Drs. Vyjayanthimala puranapanda
-
వానతో పొత్తుకు సై
ఓ పక్క... వాన చినుకుల చిటపట. మరో పక్క... కుంపటిలో మొక్కజొన్నపొత్తుల చిటాపటా. రెయినీ సీజన్లో... కామన్ సీన్ ఇది. కానీ ఇప్పుడు... మొక్కజొన్న స్థానాన్ని స్వీట్‌కార్న్ కొట్టేస్తోంది! ఆవిరిపై కాసేపు ఉడికిస్తే చాలు... స్వీట్ అండ్ హాట్ స్టఫ్ రెడీ అంటుంది. ఆ స్టఫ్‌తో పకోడీలా, సమోసాలా, కర్రీ టోస్టా, కార్న్ చాటా... ఏం చేసుకుంటామన్నది మన చాయిసే. స్వీట్‌కార్న్ మెంతి పకోరా కావలసినవి: స్వీట్ కార్న్ గింజలు - మూడు కప్పులు (మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా చేయాలి); మెంతి ఆకులు - కప్పు (ఆకులు శుభ్రం చేసి బాగా కడిగి ఉడికించాలి); ఉల్లి తరుగు - అర కప్పు; పచ్చిమిర్చి తరుగు - రెండు టేబుల్ స్పూన్లు; అల్లం తురుము - టీ స్పూను; కొత్తిమీర తరుగు - పావు కప్పు; సెనగ పిండి - 3 టేబుల్ స్పూన్లు; బియ్యప్పిండి - టేబుల్ స్పూను; కార్న్‌ఫ్లోర్ - టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత; నూనె - డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: స్టౌ మీద బాణలి ఉంచి తగినంత నూనె పోసి కాగనివ్వాలి ఒక పాత్రలో స్వీట్‌కార్న్ ముద్ద, ఉడికించిన మెంతి ఆకు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి సెనగ పిండి, బియ్యప్పిండి , కార్న్‌ఫ్లోర్ జత చేసి మిశ్రమం మరోసారి కలపాలి. (నీళ్లు పోయకూడదు బాణలిలో నూనె కాగిందో లేదో చూసుకుని, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ నూనెలో వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి టొమాటో కెచప్‌తో స్వీట్ కార్న్ మెంతి పకోరాలను వేడివేడిగా అందించాలి. స్వీట్ కార్న్ చాట్ కావలసినవి: స్వీట్ కార్న్ గింజలు - 2 కప్పులు; ఉల్లి తరుగు - పావు కప్పు; టొమాటో తరుగు - పావు కప్పు; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను; కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూను; నిమ్మరసం - 2 టీ స్పూన్లు; కారం - పావు టీ స్పూను; చాట్ మసాలా - టీ స్పూను; నల్ల ఉప్పు లేదా రాతి ఉప్పు - తగినంత; అలంకరణ కోసం... కొత్తిమీర తరుగు - కొద్దిగా; సన్న కారప్పూస - కొద్దిగా. తయారీ: స్వీట్ కార్న్ గింజలను ఆవిరి మీద ఉడికించాలి ఒక పాత్రలో ఉడికించిన స్వీట్ కార్న్ గింజలు, ఉల్లి తరుగు, టొమాటో తరుగు, పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి నిమ్మరసం. చాట్ మసాలా జత చేసి మరోమారు కలపాలి చిన్న చిన్న బౌల్స్‌లో వేసి పైన కొత్తిమీర తరుగు, సన్న కార ప్పూసలతో అలంకరించి వేడివేడిగా అందించాలి. స్వీట్ కార్న్ కర్రీ టోస్ట్ కావలసినవి: బ్రెడ్ స్లైసులు - 10; స్వీట్ కార్న్ - కప్పు; ఉల్లి తరుగు - పావు కప్పు; నిమ్మరసం - టీ స్పూను; జీలకర్ర - పావు టీ స్పూను; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను; కారం - అర టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; అల్లం తురుము - టీ స్పూను; గరం మసాలా - టీ స్పూను; కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూను; నూనె - తగినంత తయారీ: ముందుగా స్వీట్ కార్న్ గింజలను మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా పట్టాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, జీలకర్ర వేసి వేయించాలి పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము జత చేసి కొద్దిగా వేయించాలి ఉల్లి తరుగు జత చేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించాలి స్వీట్ కార్న్ ముద్ద, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, కొద్దిగా నీళ్లు జత చేసి బాగా కలిపి మూత ఉంచాలి ఐదు నిమిషాలయ్యాక దించేయాలి నిమ్మరసం, కొత్తిమీర తరుగు జత చేయాలి ఈ మిశ్రమాన్ని బ్రెడ్ స్లైస్ మీద సమానంగా పరవాలి వేడి చేసిన పెనం మీద వీటిని రెండు వైపులా బటర్ వేసి కాల్చాలి టొమాటో కెచప్‌తో వేడివేడిగా అందించాలి. స్వీట్ కార్న్ సమోసా కావలసినవి: స్వీట్ కార్న్ గింజలు - కప్పు; మైదా పిండి - కప్పు; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను; కొత్తిమీర తరుగు - రెండు టేబుల్ స్పూన్లు; పుదీనా ఆకులు - గుప్పెడు; చనా మసాలా పొడి - అర టీ స్పూను; ఉప్పు - తగినంత; నూనె - వేయించడానికి తగినంత తయారీ: బాణలిలో మూడు టీ స్పూన్ల నూనె వేసి దింపేయాలి ఒక పాత్రలో మైదా పిండి, కాచిన నూనె, ఉప్పు వేసి బాగా కలపాలి తగినన్ని నీళ్లు జత చేసి చపాతీ పిండి మాదిరిగా బాగా కలిపి పక్కన ఉంచాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక స్వీట్ కార్న్ గింజలు వేసి వేయించాలి పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర, పుదీనా ఆకుల తరుగు, చనా మసాలా పొడి, ఉప్పు వేసి రెండు మూడు నిమిషాలు బాగా కలిపి తీసి పక్కన ఉంచాలి స్టౌ మీద పెనం ఉంచి వేడి చేయాలి కలిపి ఉంచుకున్న మైదా పిండి ని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీ మాదిరిగా ఒత్తి, పెనం మీద వేసి రెండు వైపులా కొద్దిగా కాల్చి తీసి దానిని రెండుగా మధ్యకు కట్ చేయాలి. (అర్ధ వ్యాసంగా వస్తుంది) ఒక భాగాన్ని తీసుకుని దానిని కోన్ మాదిరిగా చుట్టి, అందులో తయారుచేసి ఉంచుకున్న కార్న్ మిశ్రమం కొద్దిగా ఉంచి, అంచులు మూసేయాలి ఇలా అన్నీ తయారుచేసుకోవాలి నూనె కాగాక వీటిని ఒకటొకటిగా వేస్తూ బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి. చట్పటా కార్న్ కావలసినవి: స్వీట్ కార్న్ - కప్పు; వేయించిన పల్లీలు - పావు కప్పు (చిన్న చిన్న ముక్కలుగా చేయాలి); ఉల్లి తరుగు - పావు కప్పు (మిక్సీలో వేసి మెత్తగా ముద్ద చేయాలి); టొమాటో ప్యూరీ - టేబుల్ స్పూను; టొమాటో తరుగు - 2 టేబుల్ స్పూన్లు (చిన్న చిన్న ముక్కలుగా తరిగినవి); అల్లం తురుము - టీ స్పూను; పచ్చిమిర్చి తరుగు - 2 టీ స్పూన్లు; పంచదార - చిటికెడు; నిమ్మరసం - అర టీ స్పూను; నూనె - 2 టీ స్పూన్లు; ఉప్పు - కొద్దిగా; అలంకరణ కోసం... కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు; టొమాటో తరుగు - 2 టీ స్పూన్లు తయారీ: బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఉల్లి ముద్ద వేసి దోరగా వేయించాలి అదే బాణలిలో పల్లీ ముక్కలు, టొమాటో ప్యూరీ, టొమాటో ముక్కలు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, పంచదార, ఉప్పు, పావు కప్పు నీళ్లు వేసి బాగా కలిపి నాలుగైదు నిమిషాలు సన్న మంట మీద ఉంచి కలుపుతూండాలి నిమ్మరసం జత చేసి మరోమారు కలిపి దింపేయాలి చిన్న చిన్న సర్వింగ్ బౌల్స్‌లోకి తీసుకుని వేడివేడిగా అందించాలి. సేకరణ: డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై -
శ్రీదేవీ రమణీయం
♦ సోల్ మేట్ బాపు-రమణల జంటలో ఒకరైన ముళ్లపూడి వెంకటరమణ జయంతి నేడు. రమణగారు చిన్నతనంలో చాలా కష్టాలు పడ్డారు. పదో యేటే తండ్రిగారు గతించడంతో రమణగారి తల్లిగారు పిల్లలను తీసుకుని మద్రాసు వచ్చారు. అక్కడే రమణగారు ఎస్ఎస్ఎల్సి వరకు చదివారు. చదువు అయిపోయాక మళ్లీ రాజమండ్రి వచ్చేశారు. కొన్నాళ్లు చిన్నాచితకా పనులు చేశారు. ఖాళీ సమయంలో ఇంగ్ల్లీషు పుస్తకాలు చదువుతుండేవారు. అది చూసి అక్కడి ఇంగ్లీషు దొరగారు రమణగారిని అభిమానించి ‘ఇక్కడ పని మానేసి వెళ్లి మంచి ఉద్యోగం చూసుకో’ అని పది రూపాయలు చేతిలో పెట్టి పంపించారట. ఆ పది రూపాయలు, ఒక జత బట్టలు తీసుకుని, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రమణగారు మద్రాసు బయలుదేరారు. ఈ వివరాలన్నీ మనకు ఆయన ఆత్మకథలో దొరకుతాయి. అందులో లేని విషయాలు కొన్ని ఇప్పుడు ఆయన సతీమణి శ్రీదేవి మాటల్లో విందాం. సినిమాలలోకి రావడానికి ముందు రమణగారు ఏదో చిన్న పత్రికలో ప్రూఫ్ రీడర్‌గా పనిచేశారు. అదేం దురదృష్టమో ఆ పత్రికను నెల్లాళ్లకే మూసేశారు. ఆ తరవాత ఆంధ్రపత్రికలో చేరారు. అక్కడ పనిచేయడం ప్రారంభించాక చాలా కథలు రాశారు. అయితే ఆంధ్రపత్రికలో కొంతకాలం పనిచేశాక రమణగారు ‘నేను ఒకరి కింద పనిచేయలేను’ అని పత్రిక నుంచి బయటకు వచ్చేశారు. ఉద్యోగం లేకపోయినా బతకగలను. జీతం కంటె విడిగానే ఎక్కువ సంపాదిస్తానని వారితో చెప్పి ఉద్యోగం మానేశారట. ఆయన అనుకున్నట్టుగానే డబ్బు కొద్దికొద్దిగా సంపాదించడం ప్రారంభించారు. మహానటులు గోవిందరాజుల సుబ్బారావు గారి దగ్గరకు చాలామంది వస్తుండేవారు. ఆయన హోమియో వైద్యులు. ఆయన తమ్ముడి కొడుకు శ్రీనివాసరావు గారే వెంకటరమణగారిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అప్పట్లో అజంతా గారు, విఏకె రంగారావుగారు, రావి కొండలరావు గారు వీరంతా స్నేహితులు. అందరూ కలిస్తే సరదాగా గడిపేవారట. ఆ తరవాత నెమ్మదిగా డబ్బింగ్ సినిమాలకి పనిచేశారు. తెలుగులో డూండీ గారి ‘రక్తసంబంధం’ మొట్టమొదటి సినిమా. అప్పటికే రమణగారు బాపుగారు అర్ధనారీశ్వరులయ్యారు. సినిమా కోసం ఏ కథ రాసినా ముందుగా బాపు గారితో చర్చించాక నాకు చెప్పేవారు. నాకు నచ్చితే బావుందని చెప్పేదాన్ని. లేకపోతే నా అభిప్రాయం నేను చెప్పేదాన్ని అంతే. గోదావరి ప్రాణాధారం రమణగారి సినిమాల్లో గోదావరి నేపథ్యం ఎక్కువగా ఉంటుంది. అందుకు కారణం లేకపోలేదు. రమణగారు బాల్యంలో ధవళేశ్వరం దగ్గర రాయవరంలో ఉండేవారు. అక్కడ లాంచీలు, పడవలు నడిపే వాళ్లు చాలామంది ఉండేవారు. రమణ గారి తల్లి వారందరికీ తలలో నాలుకలా ఉండేవారు. పడవ వాళ్లు దుంగలు అవీ తెచ్చి ఇస్తుంటే ఆవిడ అన్నం వండి, ఆవకాయ వేసి వాళ్లకి అన్నం పెట్టేవారు. వాళ్లు నిత్యం ఇంటికి వచ్చి వెళ్తుండటంతో రమణగారు నది ఒడ్డుకి వెళ్లి వాళ్లతోనే ఎక్కువగా ఆడుకునేవారు. ఆ పడవ వాళ్లకు రమణగారంటే చాలా ఇష్టం. వారు ఈయన్ని ఎత్తుకుని ఆడించేవారు. ఆ తరవాత మద్రాసు రావడం, మూగమనసులు చిత్రానికి ఆదుర్తి సుబ్బారావుగారితో పని చేయడం, ఆ కారణంగా గోదావరికి మళ్లీ రావడం జరిగింది. గోదావరిలో మొట్టమొదటి ఔట్‌డోర్ షూటింగ్ జరుపుకున్న చిత్రం మూగమనసులే. ఆ తరవాత చాలా సినిమాలు గోదావరిలో తీశారు. నాకు ఆయన చిత్రాలలో అందాల రాముడు అంటే చాలా ఇష్టం. ఆ సినిమా గోదావరి మీద తీసిందే. బాపూ జోడీ రమణ గారి గురించి మాట్లాడేటప్పుడు బాపు దంపతుల గురించి ప్రస్తావించకపోవడం సాధ్యం కాదు. మా జీవితంలో ఆ దంపతులు నిత్యం ఉంటారు. బాపుగారికి మా అన్నయ్య (నండూరి రామమోహనరావు) నా ఫొటో చూపిస్తే, ఆయన వెంటనే ‘మా రమణ ఉన్నాడుగా’ అన్నారట. అలా నన్నిచ్చి వివాహం చేయడానికి అంగీకరించేశారు. మా పెళ్లినాటికి నా వయసు 20, రమణగారి వయసు 32. నేను అంతవరకు ఇల్లు కదిలిందే లేదు. అటువంటిది అందరినీ వదిలేసి ఆ చిన్న పల్లెటూరు నుంచి మద్రాసు మహానగరానికి వచ్చాను. పెళ్లయిన మొదట్లో అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్లేదాన్ని. ఆ తరవాత కొంత కాలానికి నేను ఇంటికి వెళ్లడమే తగ్గిపోయింది. బాపుగారి తల్లి సూర్యకాంతమ్మగారు... రమణగారిని, నన్ను సొంతమనుషుల్లా చూసుకున్నారు. మా అత్తగారు ఆదిలక్ష్మికి అందరి కంటె నేనంటేనే చాలా ఇష్టం. కోపం వస్తే మాట అనేసేవారు. అంతలోనే ప్రేమగా చూసేవారు. బంగారు భాగ్యవతి... బాపుగారి భార్య భాగ్యవతి నన్ను ఎంతో ఆప్యాయంగా ఆదరించింది. ఆవిడ నా కంటె నాలుగేళ్లు పెద్ద. పెళ్లయి వచ్చిన కొత్తలో నాకు ఎలా మసలుకోవాలో తెలియక మా ఇద్దరి మధ్య మాటా మాటా వచ్చినా భాగ్యవతి పెద్ద మనసుతో సద్దుకుపోయేది. ఆ తరవాత నాకే తెలిసేది నేను చేసిన తప్పేంటో. ఏదైనా సరే భాగ్యవతి కరెక్ట్‌గా చేస్తుందని కొంతకాలానికి అర్థం చేసుకున్నాను. ఇద్దరికీ మాట వచ్చినా, ఇబ్బంది వచ్చినా... జరిగిన తప్పును ఒప్పుకోవడం వల్ల వచ్చే సుఖం నాకు తెలుసు. ధైర్యం ఎక్కువ చిత్రాలు నిర్మించినప్పుడు ఎంత ఆస్తి కరిగిపోయినా, వెంకటరమణగారు ధైర్యంగా ఉండటంతో నేను కూడా ధైర్యంగానే ఉన్నాను. బాపు గారి అండ వల్ల అంత ధైర్యంగా ఉండగలిగామేమో అనిపిస్తుంది. ఇల్లు అమ్మేసినప్పుడు ఎక్కడ ఉందామా అని ఆలోచిస్తుంటే, బాపు గారు ‘నాతో పాటే ఉండాలి’ అన్నారు. భాగ్యవతి అయితే మారు మాట్లాడనివ్వలేదు. ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు భాగ్యవతి వల్లే వచ్చింది. ఇంతకంటె మించింది లేదు. ఆ విషయం గురించి ఎవ్వరూ ఒక్కమాట కూడా అడ్డు చెప్పలేదు. నా జీవితంలో నేను ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకునే విషయం ఇది. రమణగారి పుట్టినరోజు సందర్భంగా ఒకసారి అందరినీ స్మరించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. - సంభాషణ: డా. పురాణపండ వైజయంతి బుడుగు... బాపుగారి మేనల్లుడు బాగా అల్లరి చేస్తుండేవాడు. ఇకనేం డెన్నిస్ ద మినేస్ పాత్రల ఆధారంగా బుడుగు పాత్ర పుట్టుకు వచ్చింది. రమణగారిని వాళ్ల నాన్నగారు వాళ్లు బుడుగు అని, మా పెద్ద ఆడపడుచుని బుల్లులు అని పిలిచేవారు. అలా ఆ పాత్ర పేరు నిలబడిపోయింది. మూత ఉండకూడదు... రమణ గారికి భోజనం చేసేటప్పుడు గిన్నె మీద మూత పెట్టకూడదు. అలా ఉంటే ఆయన అన్నం తినడానికి ఇష్టపడరు. మూత తీసి ఉంచి, కొద్ది కొద్దిగా వడ్డిస్తూ ఉంటే తింటారు. అప్పుడే తనకు తృప్తిగా భోజనం చేసినట్టు అనిపిస్తుందనేవారు.