సాక్షి, హైదరాబాద్ : బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎడ్‌సెట్–2020 నోటిఫికేషన్‌ను ఈనెల 20న జారీ చేయాలని, 24వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఎడ్‌సెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఎడ్‌సెట్ రాసేందుకు ఓరియంటల్ కాలేజీల్లో డిగ్రీ చేసిన వారికి కూడా అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు ఓరియంటల్ కాలేజీల్లో బీఏ (లాంగ్వే జెస్) చేసిన వారిని పండిట్ కోర్సులకే పరిమితం చేయగా, ఇకపై వారు బీఎడ్ చేసేందుకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు ఎడ్‌సెట్ నిబంధనల్లో ఈ అంశాన్ని పొందుపరిచినట్లు పాపిరెడ్డి వెల్లడించారు. విద్యార్థులు ఆన్‌లైన్లో (https: //edcet.tsche.ac.in) ఏప్రిల్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎడ్‌సెట్ కన్వీనర్ టి.మృణాళిని తెలిపారు. రూ.650 పరీక్ష ఫీజు గా నిర్ణయించామని, ఎస్సీ, ఎస్టీలతోపాటు వికలాంగులకు మాత్రం రూ.450గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రూ.500 ఆలస్య రుసుముతో విద్యార్థులు ఏప్రిల్ 25వ తేదీ వరకు, రూ.100 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 30వ తేదీ వరకు, రూ.2 వేల ఆలస్య రుసుముతో మే 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామన్నారు. ఎడ్‌సెట్ పరీక్షను మే 23వ తేదీన నిర్వహిస్తామన్నారు. రెండు సెషన్లలో పరీక్షలు ఉంటాయని, ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. ఫలితాలను జూన్ 11వ తేదీన విడుదల చేస్తామని తెలిపారు.
14 రీజనల్ సెంటర్ల ఏర్పాటు..
ఇక ఎడ్‌సెట్ పరీక్షల నిర్వహణ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 14 రీజనల్ సెంటర్లను ఏర్పాటు చేశామని ఎడ్‌సెట్ కన్వీనర్ టి.మృణాళిని తెలిపారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నర్సంపేట్, నిజామాబాద్, ఖమ్మం, సత్తుపల్లి, కోదాడ, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, సిద్దిపేట, విజయవాడ, కర్నూల్‌లో ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను, అర్హతలు, సిలబస్, మోడల్ పేపర్లను తమ వెబ్‌సైట్‌లో పొందవచ్చని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment