పోలీసులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
కేరళలో మాదిరి ఇక్కడ కూడా ఏర్పాటు
సమాజంలో పెడధోరణులకు సాంకేతికత ఓ కారణం
పిల్లలకు మొబైల్‌ఫోన్లు దూరంగా ఉంచితే చాలా సమస్యలు నివారించవచ్చు
నియోజకవర్గానికో స్టేడియం ఏర్పాటు చేస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: కళాశాలల్లో మోరల్ పోలీసింగ్‌ను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. అన్ని ఇంటరీ్మడియెట్, డిగ్రీ కళాశాలల్లో కేరళ మాదిరిగా మోరల్ పోలీసింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
సమాజంలో ఉండే సమస్యలను మనమే గుర్తించి పరిష్కరిస్తే.. దుష్ఫలితాలను నివారించుకోవచ్చన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులను వలంటరీ పోలీసింగ్‌కు కోసం వినియోగించుకోవాలని సూచించారు.శనివారం జేఎన్‌టీయూలో వలంటరీ పోలీసింగ్ వ్యవస్థపై నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
సమాజంలో పెడధోరణులు పెరగడానికి సాంకేతికత ఓ కారణమన్నారు. పిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా పెడితే.. చాలావరకు సమస్యలను నివారించవచ్చని పేర్కొన్నారు. ఉమ్మడి కుటుంబాలు చిన్నారుల మానసిక దృఢత్వానికి తోడ్పతాయని, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడమే చిన్నారుల మానసిక బలహీనతలకు కారణమని వ్యాఖ్యానించారు.
డ్రగ్స్ రహిత సమాజం కోసం..
డ్రగ్స్ నిర్మూలనపై సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. మత్తు పదార్థాలతో జరిగే నష్టాల గురించి పాఠశాలలు, కళాశాలల్లో పాఠ్యాంశంగా బోధించడంతోపాటు నైతిక పోలీసింగ్‌ను నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనించే వ్యవస్థ ఉండాలని నిర్వాహకులకు సూచించినట్లు తెలిపారు.
బడులు, కళాశాలల్లో ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్స్ అవసరం ఎంతో ఉందని తెలిపారు. వారితో పోలీసులకు సమాచారం చేరవేసే వ్యవస్థను తయారు చేసుకుంటే.. తెలంగాణను డ్రగ్స్‌రహిత రాష్ట్రంగా మార్చవచ్చని చెప్పారు. డ్రగ్స్‌పై ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందంటూ ‘మీ అన్నగా పిలుపునిస్తున్నా... డ్రగ్స్ నిర్మూలనకు సహకరించండి’అని విజ్ఞప్తి చేశారు.
క్రీడాకారులను ప్రోత్సహించేలా నిర్ణయాలు
తమ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని నిర్ణయించిందని, అందుకోసం ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక స్టేడియం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. భవిష్యత్‌లో క్రీడాకారులను ప్రోత్సహించేలా నిర్ణయాలు ఉంటాయన్నారు.
ప్రజాప్రతినిధి అనేది అత్యంత పవిత్రమైన బాధ్యతని, ప్రజా సమస్యలపై ఫోకస్‌గా పనిచేయడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. సమస్యలకు భయపడి పారిపోకుండా, పోరాడాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీకైనా, బిల్ గేట్స్‌కైనా, రేవంత్ రెడ్డికైనా ఉండేది రోజుకు 24 గంటలేనని, రోజుకు 16 గంటలు మీరు ఎంత ఫోకస్‌గా పనిచేస్తే అంత బాగా మీ లక్ష్యాలను చేరుకోవచ్చని సూచించారు.
ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు డీజీపీ డాక్టర్ జితేందర్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment