సాక్షి, హైదరాబాద్: డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. బుధవారం పాపిరెడ్డి ఓ మీడియా చానెల్‌తో మాట్లాడుతూ గతంలో ఒక రూమ్ లో 40 మందిని కూర్చోబెట్టి పరీక్ష నిర్వహించే వాళ్ళమని, ఇప్పుడు 20 మంది మాత్రమే కూర్చొని పరీక్ష రాస్తారని అన్నారు. ప్రతి విద్యార్థికి మద్యలో ఒక బెంచ్ ఖాళీగా వుంటుందని, అయితే ఇన్విజిలేటర్లు మాత్రం బయటి నుంచి వస్తారని, సాధ్యమైనంత త్వరగా ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. మరోవైపు పరీక్ష రాయలేని వాళ్లకు అడ్వాన్స్ సప్లిమెంటరీ నిర్వహిస్తామని, సర్టిఫికేట్లో మాత్రం రెగ్యులర్ అనే వస్తుందని పేర్కొన్నారు.
కాగా ప్రతి విద్యార్థి మాస్క్ ధరించి పరీక్షకు హాజరవ్వాలని ఇప్పుడు మాత్రం చివరి సంవత్సర విద్యార్థులకే పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన 6 యూనివర్సిటీలలో రెండు లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని, ఒక వేళ బ్యాక్ లాగ్స్ వుంటే మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. మరోవైపు ఎంసెట్ రాయలేని వారి గురించి ప్రభుత్వ పరంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని పాపిరెడ్డి స్ఫష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment