విద్యావేత్త యశ్‌పాల్ కన్నుమూత
► శాస్త్రరంగంలోనూ విశేష సేవ
► ప్రధాని మోదీ విచారం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా పేరుగాంచిన ప్రముఖ విద్యావేత్త, భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ యశ్‌పాల్ సింగ్ (90) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో యశ్‌పాల్ సోమవారం రాత్రి 8 గంటల సమయంలో నోయిడాలోని ఓ వైద్యశాలలో తుదిశ్వాస విడిచారని ఆయన కొడుకు రాహుల్ పాల్ మంగళవారం తెలిపారు. అంత్యక్రియలను ఢిల్లీలోని లోధి రోడ్‌లో ఉన్న విద్యుత్ దహనవాటికలో నిర్వహించామని చెప్పారు. విశ్వకిరణాల (కాస్మిక్ రేస్)పై అధ్యయనంలో యశ్‌పాల్ కీలక పాత్ర వహించారు. భారతీయ విద్యావిధానంలో పలు సంస్కరణలకు ఆయన ఆద్యుడిగా నిలిచారు.
ప్రస్తుత పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో 1926లో జన్మించిన యశ్‌పాల్ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్)లో తన కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం అమెరికా వెళ్లి మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. తిరిగి భారత్‌కు వచ్చిన ఆయన టీఐఎఫ్‌ఆర్‌లో తన ఉద్యోగాన్ని కొనసాగించారు. 1986–91 మధ్య యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్‌గాను యశ్‌పాల్ పనిచేశారు. ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్, పద్మ భూషణ్ పురస్కారాలతో గౌరవించింది. అటు విద్యా విధానం రూపకల్పనలోనూ యశ్‌పాల్ విశేష కృషి చేశారు.
జాతీయ విద్యా విధానంపై.. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ఏర్పాటు చేసిన కమిటీకి యశ్‌పాల్ నేతృత్వం వహించారు. 2009లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉన్నత విద్యలో తీసుకురావాల్సిన సంస్కరణలపై యశ్‌పాల్ సారథ్యంలో ఓ కమిటీని నియమించింది. ఇది యశ్‌పాల్ కమిటీగా పేరుగాంచింది. సైన్సుకు ప్రాచుర్యం కల్పించినందుకుగాను ఐక్యరాజ్యసమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ఆయనకు ‘కళింగ ప్రైజ్’ను ప్రదానం చేసింది. ఇవేకాక మరెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను ఆయన అందుకున్నారు.
సేవలు గుర్తుండిపోతాయి: మోదీ
ప్రొఫెసర్ యశ్‌పాల్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘యశ్‌పాల్ మరణవార్త నన్ను బాధించింది. ఒక గొప్ప శాస్త్రవేత్తను, విద్యావేత్తను మనం కోల్పోయాం. భారతీయ విద్యా వ్యవస్థకు ఆయన అందించిన సేవలు ఎన్నటికీ గుర్తుండిపోతాయి’ అంటూ మోదీ ఓ ట్వీట్ చేశారు. యశ్‌పాల్ మృతి భారత్‌కు పెద్ద లోటు అని శాస్త్ర, సాంకేతిక, భూ శాస్త్ర శాఖ మంత్రి హర్షవర్ధన్ ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు కూడా యశ్‌పాల్ మృతికి సంతాపం తెలిపారు. శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి విజయ్ రాఘవన్ మాట్లాడుతూ ‘డా.హోమిబాబా, డా.విక్రమ్ సారాభాయ్ తదితరుల కాలానికి, నేటి తరానికి మధ్య వారధిలా ఉన్న వ్యక్తిని మనం కోల్పోయాం’ అని అన్నారు.