట్లో రికవరీ రాగానే ఇవి పెరగడం మొదలెడతాయి. కాబట్టి మీరు కొన్న తర్వాత ప్రతికూల పరిస్థితుల్లో షేర్ ధర క్షీణించినా... ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అలాకాక తక్కువ రేటుకు వస్తున్నాయి అనో, ఎక్కువ పరిమాణంలో కొనేయొచ్చనో డబ్బులతో ప్రయోగాలు చేయకండి.

ఉదా: మీదగ్గరున్న లక్షతో 10 రూపాయల లోపు ఉండే షేర్లు 10,000 రావొచ్చు. అయితే అవి ఒక రూపాయి పెరగడానికి ఒక్కోసారి ఒక సంవత్సరం కూడా పట్టొచ్చు. పైగా వాటిలో లిక్విడిటీ చాలా తక్కువ ఉంటుంది. అంటే.. మనకు డబ్బులు అవసరమైనప్పుడు వాటిని అమ్ముకుందామంటే కొనే నాథుడు ఉండదు. అలా ఇరుక్కుపోతారు.

అదే మంచి లిక్విడిటీ ఉండే నిఫ్టీ, సెన్సెక్స్ షేర్లలో పెట్టుబడి పెడితే ఒకవేళ మార్కెట్ పడినా.. తర్వాత రికవరీ లో మంచి ప్రాఫిట్స్ అందిస్తాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మి సొమ్ములు చేసుకోవచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా.. మంచి స్టాక్‌ను ఎంచుకోవడం. అదెలా అన్నది మరోసారి విశ్లేషించుకుందాం.

ఇతర మార్గాలతో పోలిస్తే స్టాక్ మార్కెట్లో కచ్చితంగా మంచి డబ్బులే సంపాదించవచ్చన్నది నా మాట. నాలెడ్జి లేకుండా ఇష్టమొచ్చినట్లు చేస్తేనే అసలు ముప్పంతా. అంచేత ముందు సబ్జెక్టు తెలుసుకోండి. అధిక రాబడి ఇవ్వగల సామర్ధ్యం మార్కెట్‌కు ఉంది. దాన్ని సరిగా ఉపయోగించుకోవడమే మీ చేతుల్లో ఉంది. ఇదొక రెండో ఆదాయ మార్గపు వనరుగా భావించి ఒక క్రమ పద్ధతిలో, అత్యాశకు పోకుండా పెట్టుబడి మార్గంగా వినియోగించుకొంటే మీరు భవిష్యత్లో 'రాజా ది గ్రేట్' అవుతారనడంలో సందేహం లేదు.

-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ నిపుణులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement