నవరాత్రులు పూర్తయ్యాయి. ఈ రోజే దసరా పండుగ. అమ్మవారికి ప్రసాదాలు ఏం వండాలి? ఆరోగ్యంగా రుచిగా సులువుగా ఉండాలి. ముందురోజు నానబోసే శనగ గుగ్గిళ్ల బదులు... అప్పటికప్పుడు స్వీట్ కార్న్ సుండలు చేయండి. చిటికెలో పూర్తయ్యే రవ్వ పోంగలి వండండి. తీపి లేకపోతే పండుగ ఫీల్ రాదంటే పాల పాయసం ఉంది.
పాలపాయసం
కావలసినవి: బియ్యం– కప్పు; వెన్న తీయని పాలు – లీటరు; చక్కెర – ఒకటిన్నర కప్పు; నెయ్యి– టేబుల్‌స్పూన్; యాలకుల పొడి– అర టీ స్పూన్; కుంకుమ పువ్వు – పది రేకలు.
తయారీ: బియ్యం కడిగి నీరంతా పోయేటట్లు చిల్లుల పాత్రలో వేసి ఉంచాలి.
ఒక పాత్రలో పాలను మరిగించి పక్కన పెట్టాలి.
పెద్ద పాత్ర పెట్టి అందులో నెయ్యి వేడి చేసి అందులో బియ్యం వేసి సన్నమంట మీద వేయించాలి. బియ్యం ఒక మోస్తరుగా వేగిన తరవాత అందులో పాలను పోసి కలిపి ఉడికించాలి. సగం ఉడికిన మంట తగ్గించాలి.
బియ్యం మొత్తగా ఉడికిన తరవాత అందులో చక్కెర, యాలకుల పొడి వేసి కలిపి మరికొంత సేపు ఉడకనివ్వాలి. చక్కెర కరిగి తిరిగి మిశ్రమం చిక్కబడిన తర్వాత దించే ముందు కుంకుమ పువ్వు రేకలు వేయాలి. పాల పాయసాన్ని గరిట జారుడుగా ఉండగానే దించేయాలి, పోంగలి వండినట్లు తేమ ఇంకిపోయే వరకు ఉడికించకూడదు.
స్వీట్ కార్న్ సుండలు
కావలసినవి: స్వీట్ కార్న్ – 2 కప్పులు; పచ్చి కొబ్బరి తురుము – 4 టేబుల్ స్పూన్‌లు; నెయ్యి – టేబుల్ స్పూన్; ఆవాలు – టీ స్పూన్; మినప్పప్పు – టీ స్పూన్; ఎండుమిర్చి – 2; పచ్చిమిర్చి – 2 (తరగాలి); ఇంగువ – చిటికెడు; కరివేపాకు – 8 రెమ్మలు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచినిబట్టి;
తయారీ:
స్వీట్ కార్న్ గింజలను కడిగి ప్రెషర్ కుకర్‌లో వేసి టేబుల్ స్పూన్ నీటిని చిలకరించి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి దించేయాలి. ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసి వడపోసి పక్కన పెట్టాలి.
బాణలిలో నెయ్యి వేడి చేసి ఆవాలు, ఎండుమిర్చి, మినప్పప్పు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు, ఇంగువ, పచ్చికొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. పోపు దినుసులు కొబ్బరికి సమంగా పట్టిన తర్వాత స్వీట్ కార్న్ గింజలు, ఉప్పు వేసి కలిపి చిన్న మంట మీద రెండు నిమిషాల సేపు ఉంచి, మరోసారి బాగా కలిపి దించేయాలి.
గోధుమ రవ్వ పోంగలి
కావలసినవి: గోధుమరవ్వ – 150 గ్రాములు; పెసరపప్పు – 100 గ్రాములు; నెయ్యి– 4 టేబుల్ స్పూన్‌లు; జీలకర్ర – టీ స్పూన్; మిరియాలు లేదా మిరియాల΄÷డి – టీ స్పూన్; అల్లం తురుము – టీ స్పూన్; ఇంగువ – చిటికెడు; జీడిపప్పు– 15; కరివేపాకు – 2 రెమ్మలు; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి; నీరు – అర లీటరు.
తయారీ:
మందపాటి బాణలిలో పెసరపప్పును దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత కడిగి ప్రెషర్ కుకర్‌లో వేసి పప్పు మునిగేవరకు నీటిని పోసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత మెదిపి పక్కన పెట్టాలి.
అదే పెనంలో గోధుమపిండి వేసి దోరగా వేయించి పక్కన పెట్టాలి.
బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఇంగువ వేసి వేగిన తర్వాత అందులో మిగిలిన నీటిని పోయాలి.
నీరు మరగడం మొదలైన తర్వాత ఉప్పు వేసి కలిపి అందులో రవ్వను వేయాలి. రవ్వ ఉండలు కట్టకుండా ఉండడానికి నీటిలో వేస్తున్న సేపు గరిటతో కలుపుతూ ఉండాలి.
రవ్వ ఉడికి దగ్గరవుతున్న సమయంలో ముందుగా ఉడికించి, మెదిపి పక్కన పెట్టిన పెసరపప్పు వేసి కలిపితే రవ్వ పోంగలి రెడీ.
Comments
Please login to add a commentAdd a comment