ఒంగోలు: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ అర్హత పరీక్షకు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని యూనివర్శిటీ అదనపు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వడ్రాణం శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. స్థానిక శర్మా కాలేజీలోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ స్టడీ సెంటర్‌ను పరిశీలించేందుకు ఆదివారం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 26వ తేదీ తెలంగాణా, ఏపీలోని అన్ని స్టడీ సెంటర్లలో అర్హత పరీక్ష ఉంటుందన్నారు. ఈ పరీక్ష కేవలం రాయడం, చదవగలగడం అనే అంశాలపై మాత్రమే ఆధారపడి ఉంటుందన్నారు. దీనికి ఎటువంటి విద్యార్హత అవసరం లేదన్నారు. పరీక్షకు సంబంధించి స్టడీ మెటీరియల్ కూడా ఇస్తున్నామన్నారు. దరఖాస్తును ఆన్‌లైన్‌లో మాత్రమే పంపుకోవాలని, ఏపీ ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించేవారు రూ. 310లు, డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు ద్వారా ఫీజు చెల్లించేవారు రూ. 300లు చెల్లిస్తే సరిపోతుందన్నారు. అభ్యర్థులు స్టడీ సెంటర్‌కు తప్పనిసరిగా రావాల్సిన అవసరంలేదని, సైన్స్ అభ్యర్థులు మాత్రం స్టడీ సెంటర్‌లో వారంవారం జరిగే స్టడీ క్లాసులను వినియోగించుకోవచ్చన్నారు.
డిగ్రీ విద్యార్థులకు మూడు సంవత్సరాలకు కలిపి రూ. 5 వేలు కూడా మించదన్నారు. ఈ ఏడాది నుంచి సెమిస్టర్ సిస్టంను కూడా ప్రారంభిస్తున్నామని, దీనివల్ల విద్యార్థులకు మరింత సులభతరంగా ఉంటుందన్నారు. దాంతోపాటు స్కిల్ బేస్డ్ డెవలప్‌మెంట్ కోర్సులను కూడా విద్యార్థులకు అందించేందుకు ప్రాంతాల వారీగా పరిశీలన చేస్తున్నామన్నారు. తమ విద్యాసంస్థకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు కూడా ఉందన్నారు. అందువల్ల తమ దూర విద్యాకోర్సులు చదివిన వారు ప్రభుత్వం నిర్వహించే యూపీఎస్‌సీ పరీక్షలకు సైతం హాజరుకావొచ్చన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ జిల్లాలో స్టడీ సెంటర్లను పెంచే అవకాశాన్ని, పీజీ కోర్సులు ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చారు. సమావేశంలో డిప్యూటీ రిజిస్ట్రార్ ఆర్.నరశింగరావు, సూపరింటెండెంట్ వి.వెంకటరమణ , సీనియర్ అసిస్టెంట్ శివరాం తదితరులు పాల్గొన్నారు.
ఓపెన్ యూనివర్శిటీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి
Published Mon, Feb 13 2017 2:14 AM | Last Updated on Mon, Aug 20 2018 3:09 PM
Advertisement