ఇటీవల బెంగళూరు కేంద్రంగా జరిగిన కీలక సమావేశం
ఆ నిబంధనలపై ప్రైవేటు కాలేజీల అభ్యంతరం
న్యాక్ గుర్తింపును ఐచ్ఛికంగానే పరిగణించాలనే వాదన
నాన్–న్యాక్ కాలేజీల కేటగిరీ.. వచ్చే ఏడాది నుంచి అమలు
సాక్షి, హైదరాబాద్: నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు ఇప్పటివరకు లేకున్నా ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చేవి. న్యాక్‌ను కేవలం నాణ్యత ప్రమాణాలకు సూచిక గానే పరిగణించేవి. రాష్ట్రంలో 1100 కాలేజీల్లో, కేవలం ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు కలిపి 200 కాలేజీలకే న్యాక్ గుర్తింపు ఉంది. కానీ ఇక మీదట ప్రతీ కాలేజీ న్యాక్ పరిధిలోకి రావాల్సిందే.
ఇది ఉంటేనే అనుబంధ గుర్తింపు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలనే ప్రతిపాదన న్యాక్ తీసు కొస్తోంది. రాష్ట్రంలోని న్యాక్ గుర్తింపు ఉన్న (న్యాక్ కాలేజీలు), న్యాక్ గుర్తింపు లేని కాలేజీలు (నాన్–న్యాక్ కాలేజీలు)గా విభజి స్తారు. నాన్ న్యాక్ కాలేజీలకు క్రమంగా అను మతి ఇవ్వకూడదనే నిబంధన తేవాలనే యోచ నలో ఉన్నారు. ఈ మేరకు ఇటీవల బెంగళూరు కేంద్రంగా న్యాక్ విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించింది.
దక్షిణ భారత రాష్ట్రాల ఉన్నత విద్య మండళ్ళ చైర్మన్లను, పలువురు విద్యారంగ నిపుణులను ఈ సమావేశాలకు ఆహ్వానించింది. న్యాక్ నిబంధనలను మరింత సరళతరం చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై వివరించింది. కొత్త నిబంధనలపై రాష్ట్రాల స్థాయిలో అవగా హన కల్పించాలని కోరింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు సిద్ధమవ్వాలని సూచించింది.
90 శాతం కాలేజీలకు ఇబ్బందే!
మౌలిక సదుపాయాల పెంపు, ఫ్యాకల్టీ, ఫలితాలు, ఉపాధి అవకాశాలు, సొంత బిల్డింగ్ ఉందా? వంటి అంశాలకు న్యాక్ బృందం మార్కులు ఇస్తుంది. దీని ఆధారంగానే గ్రేడ్‌ను కేటాయిస్తుంది. ఎక్కువగా కార్పొరేట్ కళాశాలలు మాత్రమే ఈ ర్యాంకులు పొందుతున్నాయి. కాగా, ఇప్పటి వరకూ న్యాక్ బృందాలు కళాశాలలను స్వయంగా పరిశీలించిన తర్వాతే గుర్తింపు ఇచ్చేవి. అలా కాకుండా ఆన్‌లైన్‌లోనూ పరిశీలించి అనుమతులు ఇవ్వాలని భావిస్తున్నారు.
అయితే న్యాక్ నిబంధనలు అమలు చేయాలంటే 90 శాతం కళాశాలలు ఇబ్బందిపడే అవకాశం ఉంది. కార్పొరేట్ కళాశాలలు మాత్రమే దీనివల్ల విస్తరిస్తాయనే విమర్శలొస్తున్నాయి. దాంతో న్యాక్ నిబంధనల్లో కొంత సడలింపు ఇవ్వాలని మండళ్ళ చైర్మన్లు ప్రతిపాదిస్తున్నారు.
నాణ్యత లక్ష్యంగా సడలింపులు
న్యాక్ నిబంధనల్లో సమూల మార్పులు చేసేందుకు న్యాక్ కౌన్సిల్ ప్రతిపాదించింది. దీనిపై విస్తృత స్థాయి చర్చ జరిగింది. గుర్తింపు ప్రక్రియను మరింత సరళీకృతం చేయడమే దీని ఉద్దేశం. అన్ని కాలేజీలను న్యాక్ గుర్తింపు పరిధిలోకి తేవడం, నాణ్యత పెంచడమే లక్ష్యం. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్య మండలి చైర్మన్)
అలాగైతే ఇబ్బందే
న్యాక్ నిబంధనల పేరుతో చిన్నకాలేజీల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో నిరుద్యోగులు పెట్టుకున్న కాలేజీలు ఇప్పటికే అనేక ఇబ్బందుల్లో ఉన్నాయి. ఎన్నో కాలేజీలు మూతపడ్డాయి. న్యాక్ గుర్తింపును ఐచ్ఛికంగానే పరిగణించాలి. – గౌరీ సతీశ్, అధ్యక్షుడు, రాష్ట్ర ప్రైవేటు పీజీ, డిగ్రీ కాలేజీ యాజమాన్య సంఘం
మూడు కేటగిరీల ఏర్పాటు
ఇక మీదట విద్యా సంస్థలను 3 కేటగిరీలుగా విభజించాలని న్యాక్ భావిస్తోంది. విశ్వవిద్యాలయాలు, అటాన మస్ కాలేజీలు, అనుబంధ కాలేజీలు అనే 3 విభాగాలను గుర్తిస్తారు. కాగా, విశ్వవిద్యాలయాలు ఇప్పటికే అన్ని వసతులతో ఉంటాయి. అటానమస్ కాలేజీలూ నిధులు సమకూర్చుకోవడంలో వెనుకాడవు. కానీ అనుబంధ గుర్తింపు ఉన్న కాలేజీల్లో ఫ్యాకల్టీ, మౌలిక వసతుల ఇబ్బంది ఉందన్న వాదనలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment