కౌడిపల్లి, న్యూస్‌లైన్: ఉన్నత చదువులు చదివి ఆదుకుంటాడనుకున్న కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో పెద్దల అమావాస్య పండుగ రోజున ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ విషాదకర సంఘటన మండలంలోని వెల్మకన్నలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌ఐ నాగార్జునగౌడ్, మృతుని కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ వడ్ల చంద్రకళ, భూషణం దంపతుల కుమారుడు వడ్ల నాగరాజు(20) మర్రి లక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గత ఆదివారం రాత్రి కౌడిపల్లికి చెందిన గొల్ల నాగరాజు, ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ షీలోమార్టిన్‌లతో కలిసి నాగరాజు తన బైక్‌పై చేగుంట వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరగ్గా షిలోమార్టిన్ మృతి చెండాదు.
అయితే బైక్ వడ్ల నాగరాజు పేరుతో ఉండడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
దీంతో నాగరాజు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసినా తనకు ప్రభుత్వ ఉద్యోగం రాదనీ, తనవల్ల తన తల్లిదండ్రుల పరువు కూడా పోయిందని మనస్థాపం చెందాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం బహిర్భూమికని వెళ్లిన వడ్ల నాగరాజు ఇంటి వెనుక ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు గల కారణాలన్నీ ఓ సూసైడ్ నోట్‌లో రాసి ఉంచాడు. రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డ కుమారుడు ఇలా అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడంతో నాగరాజు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ నాగార్జునగౌడ్ గ్రామానికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. నాగరాజు కుటుంబీకులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వెల్మకన్నలో అంత్యక్రియలు నిర్వహించగా, నాగరాజు స్నేహితులు, మర్రి లక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు భారీగా తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
Published Sat, Oct 5 2013 1:29 AM | Last Updated on Fri, Jul 26 2019 4:10 PM
Advertisement
Advertisement