(సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం) : ఉన్నతమైన, ప్రకాశవంతమైన చదువులకు ప్రతీకగా... ‘తేజస్వినావధీతమస్తు’ అనే సమున్నత ఆశయంతో ఏటా వేలాది మంది విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దుతున్న ఆంధ్రా విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యున్నత వర్సిటీల్లో ఒకటిగా నిలిచింది. సాగర తీరంలో, విశాలమైన ప్రాంగణంలో, ప్రశాంత వాతావరణంలో అత్యున్నత వసతులు, ప్రమాణాలతో విద్యనందిస్తూ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్)ను మెప్పించి, ఏ డబుల్ ప్లస్ గ్రేడ్ పొందింది.
నాక్ ఏయూలోని వసతులను ప్రత్యక్షంగా పరిశీలించి ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్‌ను మంజూరు చేసింది. దేశంలో అత్యున్నత కోర్సులు, బోధన, సౌకర్యాలు, కలిగిన అతి కొద్ది యూనివర్సిటీలకు దక్కే ఈ గ్రేడ్‌ను ఏయూ కూడా సాధించడం విశేషం. దేశంలో 3.74 స్కోర్ బెంగళూరు, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలతో పాటు ఆంధ్రా యూనివర్సిటీకి మాత్రమే దక్కింది. టాప్ స్కోర్ దక్కిన నేపథ్యంలో 2030 వరకూ వర్సిటీకి ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ ఉండనుంది. ఈ ర్యాంకులను అధికారికంగా ఈ నెల 14న ప్రకటించనున్నట్టు తెలిసింది.
ఏయూ చరిత్రలో తొలిసారిగా..
నాలుగు పుస్తకాల్లోని పాఠాలు బోధించి, మార్కులతో కూడిన పట్టాని చేతిలో పెట్టి పంపించే రోజులకు స్వస్తి చెబుతూ.. యూనివర్సిటీ ఇటీవలి కాలంలో విద్యార్థి అభివృద్ధికి మార్గదర్శిగా.. పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. వివిధ దేశాలు, యూనివర్సిటీలు, సంస్థల ఒప్పందాలతో చదువుకు సహకారం అందిస్తూ.. ప్రతి విద్యార్థినీ ఉన్నతంగా తీర్చిదిద్దుతూ జాతీయ స్థాయిలో అత్యున్నత స్థానం పొందింది.
ఆంధ్ర విశ్వవిద్యాలయం 2002లో తొలిసారిగా 86.05 స్కోర్‌తో నాక్ ఏ గ్రేడ్ పొందింది. తరువాత 2008లో 3.64తో ఏ గ్రేడ్‌ను, 2016లో 3.6 స్కోర్‌తో మరోసారి ఏ గ్రేడ్‌ను సాధించింది. తాజాగా జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్‌ని పొందింది. ఏయూలో అత్యుత్తమ విద్యా విధానాలకు, సమర్ధతకు ఈ ర్యాంకు నిదర్శనం. రానున్న ఆరేళ్ల కాలానికి ఈ ర్యాంకు యూనివర్సిటీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిలుస్తుంది.
మూడు రోజులు క్షుణ్ణంగా పరిశీలన
ఈ నెల 4, 5, 6 తేదీలలో ఏయూలో నాక్ బృందం పర్యటించింది. వర్సిటీలో మౌలిక వసతులు, బోధన ప్రగతి తదితర అంశాలను కమిటీ సభ్యులు ప్రత్యక్షంగా, క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టి, నిర్వహిస్తున్న స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్, సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్, యోగా, సైకాలజీ, స్పోర్ట్స్ విభాగాలతో పాటు విభిన్న విభాగాలలో సాధిస్తున్న ప్రగతిని ప్రత్యక్షంగా పరిశీలించారు. 4.0 స్కేల్ పై 3.74 స్కోర్‌ను అందిస్తూ.. ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ మంజూరు చేశారు.
ఈ విజయం వెనుక సీఎం వైఎస్ జగన్
ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంతటి ఘనవిజయం సాధించడం వెనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దార్శనికత ఉంది. విశ్వవిద్యాలయాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దాలన్న సీఎం జగన్ ఆకాంక్షలకు, ఆలోచనలకు అనుగుణంగా పలు మార్పులు చేస్తున్న వైస్ చాన్సలర్ ఆచార్య పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి కృషి ఉంది. వీరిద్దరూ కలిసి గత నాలుగేళ్లుగా వర్సిటీలో పలు సంస్కరణలు తెచ్చారు. విశ్వవిద్యాలయాల్లో ఎన్నడూ లేని విధంగా స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్లు నెలకొల్పడం, చైర్ ప్రొఫెసర్లని ఏర్పాటు చేయడం తదితర మార్పులు చేశారు.
సమాజ ఉపయుక్తంగా, పరిశ్రమల అవసరాలు తీర్చే వైవిధ్య పరిశోధన కేంద్రంగా మార్చారు. ఇంజనీరింగ్‌తో సమానంగా సైన్స్, ఆర్ట్స్ కోర్సులను ఉపాధి కల్పించేవిగా రూపుదిద్దారు. ప్రపంచంలోని ఏ పరిశ్రమకైనా అవసరమైన మానవ వనరులను తీర్చిదిద్దేలా యూనివర్సిటీ రూపాంతరం చెందింది. విశ్వవిద్యాలయంలో చేరే ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు ఈ సంస్కరణలు ఊతమిస్తున్నాయి. ఇక్కడ చదివే ప్రతి విద్యార్థీ ఉన్నత సంస్థల్లో ఉపాధి పొందేలా విద్యా ప్రణాళికలను రూపొందించారు. దీంతో వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
ఇప్పటివరకు ఆంధ్రా యూనివర్సిటీ 100 పేటెంట్స్ కోసం దరఖాస్తు చేసింది. ఇక్కడి స్టార్టప్ సెంటర్‌లో 150 స్టార్టప్స్ ప్రారంభమయ్యాయి. ఇవన్నీ విశ్వవిద్యాలయాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. విశ్వవిద్యాలయం ఏ డబుల్ ప్లస్ గ్రేడ్ సాధించి, దేశంలో ఉన్నత స్థానాన్ని పొందడంపై వీసీ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్, రెక్టార్లు, ప్రొఫెసర్లు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
ఏయూలో కోర్సుల వివరాలు..
యూజీ ప్రోగ్రామ్స్ – 36
పీజీ ప్రోగ్రామ్స్ – 118
పీహెచ్‌డీ – 57
పీజీ డిప్లొమా – 03
డిప్లొమా – 08
సర్టిఫికెట్/అవేర్‌నెస్ – 03
టీచింగ్ స్టాఫ్ – 538 మంది
నాన్ టీచింగ్ స్టాఫ్ – 2,270 మంది
విద్యార్థులు – 10,338 మంది
Comments
Please login to add a commentAdd a comment