B.ed
-
AP TET 2022: ప్రారంభమైన ఏపీ టెట్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (ఏపీటెట్)–ఆగస్టు 2022 శనివారం (నేటి) నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 21 వరకు కంప్యూటరాధారితంగా ఇవి జరుగుతాయి. ఈ పరీక్షలకు 5.25 లక్షల మంది వరకు అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో 150 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటుచేశారు. రాష్ట్రంతోపాటు ఒడిశా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలోనూ వీటిని ఏర్పాటుచేశారు. ఇక టెట్ ఉత్తీర్ణత సర్టిఫికేట్ చెల్లుబాటు ఇంతకుముందు ఏడేళ్లుగా ఉండేది. కానీ, కేంద్ర ప్రభుత్వం దీన్ని మార్పుచేసి చెల్లుబాటును జీవితకాలంగా ప్రకటించింది. వెయిటేజీతో పెరిగిన అభ్యర్థులు ఇక ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంటు టీచర్ పోస్టుల అర్హత కోసం నిర్వహించే ఈ పరీక్షల్లో వచ్చే మార్కులకు డీఎస్సీ ఎంపికల్లో 20 శాతం వెయిటేజీ ఇవ్వనుండడంతో కొత్తగా డీఎడ్, బీఈడీ కోర్సులు పూర్తిచేసిన వారితో పాటు గతంలో ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు కూడా తమ స్కోరు పెంచుకునేందుకు ఈసారి టెట్ పరీక్షలకు హాజరవుతున్నారు. టెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు డిగ్రీ రిజర్వుడ్ అభ్యర్థుల అర్హత మార్కులను 45 నుంచి 40కి తగ్గించారు. దీనివల్ల కూడా అదనంగా మరో 50వేల మంది దరఖాస్తు చేశారు. అభ్యర్థుల సంఖ్య పెరగడం.. రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు తగినన్ని లేకపోవడంతో పలువురు అభ్యర్థులకు ఇతర రాష్ట్రాల్లోని సెంటర్లను కేటాయించారు. దీంతో వారు ఇబ్బందికి గురవుతున్నారు. -
ఓరియంటల్ విద్యార్థులకు ఎడ్‌సెట్
సాక్షి, హైదరాబాద్ : బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎడ్‌సెట్–2020 నోటిఫికేషన్‌ను ఈనెల 20న జారీ చేయాలని, 24వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఎడ్‌సెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఎడ్‌సెట్ రాసేందుకు ఓరియంటల్ కాలేజీల్లో డిగ్రీ చేసిన వారికి కూడా అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు ఓరియంటల్ కాలేజీల్లో బీఏ (లాంగ్వే జెస్) చేసిన వారిని పండిట్ కోర్సులకే పరిమితం చేయగా, ఇకపై వారు బీఎడ్ చేసేందుకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎడ్‌సెట్ నిబంధనల్లో ఈ అంశాన్ని పొందుపరిచినట్లు పాపిరెడ్డి వెల్లడించారు. విద్యార్థులు ఆన్లైన్లో (https: //edcet.tsche.ac.in) ఏప్రిల్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎడ్‌సెట్ కన్వీనర్ టి.మృణాళిని తెలిపారు. రూ.650 పరీక్ష ఫీజు గా నిర్ణయించామని, ఎస్సీ, ఎస్టీలతోపాటు వికలాంగులకు మాత్రం రూ.450గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రూ.500 ఆలస్య రుసుముతో విద్యార్థులు ఏప్రిల్ 25వ తేదీ వరకు, రూ.100 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 30వ తేదీ వరకు, రూ.2 వేల ఆలస్య రుసుముతో మే 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తామన్నారు. ఎడ్‌సెట్ పరీక్షను మే 23వ తేదీన నిర్వహిస్తామన్నారు. రెండు సెషన్లలో పరీక్షలు ఉంటాయని, ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. ఫలితాలను జూన్ 11వ తేదీన విడుదల చేస్తామని తెలిపారు. 14 రీజనల్ సెంటర్ల ఏర్పాటు.. ఇక ఎడ్‌సెట్ పరీక్షల నిర్వహణ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 14 రీజనల్ సెంటర్లను ఏర్పాటు చేశామని ఎడ్‌సెట్ కన్వీనర్ టి.మృణాళిని తెలిపారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నర్సంపేట్, నిజామాబాద్, ఖమ్మం, సత్తుపల్లి, కోదాడ, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, సిద్దిపేట, విజయవాడ, కర్నూల్లో ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను, అర్హతలు, సిలబస్, మోడల్ పేపర్లను తమ వెబ్సైట్లో పొందవచ్చని వివరించారు. -
టీచర్ ‘చదువులకు’ వెనకాడుతున్నారు
2012లో ఉమ్మడి రాష్ట్రంలో టీచర్ నియామకాలను చేపట్టిన ప్రభుత్వం ఐదేళ్ల తరువాత 2017లో చర్యలు తీసుకుంది. భర్తీ ఇంకా పూర్తి కాలేదు. భర్తీలో జాప్యం, ప్రైవేట్‌లో వచ్చే వేతనాలు తక్కువగా ఉండటం టీచర్ కోర్సులపై ప్రభావం చూపుతోంది. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యా కోర్సులకు డిమాండ్ తగ్గిపోతోంది. విద్యారంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఇచ్చేవేతనాలు చాలక ఉపాధ్యాయ విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు వెనుకంజ వేస్తున్నారు. గతంలో టీచర్ కావాలన్న ఆశతో భారీ ఎత్తున ఉపా ధ్యాయ కోర్సులను అభ్యసించగా క్రమంగా డిప్లొమా ఇన్ ఎలి మెంటరీ ఎడ్యు కేషన్ (డీఎడ్), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) వంటి కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు వెనుకాడుతున్నారు. ఈ ఐదేళ్లలో ఆయా కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోయింది. డీఎడ్‌లో గతంలో 11 వేలకుపైగా విద్యార్థులు చేరితే ఇప్పుడు ఆ సంఖ్య 5 వేలకు పడిపోయింది. అలాగే బీఎడ్‌లోనూ గతంలో 16 వేల మందికిపైగా విద్యార్థులు చేరితే వారి సంఖ్య 12 వేలకు తగ్గిపోయింది. దీంతో ఈ సంవత్సరంలో పదుల సంఖ్యలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. తగ్గిపోయిన అవకాశాలు.. ఉపాధ్యాయ విద్యలో 2010 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి. ఓవైపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటేటా తగ్గిపోతోంది. దీంతో ఆ ప్రభావం నియామకాలపైనా పడుతోంది. ఫలితంగా 2012లో ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలను చేపట్టిన ప్రభుత్వం ఐదేళ్ల తరువాత 2017లో ఉపాధ్యాయ నియామకాలకు చర్యలు చేపట్టింది. ఆ నోటిఫికేషన్ ద్వారా 8,972 పోస్టులను భర్తీ చేస్తోంది. ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. మళ్లీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రైవేటు రంగంలో ఇచ్చే వేతనాలు తక్కువగా ఉంటుండటంతో ప్రైవేటు స్కూళ్లలో ఉద్యోగాలు చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపడం లేదు. డీఎడ్‌కు భారీ దెబ్బ... బీఎడ్‌లో చేరే విద్యార్థుల సంఖ్యతో పోల్చితే డీఎడ్‌లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు అభ్యర్థులను గందరగోళంలో పడేస్తున్నాయి. ఒకప్పుడు డీఎడ్‌తోపాటు బీఎడ్ చేసిన వారు కూడా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు అర్హులే. అయితే 2010లో కొత్త నిబంధనల ప్రకారం బీఎడ్ చేసిన వారు కేవలం స్కూల్ అసిస్టెంట్‌గానే వెళ్లాలని, ఎస్జీటీ పోస్టులకు అనర్హులని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనలు తీసుకువచ్చింది. దీంతో అప్పటి నుంచి బీఎడ్‌కు డిమాండ్ తగ్గిపోతూ వచ్చింది. అయితే గతేడాది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం మరో నిబంధనను అమల్లోకి తెచ్చింది. బీఎడ్ చేసిన వారు ఉద్యోగం వచ్చాక చైల్డ్ సైకాలజీలో ఆరు నెలల ఇండక్షన్ ట్రైనింగ్ చేస్తే సరిపోతుందని పేర్కొంది. దీంతో డీఎడ్‌లో చేరే వారి సంఖ్య మరింతగా తగ్గిపోయింది. పైగా ఇంటర్ తరువాత రెండేళ్ల డీఎడ్ చేసేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. డిగ్రీ పూర్తయ్యాక ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనుకుంటే బీఎడ్ చేయవచ్చన్న ఆలోచన విద్యార్థుల్లో పెరిగిపోయింది. ఒకవేళ డీఎడ్ రెండేళ్లు చేసినా స్కూల్ అసిస్టెంట్ కావాలంటే మళ్లీ మూడేళ్లు డిగ్రీ చేయాలి. దాంతోపాటు మరో రెండేళ్లు బీఎడ్ చేయాల్సి వస్తోంది. వాటి కంటే ఇంటర్ తరువాత డిగ్రీ పూర్తి చేసి ఆ తరువాత బీఎడ్ చేస్తే సరిపోతుందన్న ఆలోచనలకు విద్యార్థులు వస్తున్నారు. దీంతో డీఎడ్వైపు పెద్దగా ఆసక్తి కనబరచడంలేదు. మూసివేతకు యాజమాన్యాల దరఖాస్తులు... రాష్ట్రంలో బీఎడ్, డీఎడ్ కాలేజీలను నడుపలేమంటూ యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. గత ఐదేళ్లలో బీఎడ్, డీఎడ్ కాలేజీల సంఖ్య తగ్గిపోయింది. 2015–16 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 225 బీఎడ్ కాలేజీలు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 208కి తగ్గిపోయింది. ఇందులో ఈ విద్యా సంవత్సరంలో 7–8 కాలేజీలు మూతపడ్డాయి. ఇక డీఎడ్ కాలేజీలు 210 ఉండగా ప్రస్తుతం అవి 140కి తగ్గిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో గత విద్యా సంవత్సరంలో 30 కాలేజీలు మూతపడగా ఈ విద్యా సంవత్సరంలో 40 డీఎడ్ కాలేజీలు మూసివేత కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. దీంతో ఆ మేరకు కాలేజీలు తగ్గిపోయాయి. -
బీఎడ్‌కు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష!
ఎంట్రన్స్‌తోపాటు ఎగ్జిట్ పరీక్ష కూడా.. - ఉపాధ్యాయ విద్యలో ప్రమాణాల పెంపుపై కేంద్రం దృష్టి - రాష్ట్రస్థాయి ప్రవేశ పరీక్షలకు మంగళం - నిబంధనలు రూపొందించాలని ఎన్‌సీటీఈకి ఆదేశాలు! సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ విద్యలో నాణ్యతా ప్రమాణాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రేపటి పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులకు అందే శిక్షణలోనే సరైన ప్రమాణాలు లేని కారణంగా ఆశించిన లక్ష్యాలు నెరవేరడం లేదని కేంద్రం గుర్తిం చింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీఎడ్ కోర్సులో ప్రవేశాలకు ఒకే ప్రవేశపరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే కోర్సు పూర్తయ్యాక జాతీయ స్థాయిలోనే 'ఎగ్జిట్' పరీక్ష నిర్వహించాలని యోచిస్తోంది. ఒక్కోచోట ఒక్కోలా.. ఉపాధ్యాయ విద్యకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ప్రవేశాల విధానం, ప్రవేశ పరీక్షల తీరు, కోర్సుల నిర్వహణ ఉండటంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఉపాధ్యాయ విద్యా కాలేజీలు కేవలం సర్టిఫికెట్లు ఇచ్చే కేంద్రాలుగా మారిపోయాయన్న విమర్శలూ ఉన్నాయి. మన రాష్ట్రంలోనూ అదే పరిస్థితి నెలకొంది. అందువల్లే 150కి పైగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్), లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ కాలేజీల్లో 2016–17 విద్యా సంవత్సరం ప్రవేశాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అటు బీఎడ్ ప్రవేశాల రెండో దశ కౌన్సెలింగ్‌కూ అనుమతివ్వలేదు. కొన్ని రాష్ట్రాల్లో బీఎడ్ తరగతుల నిర్వహణ కూడా లేకుండానే కాలేజీలు, సర్టిఫికెట్ల జారీ వ్యవహారాలు కొనసాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. వీటన్నింటి నేపథ్యంలోనే ఉపాధ్యాయ విద్యను దేశవ్యాప్తంగా ఒకే విధానంలో అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా 2014లో దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ విద్యా కోర్సులు, కాల వ్యవధి, టీచింగ్ ప్రాక్టీస్ వంటి అంశాల్లో ఏక రూప విధానాన్ని తీసుకువచ్చింది. తాజాగా జాతీయ స్థాయిలో ఒకే ప్రవేశ పరీక్ష విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించి, ఆ ర్యాంకుల ఆధారంగా అన్ని రాష్ట్రాల్లోని బీఎడ్ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టాలని యోచిస్తోంది. ఎగ్జిట్ పరీక్ష కూడా..! బీఎడ్ కోర్సు పూర్తి చేసుకున్న వారికి కాలేజీల్లో నిర్వహించే వార్షిక పరీక్షలే కాకుండా జాతీయ స్థాయిలో ఎగ్జిట్ పరీక్ష కూడా నిర్వహించేలా కేంద్రం కసరత్తు చేస్తోంది. అందులో అర్హత సాధించిన వారే బీఎడ్ కోర్సును పూర్తి చేసినట్లుగా, ఉత్తీర్ణులైనట్లు సర్టిఫికెట్లు ఇచ్చేలా నిబంధనల రూపకల్పనకు కసరత్తు చేస్తోంది. దీనిద్వారా కేవలం సర్టిఫికెట్ కోసం బీఎడ్ కోర్సు చదవకుండా ఉండేలా.. ఉపాధ్యాయ వృత్తి పట్ల శ్రద్ధ, ఆసక్తి కలిగిన వారే ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించేలా చర్యలు చేపట్టినట్లవుతుందని భావిస్తోంది. దీనివల్ల విద్యా బోధనలో నాణ్యతా ప్రమాణాలు మెరుగవుతాయని భావిస్తోంది. దీనికితోడు బీఎడ్ పూర్తి చేసిన వారికి కనీసం ఆరు నెలల పాటు ఏదైనా ప్రభుత్వ పాఠశాలలో ‘ఇండక్షన్ ట్రైనింగ్ (ప్రేరణ కలిగించే శిక్షణ)’ఉండేలా చర్యలు చేపడుతోంది. ఇందుకు అవసరమైన నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలిని (ఎన్సీటీఈ) కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదేశించినట్లు తెలిసింది. ఎన్సీటీఈ వాటిని ఈ ఏడాదిలోనే సిద్ధం చేస్తే.. 2018–19 విద్యా సంవత్సరం నుంచే బీఎడ్ ప్రవేశాల్లో కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు. -
బీఈడీ ఫలితాలు విడుదల
పాలమూరు యూనివర్సిటీ: విద్యార్థి దశలో కష్టపడే వారికే బంగారు భవిష్యత్ ఉంటుందని పీయూ వీసీ భూక్యా రాజారత్నం చెప్పారు. పీయూ పరిధిలో ఉన్న 31బీఈడీ కళాశాలల మొదటి ఏడాది వార్షిక ఫలితాలను శనివారం రాత్రి పీయూలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన రిజిస్ట్రార్ పాండురంగారెడ్డి, కంట్రోలర్ మధుసూదన్‌రెడ్డి, అడిషనల్ కంట్రోలర్ నూర్జహాన్‌తో కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 2466మంది విద్యార్థులు పరీక్ష రాయగా దీంట్లో 1474మంది ఉతీర్ణత సాధించినట్లు చెప్పారు. 992మంది విద్యార్థులు ప్రమోట్ అయ్యారని పేర్కొన్నారు. బీఈడీ ఫలితాల్లో 59.77శాతం ఉతీర్ణత సాధించడం మంచి విషయమన్నారు. అయితే పాలమూరు జిల్లాలో ఉన్నత విద్య అభ్యసించే వారి సంఖ్య పెరగాలని కోరారు. విద్యార్థి ఎప్పుడు కూడా ఒక కోర్సు అభ్యసిస్తున్న సమయంలో దానిపై పట్టుపెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
రేపటి నుంచి బీఈడీ కౌన్సెలింగ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎడ్‌సెట్-2015 తొలివిడత కౌన్సెలింగ్‌లో భాగంగా బుధవారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం కానున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ ప్రసాద్ తెలిపారు. సెప్టెంబర్ 5 నుంచి కళాశాల ఆప్షన్స్ ఇవ్వాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు tsedcet.ac.in అనే వెబ్సైట్ చూడవచ్చు. -
బిఈడిలకు మొండిచెయ్యి
-
ఎన్నాళ్లో ఈ నిరీక్షణ!
* బీఎడ్, డీఎడ్ అభ్యర్థుల ఆరాటం * డీఎస్సీ ప్రకటనలో సర్కారు జాప్యం * జిల్లాలో శిక్షణ పొందుతున్న 48 వేలమంది నిరుద్యోగులు * మంచి రాబడి కళ్లజూస్తున్న కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు భానుగుడి (కాకినాడ) : జిల్లాలో ప్రస్తుతం డీఎడ్, బీఎడ్ ఉత్తీర్ణులు 54 వేలమందికి మించి ఉండొచ్చని అంచనా. వీరితో పాటు ఇతర జిల్లాల నుంచి సైతం అభ్యర్థులు జిల్లాలో ఉన్న పలు కోచింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. కాకినాడ, రాజమండ్రి, ఇతర ప్రాంతాలలోని పలు కేంద్రాల్లో ఇప్పటికే 48 వేలమందికి పైగా శిక్షణ పొందుతున్నారు. వీరంతా పలు వసతి గృహాలలో, ప్రైవేట్ రూమ్‌లలో నెలకు రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు చెల్లించి ఉంటున్నారు. 3 నెలలకు పైగా కోచింగ్‌కు ఒక్కో అభ్యర్థీ రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చుచేస్తున్నారు. ఇదే అదనుగా అటు కోచింగ్ కేంద్రాలు, ఇటు బాలుర వసతి గృహాలు మంచి రాబడిని కళ్లజూస్తున్నాయి. జిల్లాలో ఖాళీలు ఇవీ.. జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ అన్ని విభాగాలకు సంబంధించి 331 ఖాళీలున్నాయి. ఇందులో ప్రతి పోస్టునూ దృష్టిలో ఉంచుకుంటే ఒక్కో ఉద్యోగానికి 150 మందికి పైగా అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. స్కూల్ అసిస్టెంట్ గణితం (25), బయొలాజికల్ సైన్సు(26), సోషల్ (79), ఇంగ్లీష్ (15), తెలుగు (27), హిందీ (14), ఉర్దూ(1), ఫిజికల్ డెరైక్టర్ (1), లాంగ్వేజ్ పండిట్ తెలుగు (83), లాంగ్వేజ్ పండిట్ ఉర్దు (1), లాంగ్వేజ్ పండిట్ సంస్కృతం(5), లాంగ్వేజ్ పండిట్ హిందీ(29), పీఈటీ(19) ఖాళీలున్నాయి. ఇందులో సోషల్‌లో ఒక్కో పోస్టుకు 3 వందల మందికి పైగా పోటీపడుతున్నారు. ఇదే తరహాలో మిగిలిన సబ్జెక్టులకు పోటీ ఉంది. ఇదిలా ఉండగా ఎస్జీటీ పోస్టులకు సంబంధించి 877 ఖాళీలున్నాయి. ప్రస్తుతం డీఎడ్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు సైతం డీఎస్సీకి అర్హత కల్పించనుండడంతో జిల్లాలో టెట్ క్వాలిఫై అయిన వారు 1600 మంది, డీఎడ్ పూర్తిచేసిన వారు 8 వందల మంది, ప్రస్తుతం డిఎడ్ పరీక్షలు పూర్తిచేసుకుంటున్న వారు 1800 మంది అభ్యర్థులు వెరసి 4200 మంది పోటీపడుతున్నారు. జిల్లాలో ఉన్న ఎస్జీటీ పోస్టుల సంఖ్యతో పోలిస్తే 1:4.8 గా ఈ నిష్పతి ఉండడం విశేషం. స్కూల్ అసిస్టెంట్లకు మరింత పోటీ స్కూల్ అసిస్టెంట్లకు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పోటీ మరింత పెరగనుంది. జిల్లాలో 2014 టెట్ పరీక్షకు 22,890 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా 19,921 మంది హాజరయ్యారు. 16 వేలమందికి పైగా ఉత్తీర్ణత సాధించారు. గతంలో టెట్ ఉత్తీర్ణులైన వారు, కాని వారిని కలుపుకొంటే జిల్లాలో 50 వేల మందికి పైగా ఉన్నట్టు అంచనా. వీరిలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ పరీక్షకు పోటీపడే వారే 26 వేలకు మించి ఉండొచ్చని సమాచారం. గందరగోళం..అయోమయం. ప్రభుత్వం ప్రస్తుతం బీఎడ్ అభ్యర్థులకు సైతం ఎస్జీటీ అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు, ఇటీవల పశ్చిమ బెంగాల్ వినతిని కేంద్రం తిరస్కరించిన నేపథ్యంలో అటు బీఎడ్ అభ్యర్థులు అవకాశం కోసం ఆశగా చూస్తుండగా, డీఎడ్ అభ్యర్థులు బీఎడ్ వారికీ అనుమతిస్తే తమ అవకాశాలకు గండిపడుతుందని ఆందోళన చెందుతున్నారు. -
21 నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్
28వ తేదీ వరకు సర్టిఫికెట్ల తనిఖీ 23 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు వెబ్ ఆప్షన్లు 3న సీట్ల కేటాయింపు... 6 నుంచి తరగతులు అర్హులు 1,47,188.. అందుబాటులో ఉన్న సీట్లు 69,068 ఇంకా అందని అఫిలియేషన్ల సమాచారం... అవి అందిన తర్వాతే కాలేజీలు, సీట్ల సంఖ్యపై స్పష్టత ఒక్క ఏడాది బీఎడ్ ఇదే ఆఖరు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో ఒకటైన ‘బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్)’లో ప్రవేశాల కోసం.. ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ తేదీలను ఏపీ ఉన్నత విద్యా మండలి గురువారం ప్రకటించింది. ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియను నిర్వహిస్తారు. 23వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి... 3వ తేదీన సీట్ల కేటాయింపును ప్రకటిస్తారు. బీఎడ్ తరగతులు 6వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. కాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కలిపి ఈ ప్రవేశాల ప్రక్రియను చేపడుతున్నందున కన్వీనర్‌గా ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన నిమ్మ వెంకట్రావు, కో-కన్వీనర్‌గా ఉస్మానియా వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సుధీర్‌రెడ్డిని నియమించారు. కౌన్సెలింగ్ కోసం తెలంగాణలో 23, ఆంధ్రప్రదేశ్‌లో 17 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పీఈసెట్) కౌన్సెలింగ్‌పై ఈ నెల 9న నిర్ణయించనున్నారు. అన్నింటికీ అఫిలియేషన్లు వచ్చేనా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని బీఎడ్ కాలేజీలకు ఇంకా అఫిలియేషన్లు లభించలేదు. రెండు రాష్ట్రాల్లో కలిపి 647 బీఎడ్ కాలేజీలు ఉండగా... కేవలం తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని 12 కాలేజీలకు ఇచ్చిన అఫిలియేషన్ల సమాచారం మాత్రమే ప్రవేశాల క్యాంపు అధికారులకు అందింది. అయితే కౌన్సెలింగ్ 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో... ఆ లోగా మిగతా కాలేజీల సమాచారం అందుతుందని భావిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. గత ఏడాది లాగే మొత్తం 647 బీఎడ్ కాలేజీల్లోని 69,068 సీట్ల భర్తీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అఫిలియేషన్లు పొందే కాలేజీల సంఖ్యను బట్టి కాలేజీలు, సీట్ల సంఖ్యలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ సారే ఆఖరు..! ఏడాది కాలవ్యవధి గల బీఎడ్ కోర్సు ఈసారే చివరిది కానుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీని కాలవ్యవధి రెండేళ్లకు పెరగనుంది. జస్టిస్ వర్మ కమిటీ సిఫారసుల మేరకు ఎన్సీటీఈ 2015-16 విద్యా సంవత్సరం నుంచి బీఎడ్, ఎంఎడ్ కోర్సులను రెండేళ్ల కోర్సులుగా మార్పు చేయనుంది. అంతేకాకుండా నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎడ్, బీఈఎల్ఈడీ కోర్సులను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. సబ్జెక్టుల వారీగా అర్హులు గణితం 30,582 ఫిజిక్స్ 11,909 జీవశాస్త్రం 36,113 సాంఘికశాస్త్రం 66,408 ఇంగ్లిష్ 2,176 గణాంకాలివీ.. పరీక్ష రాసింది: 1,49,005 అర్హత సాధించింది: 1,47,188 కాలేజీలు: 647.. సీట్లు: 69,068 తెలంగాణలో.. కాలేజీలు: 261.. సీట్లు: 27,744 అర్హులు: 97,477 ఆంధ్రప్రదేశ్‌లో.. కాలేజీలు: 386.. సీట్లు: 41,324 అర్హులు: 49,711 వర్సిటీల వారీగా.. వర్సిటీ పరీక్ష రాసింది అర్హులు ఏయూ 28,319 28,048 ఓయూ 98,745 97,477 ఎస్వీయూ 19,711 19,462 నాన్‌లోకల్ 2,230 2,201 మొత్తం 1,49,005 1,47,188 -
ఈసారికే ఏడాది బీఈడీ, ఎంఈడీ!
రెండేళ్ల బీఎడ్, ఎంఈడీకి దక్షిణాది రాష్ట్రాలు ఓకే సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈ డీ), మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఈడీ) కోర్సులు ఈసారికి (2014-15 విద్యా సంవత్సరంలో) మాత్ర మే. వచ్చే విద్యా సంవత్సరంలో అవి రెండేళ్ల కోర్సులుగా మారబోతున్నాయి. మార్గదర్శకాలను జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) త్వరలో జారీ చేయనుంది. దక్షిణాది రాష్ట్రాల్లోని బీఎడ్ కాలేజీల యాజమాన్యాలు, విద్యావేత్తలు, విద్యాశాఖ అధికారులతో ఎన్సీటీఈ శనివారం బెంగళూరులో సమావేశం నిర్వహించింది. ఉపాధ్యాయ విద్యలో కొన్ని సవరణలు మినహా మిగతా సంస్కరణలకు దక్షిణాది రాష్ట్రాలు సంపూర్ణ అంగీకారం తెలియజేశాయి. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి డెరైక్టర్ జగన్నాధరెడ్డి, పలువురు ప్రొఫెసర్లు, బీఈడీ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రభాకర్‌రెడ్డి, మల్లేశం తదితరులు హాజరయ్యారు. -
ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల
జూలై 21 నుంచి కౌన్సెలింగ్ విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉమ్మడిగా నిర్వహించిన ఎడ్‌సెట్-2014 ఫలితాలను గురువారం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. మొత్తం 1,66,112 మంది దరఖాస్తు చేయగా 1,49,005 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,47,188 మంది (98.78%) ఉత్తీర్ణత సాధించారు. ఏయూ పరిధిలో 32,418 మంది దరఖాస్తు చేయగా 28,319 మంది పరీక్షకు హాజరై 28,048 మంది (99.04%) అర్హత సాధించారు. ఉస్మానియా పరిధిలో 1,09,282 మంది దరఖాస్తు చేయగా 98,745 మంది పరీక్షకు హాజరై 97,477 మంది (98.72%), ఎస్వీయూ పరిధిలో 21,767 మంది దరఖాస్తు చేయగా 19,711 మంది పరీక్షకు హాజరై 19,462 మంది (98.74%) ఉత్తీర్ణత సాధించారు. బాపట్ల కేంద్రం నుంచి నూరుశాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య ఎల్.వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ జూలై 21 నుంచి ఎడ్‌సెట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ర్యాంకుల వివరాలు: గణితంలో హైదరాబాద్‌కు చెందిన ఎం.నాగరాజు, భౌతిక శాస్త్రంలో నల్లగొండకు చెందిన జి.జనార్దన్, బయలాజికల్ సెన్సైస్‌లో కడపకు చెందిన షేక్ నూర్ మహ్మద్, సోషల్ సెన్సైస్‌లో కర్నూలుకు చెందిన ఎన్.నందీశ్వరకుమార్, ఇంగ్లిష్‌లో రంగారెడ్డికి చెందిన సి.శామ్యూల్ ఫస్ట్‌ర్యాంక్ సాధించారు. యూజీసీ నెట్ హాల్‌టికెట్లు వెబ్సైట్లో సాక్షి, హైదరాబాద్: ఈ నెల 29న జరగనున్న యూజీసీ నెట్ పరీక్ష హాల్‌టికెట్లను వెబ్సైట్లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచినట్లు రీజియన్ కోఆర్డినేటర్ ప్రొ.రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. అభ్యర్థులు www.apset.org వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. 9 నుంచి దూరవిద్య పీజీ పరీక్షలు: ఓయూ దూరవిద్య పీజీ కోర్సుల మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు జూలై 9 నుంచి ప్రారంభమవుతాయి. పరీక్ష ఫీజు చెల్లించిన అభ్యర్థులు ఓయూ వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
దూరవిద్యలో ఎంఈడీ, బీఈడీ
ఎదులాపురం, న్యూస్‌లై న్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎంఈడీ, బీఈడీ, బీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్)లో 2014 సంవత్సరానికి గాను ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశ్వవిద్యాలయ సహాయ సంచాలకుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఈడీ ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులు బీఈడీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలని, 1 జూలై, 2014 నాటికి 23 సంవత్సరాలు నిండి ఉండాలని పేర్కొన్నారు. బీఈడీ, బీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్) ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని, 1 జూలై 2014 నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలని తెలిపారు. పూర్తిచేసిన దరఖాస్తు ఫారాలను ఏపీ ఆన్లైన్ కేంద్రంలో రిజిస్టర్ చేసుకోవడానికి ఈనెల 31 చివరి గడువు అని పేర్కొన్నారు. ఎంఈడీ పరీక్ష రిజిస్ట్రేషన్ ఫీజు రూ.535, బీఈడీ, బీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్) పరీక్షలకు రూ.435 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. జూన్ 22న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఎంఈడీ, బీఈడీ అర్హత పరీక్షలు ఉంటాయని, బీఈడీ స్పెషల్ అర్హత పరీక్ష జూన్ 22న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం ఫోన్ నంబర్ 08732-221016లో సంప్రదించాలని ఆయన సూచించారు. -
నేటి నుంచి బీఎడ్ వెబ్ కౌన్సెలింగ్
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : ఉపాధ్యాయ వృత్తికి సంబంధించి బీఈడీ కోర్సుకు ఒకప్పుడు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. డిగ్రీ పూర్తయ్యిందంటే అధికులు బీఈడీ చేసేందుకు ఆసక్తి చూపేవారు. ప్రభుత్వ కళాశాలల్లో సీటు లభించకుంటే ప్రైవేటుగానైనా కోర్సు పూర్తిచేసేవారు. కానీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను నెలకొన్నాయి. బీఈడీ చేసేందుకు విద్యార్థులు విముఖత చూపుతుండడంతో కోర్సుకు ఆదరణ తగ్గుతోంది. ఇందుకు రెగ్యులర్‌గా డీఎస్సీ నిర్వహించకపోవడం ఒక కారణమైతే.. స్కూల్‌అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే అర్హత కల్పించడం మరో కారణం. ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ విద్యార్థులకు అవకాశం కల్పిస్తుండడంతో విద్యార్థులు డైట్సెట్పైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఇక నేటి నుంచి ప్రారంభం కానున్న బీఈడీ కౌన్సెలింగ్‌కు ఎంత మంది హాజరవుతారో చూడాల్సి ఉంది. సగానికి తగ్గిన అభ్యర్థులు జిల్లాలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్‌లో ప్రైవేట్ బీఎడ్ కళాశాలలు ఉన్నాయి. ఉట్నూర్‌లో గిరిజన విద్యార్థుల కోసం గిరిజన బీఈడీ కళాశాల ఉంది. ఒక్కో కళాశాలలో 100 సీట్ల వరకు పరి మితి ఉంది. అదనంగా మేనేజ్మెంట్ కోటాలో 50 వరకు భర్తీ చే స్తారు. గతంలో బీఎడ్ ఎంట్రెన్స్‌కు 10 వేల మంది వరకు అభ్యర్థులు హాజరైతే ఈ విద్యా సంవత్సరంలో సంఖ్య ఐదు వేలకు పడిపోయింది. దీంతో బీఎడ్ వైపు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదనేది తెలుస్తోంది. మరోవైపు.. ప్రభుత్వ డీఎస్సీ ఎప్పుడు నిర్వహిస్తుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో వారు ఆ దిశగా ఆలోచించడంలేదు. నేటి నుంచి వెబ్‌కౌన్సెలింగ్.. 2003-14 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈనెల 29 నుంచి అక్టోబర్ 7 వరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో వెబ్‌కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. కౌన్సెలింగ్‌కు విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ తెలిపారు. ఎడ్‌సెట్ హాల్‌టికెట్, ర్యాంక్ కార్డు, డిగ్రీ ప్రొవిజనల్, మార్కుల జాబితా, పది, ఇంటర్మీడియేట్ మార్కుల మెమోలు, బోనోఫైడ్, టీసీ, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రం తీసుకురావాలన్నారు. కౌన్సెలింగ్ ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు.