
పాతబస్తీలో వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా ఇద్దరు..
అంబర్‌పేటలో గణేశ్ మండపం ఏర్పాటు చేస్తుండగా ఒకరు..
కామారెడ్డి జిల్లాలో విగ్రహాన్ని తరలిస్తుండగా మరొకరు..
చాంద్రాయణగుట్ట/అంబర్‌పేట/మాచారెడ్డి: వినాయక చవితి ఏర్పాట్లలో ఉండగా...వేర్వేరు చోట్ల జరిగిన విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందగా, ఒకరు త్రీవంగా గాయపడ్డారు. రామాంతపూర్‌లో శ్రీకృష్ణుడి శోభాయాత్రలో విద్యుదాఘాతంతో ఐదుగురి మృతి చెందిన ఘటన మరవకముందే మరో నలుగురు మృత్యువాత పడ్డారు. పాతబస్తీలోని పురానాపూల్ చంద్రికాపురం బైరూపియా గల్లీకి చెందిన అఖిల్ గణనాథుడిని ప్రతిష్టించడానికి 15 మంది స్నేహితులతో కలిసి విగ్రహాన్ని తెచ్చేందుకు సోమవారం రాత్రి జల్‌పల్లి సమీపంలోని లక్ష్మీగూడకు వెళ్లారు.
22 అడుగుల ఎత్తు ఉన్న విగ్రహాన్ని కొనుగోలు చేసి..తక్కువ ఎత్తులో ఉండే ట్రాలీలో పెట్టి ట్రాక్టర్‌పై తీసుకొస్తున్నాడు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో బండ్లగూడలోని రాయల్ సీ హోటల్ ఎదురుగా వచి్చన సమయంలో రోడ్డుకు అడ్డంగా వెళుతున్న 33 కేవీ హై ఓల్టేజీ విద్యుత్ తీగలు వినాయక విగ్రహ కిరీటానికి తాకాయి. దీంతో కరెంట్ షాక్ తగిలి ట్రాక్టర్ డ్రైవర్ రత్లావత్ ధోని(19), వికాస్ ఠాకూర్(21), అఖిల్‌లకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సంతోశ్‌నగర్‌లోని ఒవైసీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ధోని, వికాస్ మృతి చెందారు.
అఖిల్ పరిస్థితి విషమంగానే ఉందని పోలీసులు తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం నాగులపల్లి తండాకు చెందిన డ్రైవర్ ధోనికి మూడు నెలల క్రితమే దగ్గరి బంధువుల అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉండగానే ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది.
స్నేహితులతో కలిసి ఏర్పాట్లలో ఉండగా...
హనుమకొండకు చెందిన నందబోయిన రాజు తన కుటుంబంతో కలిసి బాగ్‌అంబర్‌పేట రెడ్‌బిల్డింగ్ సమీపంలో నివసిస్తున్నాడు. ఇతని కుమారుడు రామ్‌చరణ్ తేజ(18) కొన్నేళ్లుగా స్నేహితులతో కలిసి గణేశ్ ఉత్సవాలు నిర్వహిస్తున్నాడు. సోమవారం కామాక్షి అపార్ట్‌మెంట్ ఎదుట గణేశ్ మండపానికి స్నేహితులతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నారు.
రామ్‌చరణ్ మండపంపైకి ఎక్కి పెద్ద కర్రలు సర్దుతుండగా ఒక కర్ర.. పైనుంచి వెళుతున్న హైటెన్షన్ వైర్లకు తగిలింది. దీంతో అప్పటికే పచ్చిగా ఉన్న కర్రకు విద్యుత్ సరఫరా కావడంతో షాక్ తగిలి రామ్‌చరణ్ తేజ ఒక్కసారిగా కిందపడిపోయాడు. గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు.
పుట్టిన రోజే...: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గోపాల్‌నగర్‌కు చెందిన 15 మంది యువకులు గణేశ్ విగ్రహం కోసం నిజామాబాద్ జిల్లా పెర్కిట్‌కు వెళ్లారు. అక్కడి నుంచి ట్రాక్టర్‌లో విగ్రహాన్ని తరలిస్తుండగా పాల్వంచ మండలం ఆరెపల్లి స్టేజీ వద్ద ప్రధాన రహదారిపై 11 కేవీ విద్యుత్ తీగలకు విగ్రహానికి సపోర్టుగా కట్టిన ఇనుపరాడ్లు తగిలాయి. దీంతో అక్కడే ఉన్న కొమ్ము లక్ష్మీనారాయణ(19) కరెంట్‌షాక్‌తో మృతి చెందాడు.
మరో యువకుడు సాయి స్పృహ కోల్పోయాడు. వెంటనే అతన్ని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. మృతుడు లక్ష్మినారాయణది మంగళవారమే పుట్టిన రోజు. విగ్రహంతో ఇంటికి చేరిన తర్వాత కేక్ కట్ చేసి ఆనందంగా గడపాలని స్నేహితులు అనుకున్నారు. అంతలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
విద్యుత్ వైర్లు తగలలేదు: సీఎండీ
సంఘటన స్థలాన్ని టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. 33కేవీ విద్యుత్ లైన్లు తెగడం గానీ, వేలాడటం గానీ జరగలేదని, ఇందులో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం లేదన్నారు. హైఓల్టేజీ లైన్‌కు రెండు అడుగుల దూరం ఉన్నా, ఇండక్షన్ స్పార్క్ (ప్రేరణ జ్వాల) వస్తుందని, ఆ స్పార్క్ కారణంగానే యువకులు భయపడి కిందకు దూకి ప్రాణాలు పోగొట్టుకున్నారన్నారు. డ్రైవర్ కిందకు దూకే క్రమంలో టైర్ కింద పడ్డాడని, మరో యువకుడు డివైడర్ వైపు దూకి చనిపోయాడని చెప్పారు. వర్షాకాలంలో విద్యుత్ లైన్లకు ఐదు అడుగుల దూరంగా ఉండాలని సీఎండీ సూచించారు.