వానతో పొత్తుకు సై | Sweet and Hot Stuff Ready | Sakshi
Sakshi News home page

వానతో పొత్తుకు సై

Published Mon, Jun 29 2015 11:32 PM | Last Updated on Fri, Jul 26 2019 4:10 PM

వానతో పొత్తుకు సై - Sakshi

వానతో పొత్తుకు సై

ఓ పక్క... వాన చినుకుల చిటపట.
మరో పక్క... కుంపటిలో మొక్కజొన్నపొత్తుల చిటాపటా.
రెయినీ సీజన్‌లో... కామన్ సీన్ ఇది.
కానీ ఇప్పుడు...
మొక్కజొన్న స్థానాన్ని స్వీట్‌కార్న్ కొట్టేస్తోంది!
ఆవిరిపై కాసేపు ఉడికిస్తే చాలు...
స్వీట్ అండ్ హాట్ స్టఫ్ రెడీ అంటుంది.
ఆ స్టఫ్‌తో పకోడీలా, సమోసాలా, కర్రీ టోస్టా, కార్న్ చాటా...
ఏం చేసుకుంటామన్నది మన చాయిసే.

 
స్వీట్‌కార్న్ మెంతి పకోరా
కావలసినవి: స్వీట్ కార్న్ గింజలు - మూడు కప్పులు (మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా చేయాలి); మెంతి ఆకులు - కప్పు (ఆకులు శుభ్రం చేసి బాగా కడిగి ఉడికించాలి); ఉల్లి తరుగు - అర కప్పు; పచ్చిమిర్చి తరుగు - రెండు టేబుల్ స్పూన్లు; అల్లం తురుము - టీ స్పూను; కొత్తిమీర తరుగు - పావు కప్పు; సెనగ పిండి - 3 టేబుల్ స్పూన్లు; బియ్యప్పిండి - టేబుల్ స్పూను; కార్న్‌ఫ్లోర్ - టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత; నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ: స్టౌ మీద బాణలి ఉంచి తగినంత నూనె పోసి కాగనివ్వాలి  ఒక పాత్రలో స్వీట్‌కార్న్ ముద్ద, ఉడికించిన మెంతి ఆకు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి  సెనగ పిండి, బియ్యప్పిండి , కార్న్‌ఫ్లోర్ జత చేసి మిశ్రమం మరోసారి కలపాలి. (నీళ్లు పోయకూడదు  బాణలిలో నూనె కాగిందో లేదో చూసుకుని, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ నూనెలో వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి  టొమాటో కెచప్‌తో స్వీట్ కార్న్ మెంతి పకోరాలను వేడివేడిగా అందించాలి.
 
స్వీట్ కార్న్ చాట్
కావలసినవి: స్వీట్ కార్న్ గింజలు - 2 కప్పులు; ఉల్లి తరుగు - పావు కప్పు; టొమాటో తరుగు - పావు కప్పు; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను; కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూను; నిమ్మరసం - 2 టీ స్పూన్లు; కారం - పావు టీ స్పూను; చాట్ మసాలా - టీ స్పూను; నల్ల ఉప్పు లేదా రాతి ఉప్పు - తగినంత; అలంకరణ కోసం... కొత్తిమీర తరుగు - కొద్దిగా; సన్న కారప్పూస - కొద్దిగా.
 
తయారీ: స్వీట్ కార్న్ గింజలను ఆవిరి మీద ఉడికించాలి   ఒక పాత్రలో ఉడికించిన స్వీట్ కార్న్ గింజలు, ఉల్లి తరుగు, టొమాటో తరుగు, పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి  నిమ్మరసం. చాట్ మసాలా జత చేసి మరోమారు కలపాలి  చిన్న చిన్న బౌల్స్‌లో వేసి పైన కొత్తిమీర తరుగు, సన్న కార ప్పూసలతో అలంకరించి వేడివేడిగా అందించాలి.
 
స్వీట్ కార్న్ కర్రీ టోస్ట్
కావలసినవి: బ్రెడ్ స్లైసులు - 10; స్వీట్ కార్న్ - కప్పు; ఉల్లి తరుగు - పావు కప్పు; నిమ్మరసం - టీ స్పూను; జీలకర్ర - పావు టీ స్పూను; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను; కారం - అర టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; అల్లం తురుము - టీ స్పూను; గరం మసాలా - టీ స్పూను; కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూను; నూనె - తగినంత

తయారీ: ముందుగా స్వీట్ కార్న్ గింజలను మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా పట్టాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, జీలకర్ర వేసి వేయించాలి  పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము జత చేసి కొద్దిగా వేయించాలి  ఉల్లి తరుగు జత చేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించాలి  స్వీట్ కార్న్ ముద్ద, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, కొద్దిగా నీళ్లు జత చేసి బాగా కలిపి మూత ఉంచాలి  ఐదు నిమిషాలయ్యాక దించేయాలి  నిమ్మరసం, కొత్తిమీర తరుగు జత చేయాలి  ఈ మిశ్రమాన్ని బ్రెడ్ స్లైస్ మీద సమానంగా పరవాలి   వేడి చేసిన పెనం మీద వీటిని రెండు వైపులా బటర్ వేసి కాల్చాలి టొమాటో కెచప్‌తో వేడివేడిగా అందించాలి.
 
స్వీట్ కార్న్ సమోసా
కావలసినవి: స్వీట్ కార్న్ గింజలు - కప్పు; మైదా పిండి - కప్పు; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను; కొత్తిమీర తరుగు - రెండు టేబుల్ స్పూన్లు; పుదీనా ఆకులు - గుప్పెడు; చనా మసాలా పొడి - అర టీ స్పూను; ఉప్పు - తగినంత; నూనె - వేయించడానికి తగినంత

తయారీ: బాణలిలో మూడు టీ స్పూన్ల నూనె వేసి దింపేయాలి  ఒక పాత్రలో మైదా పిండి, కాచిన నూనె, ఉప్పు వేసి బాగా కలపాలి   తగినన్ని నీళ్లు జత చేసి చపాతీ పిండి మాదిరిగా బాగా కలిపి పక్కన ఉంచాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక స్వీట్ కార్న్ గింజలు వేసి వేయించాలి   పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర, పుదీనా ఆకుల తరుగు, చనా మసాలా పొడి, ఉప్పు వేసి రెండు మూడు నిమిషాలు బాగా కలిపి తీసి పక్కన ఉంచాలి   స్టౌ మీద పెనం ఉంచి వేడి చేయాలి  కలిపి ఉంచుకున్న మైదా పిండి ని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీ మాదిరిగా ఒత్తి, పెనం మీద వేసి రెండు వైపులా కొద్దిగా కాల్చి తీసి దానిని రెండుగా మధ్యకు కట్ చేయాలి. (అర్ధ వ్యాసంగా వస్తుంది)  ఒక భాగాన్ని తీసుకుని దానిని కోన్ మాదిరిగా చుట్టి, అందులో తయారుచేసి ఉంచుకున్న కార్న్ మిశ్రమం కొద్దిగా ఉంచి, అంచులు మూసేయాలి ఇలా అన్నీ తయారుచేసుకోవాలి  నూనె కాగాక వీటిని ఒకటొకటిగా వేస్తూ బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి.
 
చట్‌పటా కార్న్
కావలసినవి: స్వీట్ కార్న్ - కప్పు; వేయించిన పల్లీలు - పావు కప్పు (చిన్న చిన్న ముక్కలుగా చేయాలి); ఉల్లి తరుగు - పావు కప్పు (మిక్సీలో వేసి మెత్తగా ముద్ద చేయాలి); టొమాటో ప్యూరీ - టేబుల్ స్పూను; టొమాటో తరుగు - 2 టేబుల్ స్పూన్లు (చిన్న చిన్న ముక్కలుగా తరిగినవి); అల్లం తురుము - టీ స్పూను; పచ్చిమిర్చి తరుగు - 2 టీ స్పూన్లు; పంచదార - చిటికెడు; నిమ్మరసం - అర టీ స్పూను; నూనె - 2 టీ స్పూన్లు; ఉప్పు - కొద్దిగా; అలంకరణ కోసం... కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు; టొమాటో తరుగు - 2 టీ స్పూన్లు
 
తయారీ: బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఉల్లి ముద్ద వేసి దోరగా వేయించాలి  అదే బాణలిలో పల్లీ ముక్కలు, టొమాటో ప్యూరీ, టొమాటో ముక్కలు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, పంచదార, ఉప్పు, పావు కప్పు నీళ్లు వేసి బాగా కలిపి నాలుగైదు నిమిషాలు సన్న మంట మీద ఉంచి కలుపుతూండాలి  నిమ్మరసం జత చేసి మరోమారు కలిపి దింపేయాలి  చిన్న చిన్న సర్వింగ్ బౌల్స్‌లోకి తీసుకుని వేడివేడిగా అందించాలి.
 
సేకరణ: డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement