
ఉద్యోగాలు ఇప్పిస్తామని సాఫ్ట్ వేర్ సంస్థ టోకరా
సాఫ్ట్‌వేర్ శిక్షణా సంస్థపై కేసు నమోదు
అమీర్‌పేట: శిక్షణ.. ఉద్యోగాలంటూ నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని టోకరా ఇచ్చిందో సాఫ్ట్‌వేర్ సంస్థ. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సార్‌నగర్ ఇన్‌స్పెక్టర్ రమణగౌడ్ కథనం ప్రకారం... భీమవరానికి చెందిన గౌతమి భూపతిరాజు నగరంలోని నిజాంపేటలో ఉంటూ అమీర్‌పేట కేఆర్‌కే ఎన్‌క్లేవ్‌లో ఏఎస్‌ఐటీ పేరుతో సాఫ్టవేర్ శిక్షణా సంస్థను ఏర్పాటు చేశాడు.
తమ సంస్థలో ఉన్నతస్థాయి ప్రమాణాలతో శిక్షణ ఇచ్చి.. ఉద్యోగం కూడా ఇప్పిస్తామని ప్రచారం చేసుకున్నాడు. దీంతో గ్రామీణప్రాంతాల నుంచి వచ్చి పలువురు యువకులు ఏఎస్‌ఐటీ సంస్థలో చేరారు. సంస్థ నిర్వాహకుడు ఒక్కొక్కరి వద్ద రూ.25 వేలు నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేశాడు. శిక్షణ పూర్తైఏడాదైనా ఉద్యోగం ఇప్పించకపోవడంతో బాధితులు పట్టాభి, వినోద్ తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు 123 మంది ఉన్నట్టు తెలిసిందని, వీరు 15 మంది తమకు ఫిర్యాదు చేశారని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.