‘గుర్తింపు’నిచ్చేది విద్యార్థులే..! | Tummala papi reddy about naac recognition | Sakshi
Sakshi News home page

‘గుర్తింపు’నిచ్చేది విద్యార్థులే..!

Published Fri, May 18 2018 3:09 AM | Last Updated on Fri, May 18 2018 3:09 AM

Tummala papi reddy about naac recognition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉన్నత విద్యాసంస్థలకు నేషనల్‌ అసెస్‌మెంట్‌ అక్రెడిటేషన్‌ కౌన్సి ల్‌ (న్యాక్‌) ఇచ్చే గుర్తింపులో విద్యార్థుల అభిప్రాయాలు కీలకం కానున్నాయని, వారి ప్రకారం అన్నీ బాగుంటేనే గుర్తింపు ఇచ్చే అవకాశం ఉంటుందని ఉన్నత విద్యా మం డలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. దీని ప్రకారమే భవిష్యత్తులో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నిధులు విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఈ మేరకు కేంద్రం అవసరమైన మార్పులు చేస్తోందని చెప్పారు. అందుకనుగుణంగా రాష్ట్రం లోని విద్యా సంస్థలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే కేంద్రం నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ప్రవేశపెట్టిందని వివరించారు. రాష్ట్రంలోని వర్సిటీలు, ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు వరల్డ్‌ ర్యాంకింగ్‌ పొందేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఉన్నత విద్యామండలి కార్యాలయంలో గురువారం టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వరల్డ్‌ ర్యాంకింగ్‌ ప్రతినిధులు, రాష్ట్ర వర్సిటీల వీసీలు, డీన్స్, సీనియర్‌ ప్రొఫెసర్లతో వర్క్‌షాప్‌ జరిగింది.

కార్యక్రమంలో గవర్నర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ హరిప్రీత్‌సింగ్, ఉన్నత విద్యా శాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, ఇంటర్‌ విద్య కమిషనర్‌ అశోక్, ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మన్లు ప్రొఫెసర్‌ లింబాద్రి, ప్రొ.వెంకటరమణ, టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ లీడ్‌ నిక్కీ హార్సెమన్, సౌత్‌ ఏసియా రీజనల్‌ డైరెక్టర్‌ రితిన్‌ మల్హోత్ర, అమెరికా కాన్సులేట్‌ కాన్సులర్‌ సెక్షన్‌ చీఫ్‌ డొనాల్డ్‌ ములిగాన్‌ పాల్గొన్నారు.

టీచింగ్, పరిశోధనలు, పరిశ్రమలు, నిధులు, ఆవిష్కరణలు, వరల్డ్‌ ఔట్‌లుక్‌ వంటి 5 కేటగిరీలను పరిగణనలోకి తీసుకొని ర్యాంకింగ్‌ ఇస్తున్నట్లు టైమ్స్‌ ప్రతినిధులు వెల్లడించారు. రాష్ట్రంలోని ఉస్మానియా వంటి వర్సిటీలు 800కుపైగా ర్యాంకింగ్‌లో ఉండటానికి కారణం అధ్యాపకుల కొరతతో పరిశోధనలు లేకపోవడమేనని అన్నారు.  ఈ లోపాలను సవరించుకుంటే మంచి ర్యాంకు వస్తుందని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement