Open University exam
-
ఖతర్నాక్ మహిళా ఎంపీ
ఢాకా : ప్రపంచవ్యాప్తంగా ఓ మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని చెబుతారు. కానీ బంగ్లాదేశ్ ఎంపీ తమన్నా నస్రత్ తన లాంటి పోలికలు కలిగిన ఎనిమిది మందిని వెతికి పట్టుకున్నారు. అందులోను ఒక్క బంగ్లాదేశ్‌లోనే. బంగ్లాదేశ్ ఓపెన్ యూనివర్శిటీలో ‘బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ’ చదువుతున్న తమన్నా తాను రాయల్సిన 13 పరీక్షల కోసం ఈ ఎనిమిదిని ఎంపిక చేసుకున్నారు. వారికి వివిధ సబ్జెక్టుల్లో శిక్షణ కూడా ఇప్పించారు. తనకు బదులుగా తనలాగా పోలికలున్న వారిని ఓపెన్ యూనివర్శిటీ ఎగ్జామినేషన్స్‌కు పంపిస్తూ వచ్చారు. ఎవరికి అనుమానం రాకుండా ఎంపీగా తనకుండే బాడీ గార్డులను కూడా తన నకిలీల వెంట పరీక్ష హాల్లకు పంపిస్తూ వచ్చారు. కొన్ని పరీక్షలు ఆ డూప్‌లు ఎలాంటి అవాంతరాలు లేకుండానే తమన్నా తరఫున రాయగలిగారు. ఎంత ఎంపీగారి పోలికలున్నా తోటి విద్యార్థులు గుర్తు పడతారుకదా! మొదట్లో ఎంపీకి డూపులు వస్తున్నారని విద్యార్థులు గుర్తించారు. ఉన్నత స్థానంలో ఉన్న ధనిక కుటుంబానికి చెందిన ఎంపీ జోలికి తామెళ్లడం ఎందుకులే అనుకొని ఊరుకున్నారు. చివరికి ఆ నోట, ఈనోట ఆ విషయం బంగ్లాదేశ్ ప్రభుత్వ ‘నాగరిక్ టీవీ’కి తెల్సింది. టీవీ సిబ్బంది పరీక్ష కేంద్రానికి వెళ్లి తమన్నా గెటప్‌లో పరీక్ష రాస్తున్న ఓ డూప్‌ను పట్టుకొని విచారించారు. ముందుగా తానే తమన్నా అంటూ సమర్థించుకున్న ఆ డూప్ టీవీ మీడియా అడుగుతున్న ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరై నిజం చెప్పేశారు. తానే కాకుండా తనలాంటి వాళ్లు మొత్తం ఎనిమిది మంది ఉన్నారని ఆమె చెప్పారు. ఆ డూప్‌లపై ఎలాంటి చర్య తీసుకున్నారో తెలియదుగానీ, ఎంపీ తమన్నాను మాత్రం యూనివర్శిటీ నుంచి బహిష్కరించినట్లు యూనివర్శిటీ హెడ్ ఎంఏ మన్నన్ తెలిపారు. తమన్నా అధికారంలో ఉన్న అవామీ లీగ్‌కు చెందిన ఎంపీ అవడంతో ఆమెపై ఎలాంటి చర్య తీసుకోవాలనే విషయంలో ఇంకా మల్లగుల్లాలు పడుతున్నారు. -
తనలాగా ఉన్న 8మందితో పరీక్షలు
ఢాకా: బంగ్లాదేశ్ అధికార పార్టీకి చెందిన మహిళా ఎంపీ ఒకరు వర్సిటీ పరీక్షలను తన పోలికలతో ఉన్న 8మంది మహిళలతో రాయించారు. ఈ విషయం మీడియా బయటపెట్టడంతో ఆమెను వర్సిటీ బహిష్కరించింది. అధికార అవామీ లీగ్ పార్టీకి చెందిన ఎంపీ తమన్నా నుస్రత్ బంగ్లాదేశ్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ చదువుతున్నారు. ఇందులో భాగంగా 13 సబ్జెకుల పరీక్షలు రాసేందుకు తన మాదిరిగానే ఉన్న 8 మంది మహిళలను వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని నాగరిక్ టీవీ అనే చానెల్ బయట పెట్టింది. పరీక్షలు రాస్తున్న సమయంలో వారికి ఎంపీ అనుచరులు కాపలాగా ఉన్నారని తెలిపింది. స్పందించిన వర్సిటీ అధికారులు ఎంపీ నుస్రత్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. -
ఓపెన్ యూనివర్శిటీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి
ఒంగోలు: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ అర్హత పరీక్షకు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని యూనివర్శిటీ అదనపు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వడ్రాణం శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. స్థానిక శర్మా కాలేజీలోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ స్టడీ సెంటర్‌ను పరిశీలించేందుకు ఆదివారం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 26వ తేదీ తెలంగాణా, ఏపీలోని అన్ని స్టడీ సెంటర్లలో అర్హత పరీక్ష ఉంటుందన్నారు. ఈ పరీక్ష కేవలం రాయడం, చదవగలగడం అనే అంశాలపై మాత్రమే ఆధారపడి ఉంటుందన్నారు. దీనికి ఎటువంటి విద్యార్హత అవసరం లేదన్నారు. పరీక్షకు సంబంధించి స్టడీ మెటీరియల్ కూడా ఇస్తున్నామన్నారు. దరఖాస్తును ఆన్లైన్లో మాత్రమే పంపుకోవాలని, ఏపీ ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించేవారు రూ. 310లు, డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు ద్వారా ఫీజు చెల్లించేవారు రూ. 300లు చెల్లిస్తే సరిపోతుందన్నారు. అభ్యర్థులు స్టడీ సెంటర్‌కు తప్పనిసరిగా రావాల్సిన అవసరంలేదని, సైన్స్ అభ్యర్థులు మాత్రం స్టడీ సెంటర్లో వారంవారం జరిగే స్టడీ క్లాసులను వినియోగించుకోవచ్చన్నారు. డిగ్రీ విద్యార్థులకు మూడు సంవత్సరాలకు కలిపి రూ. 5 వేలు కూడా మించదన్నారు. ఈ ఏడాది నుంచి సెమిస్టర్ సిస్టంను కూడా ప్రారంభిస్తున్నామని, దీనివల్ల విద్యార్థులకు మరింత సులభతరంగా ఉంటుందన్నారు. దాంతోపాటు స్కిల్ బేస్డ్ డెవలప్మెంట్ కోర్సులను కూడా విద్యార్థులకు అందించేందుకు ప్రాంతాల వారీగా పరిశీలన చేస్తున్నామన్నారు. తమ విద్యాసంస్థకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు కూడా ఉందన్నారు. అందువల్ల తమ దూర విద్యాకోర్సులు చదివిన వారు ప్రభుత్వం నిర్వహించే యూపీఎస్సీ పరీక్షలకు సైతం హాజరుకావొచ్చన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ జిల్లాలో స్టడీ సెంటర్లను పెంచే అవకాశాన్ని, పీజీ కోర్సులు ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చారు. సమావేశంలో డిప్యూటీ రిజిస్ట్రార్ ఆర్.నరశింగరావు, సూపరింటెండెంట్ వి.వెంకటరమణ , సీనియర్ అసిస్టెంట్ శివరాం తదితరులు పాల్గొన్నారు.